బాబు పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరు


మోసం చేసేందుకు ప్రతి కులానికి మేనిఫెస్టోలో ఒక పేజీ పెట్టాడు
బోయలను ఎస్టీల్లో చేరుస్తామని చెప్పి ఇప్పుడు కేంద్రంపై నెపం
సినిమాలో విలన్లు కూడా చంద్రబాబులా యాక్టింగ్‌ చేయరు
ఆలు లేదు.. సూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లుగా బాబు వైఖరి
బీసీలపై టీడీపీ ప్రేమను ధర్మవరం చేనేతలు చెబుతారు
వైయస్‌ఆర్‌ కొడుకులా నేను రెండు అడుగులు ముందుకేస్తా
చదువుల విప్లవం తీసుకువస్తా, 
ఎంత పెద్ద చదువు చదివినా ఫీజు మొత్తం నేనే కడతా
ఆరోగ్యశ్రీలో విప్లవాత్మక మార్పులు రూ. వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ కిందకే

గార్లదిన్నె: చంద్రబాబు నాలుగేళ్ల పరిపాలనలో ఏ ఒక్క వర్గానికి చెందిన ప్రజలైనా సంతోషంగా లేరని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. అనంతపురం జిల్లా గార్లెదిన్నెలో ఏర్పాటు చేసిన బీసీ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో వైయస్‌ జగన్‌ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రతి కులాన్ని ఎలా మోసం చేయాలని తన మేనిఫెస్టోలో ఒక్కో పేజీ పెట్టాడన్నారు. కురుమ, కురుబ, కుర్వ కులాలను బీసీ బీ నుంచి ఎస్టీలుగా గుర్తించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అదే విధంగా వాల్మీకి (బోయ)లను ఎస్టీలుగా గుర్తించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రజకులను ఎస్సీలుగా గుర్తిస్తామన్నారు. వీటిల్లో ఒక్కటైనా చంద్రబాబు నెరవేర్చాడా అని ప్రశ్నించారు. ఎందుకు చేయలేదని గట్టిగా నిలదీస్తే రాష్ట్రం పరిధిలో లేదు.. కాబట్టి కేంద్రానికి రికమండ్‌ చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వంపై నెపం మోపుతున్నారన్నారు. 

సినిమాల్లో విలన్లు కూడా చంద్రబాబులాంటి దారుణమైన పాత్ర పోషించలేదని వైయస్‌ జగన్‌ ఎద్దేవా చేశారు. బోయలను ఎస్టీలుగా చేరుస్తున్నామంటూ అసెంబ్లీ సాక్షిగా మూడు సార్లు తీర్మాణం చేసిన చంద్రబాబు కేంద్రానికి పంపుతున్నామని చెప్పారన్నారు. తరువాత టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి గ్రామ స్థాయి టీడీపీ క్యాడర్‌కు కేక్‌లు కట్‌ చేసి బోయలను ఎస్టీలుగా చేర్చారని బిల్డప్‌ ఇవ్వండి చెబుతారని మండిపడ్డారు. అదే విధంగా తన పార్టీలో ఉన్న ఇతర కులాల నేతలకు ఫోన్‌లు చేసి ధర్నాలు చేయండి అని చెబుతాడన్నారు. ఆలు లేదు... సూలు లేదు.. కొడుకుపేరు సోమలింగం అన్నట్లుగా చంద్రబాబు ప్రవర్తన ఉందన్నారు. ఇచ్చింది లేదు. సచ్చింది లేదు కానీ వచ్చిందని సంబరాలు చేయండి అని.. వ్యతిరేకