యాక్టర్లు..డైరెక్టర్లతో వస్తాడు జాగ్రత్త


– నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరు
– విలేజ్‌ మాల్స్‌ పేరుతో దోపిడీ
–అన్నదాతకు అండగా ఉంటా
–ప్రతి రైతుకు మేలో రూ.12500
– 9 గంటల పగటి పూట విద్యుత్‌ ఇస్తాం
– రైతులకు వడ్డీ లేని రుణాలు ఇస్తాం
–పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ధరల స్థిరీకరణ నిధి
  
అనంతపురం: మరోసారి మోసం చేసేందుకు చంద్రబాబు యాక్టర్లు, డైరెక్టర్లను వెంట బెట్టుకొని వస్తాడని, ఈ సారి వారి మాటలు నమ్మవద్దని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజలకు సూచించారు. నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో ఏ ఒక్కరూ కూడా సంతోషంగా లేరని, ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదని దుయ్యబట్టారు. రాజకీయాల్లో మార్పు తెచ్చేందుకు పోరాడుతున్నానని, తనకు మీ అందరి తోడు కావాలని వైయస్‌ జగన్‌ కోరారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా బుధవారం సాయంత్రం రాప్తాడులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ అశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసంగించారు.  ఈ నియోజకవర్గంలోని చాలా మంది తనను కలిశారు. ఇవాళ మనం అధికారంలో లేము అన్నది అందరికి తెలిసిన విషయమే. ఈ చంద్రబాబు చేస్తాడన్న నమ్మకం మాకు లేదని ప్రజలు అంటున్నారు. ఒక్కసారి మీకు చెప్పాలని, మన ప్రభుత్వం వచ్చాక మీరు చేస్తారన్న నమ్మకం ఉంటుందని ప్రతి ఒక్కరూ చెబుతున్నారని వైయస్‌ జగన్‌ పేర్కొన్నారు.  

ఈ ప్రభుత్వం మనకు మేలు చేసిందా?
నాలుగేళ్ల చంద్రబాబు పాలనను చూశాం. ఈ ప్రభుత్వం మనకు ఏమైనా మేలు చేసిందా అని అడుగుతున్నాను. ఇదే పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయ్యేందుకు నాలుగేళ్ల క్రితం ఏం చెప్పారు. అధికారంలోకి వచ్చాక ఏం చేశాడో మనం ఆలోచన చేయాలి. కరెంటు బిల్లులు తగ్గిస్తా అన్నాడు. ఇప్పుడేమో ఆ బిల్లులు షాక్‌ కొడుతున్నాయి. కరెంటోళ్లు నేరుగా మన ఇళ్లలోకి వచ్చి వేలల్లో జరిమానా వేస్తున్నారు.

విలేజ్‌ మాల్స్‌ రేట్లు చూడండి..
ప్రజా పంపిణీ వ్యవస్థను చంద్రబాబు నిర్వీర్యం చేస్తున్నాడని,  గ్రామాల్లో చంద్రన్న విలేజ్‌ మాల్స్‌ ఏర్పాటు చేసి దోపిడీకి తెర లేపారు.  ఈ విలేజ్‌ మాల్స్‌ను రిలయన్స్, ఫ్యూచర్‌ గ్రూప్‌ కంపెనీ వాళ్లు నడుపుతారట. ఇవాళ విజయవాడలో మొట్టమొదటి విలేజ్‌ మాల్‌ ఓపెన్‌ చేశారు. ఈ మాల్‌లో ఒక్కసారి రేట్లు చూడండి. చక్కెర, కంది పప్పు, పామాయిల్, కారంపొడి, ఉప్పు, చింతపండు మార్కెట్‌ ధర కంటే  విలేజ్‌ మాల్స్‌లో ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. మనకు మేలు చేస్తున్నట్లు మళ్లీ చంద్రబాబు ఫోజు కొడుతున్నారు. 

బాబు మోసపు మాటలు గుర్తుకు తెచ్చుకోండి
ఎన్నికల సమయంలో, ఎన్నికలు అయిపోయిన తరువాత చెప్పిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. బాబు సీఎం అయ్యేక పరిస్థితి ఏంటో ఆలోచన చేయండి. అధికారంలోకి వచ్చేందుకు చంద్రబాబు చెప్పిన మోసపు మాటలు గుర్తుకు తెచ్చుకోండి. ప్రతి ఇంటికి ఓ ఉద్యోగం ఇస్తామని, జాబు ఇవ్వకపోతే ప్రతి నెల రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ప్రతి  ఇంటికి రూ.90 వేలు చంద్రబాబు బాకీ పడ్డాడు. బ్యాంకుల్లో పెట్టిన మీ బంగారం ఇంటికి రావాలంటే బాబు సీఎం కావాలన్నారు. వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామన్నాడు. దాదాపుగా నాలుగేళ్లు కావోస్తుంది..మీ బంగారం ఇంటికి వచ్చిందా? డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామన్నారు. ఇంతవరకు ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు. ప్రత్యేక హోదా 15 ఏళ్లు తెస్తానని చెప్పారు. ప్రత్యేక హోదా తెచ్చారా? హోదాను అమ్మేశారు. ఇన్ని మోసాలు చూశారు కాబట్టి నేను చెబుతున్నాను. రేపు ఎన్నికలు జరుగుతాయి. మీకు ఎలాంటి నాయకుడు కావాలి? మోసం చేసేవారు,  అబద్ధాలు చెప్పే నాయకుడు సీఎం కావాలా? ఈ చెడిపోయిన వ్యవస్థ బాగుపడాలంటే ఒక్క వైయస్‌ జగన్‌కు సాధ్యం కాదు. మీ అందరూ ఈ వైయస్‌ జగన్‌కు తోడుగా ఉండాలి. అప్పుడే విశ్వసనీయత అనే పదానికి అర్థం వస్తుంది.

బాబును క్షమిస్తే..
చంద్రబాబును మనం క్షమిస్తే వచ్చె ఎన్నికల్లో ప్రతి ఇంటికి కేజీ బంగారం అంటాడు. ప్రతి ఇంటికి మారుతి కారు కొనిస్తా అంటాడు. ఈ మాటలు కూడా నమ్మరేమో అని సినిమా యాక్టర్లను, డైరెక్టర్లను పక్కన పెట్టుకొని వస్తారు. ఈ మధ్యకాలంలో ఓ డైరెక్టర్‌ బహుబలి సినిమా తీశారు. ఈయన్ను చంద్రబాబు పిలిపించుకొని అమరావతిపై మీరు సినిమా తీయమని కోరారట. అమరావతిలో పర్మినెంట్‌ పేరుతో ఒక్క ఇటుక కూడా పడలేదు. రేపు పొద్దున ఆ డైరెక్టర్‌ సినిమా సెట్లు వేస్తారు. అందులో నారాయణ పాత్ర. ఆ సినిమా తీసి అదిగో బాహుబలి అంటారు. యాక్టర్లను పిలిపించుకొని వచ్చి చంద్రబాబుకు చాలా ఎక్సిఫిరియన్స్‌ ఉంది, కేంద్రం సహకరించలేదని చెబుతారు. ఆ యాక్టర్‌ వచ్చినప్పుడు అయ్యా యాక్టర్‌ గారు చంద్రబాబు ఇన్ని మోసాలు చేసినప్పుడు ఆ మోసాల్లో మీ భాగస్వామ్యం లేదా అని అడగండి. కత్తి తీసుకొని ఓ వ్యక్తిని పొడిస్తే , ఆ వ్యక్తికి కత్తి ఇచ్చిన నీవు కూడా భాగస్వామికి కావా అని అడగండి. విశ్వసనీయతపై చైతన్యం రావాలి.

రాప్తాడు నియోజకవర్గం గురించి ప్రకాశ్‌ మాట్లాడుతూ అభివృద్ధి గురించి చెప్పాడు. నిజంగా ఆశ్చర్యమనిపిస్తుంది. ఇదే నియోజకవర్గం నుంచి సునితమ్మ మంత్రిగా పని చేస్తుంది. ఇదే నియోజకవర్గం నుంచి హంద్రీనీవా, పీఏబీఆర్‌ ఉంది. కానీ ఈ నియోజకవర్గంలో పిల్ల కాల్వలు తవ్వినా అక్షరాల 1.20 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వవచ్చు అన్నది ప్రభుత్వం మరిచిపోయింది. ప్రకాశ్‌ అడిగింది సమంజసమైంది. హంద్రీనీవా జిల్లాకు వచ్చాయంటే గర్వంగా చెబుతున్నాను. అది రాజశేఖరరెడ్డి వేసిన బాట అని గర్వంగా చెబుతున్నాను. గతంలో 9 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఏ రోజు హంద్రీనీవా గురించి పట్టించుకోలేదు. టెంకాయలు కొట్టడం తప్ప చేసింది ఏమీ లేదు. రూ.6 వేల కోట్లతో దివంగత ముఖ్యమంత్రి హంద్రీనీవా పనులు  ప్రారంభించి నీరు తెచ్చారు. నాన్నగారు చేసిన పనులు సగంలో ఆగిపోయాయి. ఆయన కొడుకుగా నేను రెండు అడుగులు ముందుకు వేస్తాను. పిల్లకాల్వలు తీస్తాం, ఇదే నియోజకవర్గానికి నీరు తెచ్చి లక్ష ఎకరాలను సాగులోకి తెస్తామని మాట ఇస్తున్నాను.
చాలా మంది సర్వే బుక్కులు తీసుకొని వచ్చి మా సర్వే నంబర్లు మారిపోతున్నాయని అర్జీలు ఇస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే జరుగుతోంది. విశాఖలో ఇలాగే సర్వే నంబర్లు మార్చారు. విశాఖలో నేనే స్వయంగా ధర్నా చేశాను. మన ప్రభుత్వం వచ్చిన తరువాత జరిగిన ఈ అన్యాయాలన్నింటిని దిద్దుతాం. చాలా పారదర్శకంగా చేస్తాం, రీసర్వే చేయించి అందరికి న్యాయం చేస్తామని మాట ఇస్తున్నాను.
దేవుడు ఆశీర్వదించి, మీ అందరి చల్లని దీవెనలతో మనం ఏం చేస్తామన్నది నవరత్నాల గురించి చెబుతున్నాను. ఈ రోజు నవరత్నాల్లో రైతుల గురించి క్లుప్తంగా చెబుతున్నాను.

