అసెంబ్లీలో జగన్ ప్రమాణస్వీకారం

హైదరాబాద్, జూన్ 19: ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం శాసనసభలో ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతోపాటు పార్టీ ఎమ్మెల్యేలందరూ ప్రమాణస్వీకారం చేశారు. సహచర పార్టీ ఎమ్మెల్యేలతో కలసి తొలిసారిగా అసెంబ్లీ ప్రాంగణంలోకి అడుగుపెట్టిన శ్రీ జగన్ తెలుగులో దేవుడు పేరిట ప్రమాణస్వీకారం చేశారు. పార్టీ శాసన సభ్యులలో అత్యధికులు తెలుగులో దేవుడు పేరిట ప్రమాణస్వీకారం చేశారు.

సభలో ప్రొటెం స్పీకర్ పి. నారాణస్వామి ప్రమాణ స్వీకారం చేయవలసిందిగా శ్రీ జగన్ మోహన్ రెడ్డి పేరును చదవగానే పార్టీ ఎమ్మెల్యేలంతా బల్లలపై చరుస్తూ తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. అంతకు ముందు సభ సమావేశం కాగానే సభలో ప్రవేశించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు వరుసలో కూర్చున్న సభ్యులకు అభివాదం చేస్తూ శ్రీ జగన్ మోహన్ రెడ్డి కూర్చున్న టేబుల వద్దకు వచ్చి ఆయనకు అభివాదం చేశారు. ప్రతిగా జగన్ తన స్థానం నుంచి లేచి చంద్రబాబుకు ప్రతినమస్కారం చేస్తూ ఆయనతో మర్యాదపూర్వకంగా కరచాలనం చేసి, ఆయనను అభినందించారు.

శోభానాగిరెడ్డికి నివాళులు....
అసెంబ్లీలో దివంగత సభ్యులకు సంతాపం వ్యక్తం చేసే తీర్మానంపై స్పందిస్తూ శ్రీ జగన్ మోహన్ రెడ్డి పార్టీకి చెందిన దివంగత నాయకురాలు, ఆళ్ళగడ్డ ఎమ్మెల్యేగా ఎన్నికైన శ్రీమతి శోభా నాగిరెడ్డికి ఘనంగా నివాళులు అర్పించారు. 'శోభా నాగిరెడ్డి నాకు సోదరితో సమానం. నేను కష్టకాలంలో ఉన్నప్పుడు ఆమె నాకు కొండంత అండగా నిలబడ్డారు. ఆమె లేని లోటును పూడ్చడం చాలా కష్ణం' అన్నారాయన.

మహానేతకు శ్రీ జగన్ మోహన్ రెడ్డి నివాళులు...
శ్రీ జగన్ మోహన్ రెడ్డి పార్టీ శాసనసభ్యులతో కలసి బస్సులో లోటస్ పాండ్ క్యాంప్ కార్యాలయం నుంచి బయల్దేరి అసెంబ్లీ తొలి సమావేశాలకు వెళుతూ మార్గమధ్యంలో పంజాగుట్టలోని మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. శ్రీ జగన్ తోపాటు సహచర ఎమ్మెల్యేలందరూ కూడా మహానేతకు పుష్పాంజలి ఘటించారు

Back to Top