అన్నదాతలకు అండగా ఉంటా
రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. అన్నదాతలు బ్యాంకులకు వెళ్లేందుకు అవస్థలు పడుతున్నారు. పంట విస్తీర్ణం తగ్గిపోయింది. కరువు మండలాలు ప్రతి ఏటా ప్రకటించాల్సి వస్తోంది. కరువు పరిస్థితుల కారణంగా పక్క రాష్ట్రాలకు వెళ్లి వాచ్‌మన్‌గా పని చేయాల్సి వస్తోంది. రైతులకు నాలుగు సమస్యలు ఉన్నాయి. పెట్టుబడుల కోసం మనం అధికారంలోకి వచ్చాక ఏం చేస్తామంటే..జూన్‌లో పంటలు వేసే కంటే ముందే మే నెలలోనే ప్రతి  రైతుకు రూ.12500 పెట్టుబడి కోసం అందజేస్తాం. ఆ డబ్బుతో రైతులు ఏం చేస్తారో వారి ఇష్టానికే వదిలిపెడతాం. అలాగే పగలు పూట 9 గంటలకు కరెంటు ఇస్తాం. రైతులకు సున్నా వడ్డీ రుణాలు అందడం లేదు. కారణం ఏంటంటే చంద్రబాబు సీఎం అయ్యాక వడ్డీ లెక్కలు బ్యాంకులకు కట్టడం మానేశారు. మనం వచ్చాక ప్రతి రైతుకు వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తాం. ఈ మూడు అంశాలతో రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గుతాయి. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేని పరిస్థితిలో అవస్థలు పడుతున్నారు. ఇక్కడికి వచ్చే ముందు టమాట రైతును కలిశాను. అన్నా..గిట్టుబాటు ధర లేదని ఆవేదన వ్యక్తం చే శాడు. మరో శనగ రైతు కూడా నన్ను కలిశాడు. పత్తి రైతులు నన్ను కలిసి గిట్టుబాటు ధర లేదని చెబుతున్నారు. రైతులు పండించే సమయంలో రేట్లు ఎక్కువగా ఉంటాయి. పంట చేతికి వచ్చాక ధరలు తగ్గిపోతున్నాయి. చంద్రబాబే ఒక దళారిగా మారి హెరిటేజ్‌ షాపులు పెట్టి ధరలు విఫరీతంగా పెంచి డబ్బులు సంపాదించుకుంటున్నారు. మనం అధికారంలోకి వచ్చార అక్షరాల రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని మాట ఇస్తున్నాను. పంట పండకముందే ధర నిర్ణయిస్తాం. అంతకన్న ఎక్కువకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. మీ అందరి ముఖాల్లో చిరునవ్వులు చూసేలా రేట్లు పెంచుతాం. రైతులు నష్టపోకుండా చేస్తాం. ప్రతి మండలంలోనూ కోల్డు స్టోరేజీలు, గిడ్డంగులు ఏర్పాటు చేస్తాం. వీటిలో రైతులు ఉచితంగా పంటలు దాచుకునే వీలు కల్పిస్తాం. రైతులకు వాతావరణం సహకరిం^è నప్పుడు నష్టపోతున్నారు. ఇన్‌ఫుట్‌ సబ్సిడీలు ఎగ్గొట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం దిక్కుమాలిన ఆలోచనలు చేస్తుంది. మనం అధికారంలోకి వచ్చాక ప్రకృతి వైఫరీత్యాల నిధి కింద రూ.4 వేల కోట్లతో ఏర్పాటు చేస్తాం. సాగు చేసేందుకు నీరు లేకపోతే రైతులు అవస్థలు పడాల్సి వస్తుంది. రైతులకు తోడుగా ఉండేందుకు యుద్ధప్రాతిపదికన ప్రతి ప్రాజెక్టును పూర్తి చేస్తామని మాట ఇస్తున్నాను. శ్రీశైలంలో నీరు ఉన్నా కూడా మనకు అందడంలేదు. కారణంగా చంద్రబాబుకు ప్రాజెక్టులు పూర్తి చేయాలన్న ఆలోచన లేదు. కాంట్రాక్టర్లను పిండి డబ్బులు వసూలు చేసే ఆలోచన చేస్తున్నారు కాబట్టే ఈ ప్రాజెక్టులు పూర్తి కావడం లేదు. రైతులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి నేను చూశాను. అసెంబ్లీలో నేను మాట్లాడితే హేళన చేశారు. నేను ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలను కలుస్తానని హడావుడిగా పది మంది రైతులకు పరిహారం ఇచ్చే డ్రామా చేశాడు. లక్షన్నర ఇస్తారట, ఎంఆర్‌వోకు జాయింట్‌ అకౌంట్‌ తెరచి ప్రతి ఏటా కొంత డబ్బు ఇస్తాడట. అటువంటి పరిస్థితి నిజంగా వచ్చినప్పుడు ఆ రైతు కుటుంబాన్ని నేను చూసుకుంటానని భరోసా కల్పిస్తున్నాను. చంద్రన్న బీమా పథకం పేరుతో మోసం చేశారు. మనం అధికారంలోకి వచ్చాక వైయస్‌ఆర్‌ బీమా పథకం ఏర్పాటు చేస్తాం. బతికున్న వాళ్లకు ఒకే సారి రూ.5 లక్షల చెక్కు ఇచ్చే ఏర్పాట్లు చేస్తాం. చంద్రబాబు పాలనలో ఇటువంటి కష్టాలు చూస్తున్నాను కాబట్టి మంచి చట్టాలను తీసుకొని వస్తాను. నవరత్నాల్లో కూడా మార్పులు, చేర్పులు ఉంటే నాకు సలహాలు, సూచనలు ఇవ్వమని కోరుతున్నాను. ఎవరైనా రావొచ్చు, ఎవరైనా సలహాలు ఇవ్వవచ్చు. నేను మీ సలహాలు తీసుకుంటాను. ఈ ప్రజా సంకల్ప యాత్ర 3 వేల కిలోమీటర్లు సాగుతోంది. మీ బిడ్డను దీవించమని పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతూ మీ వద్ద నుంచి సెలవు తీసుకుంటున్నాను.
 
Back to Top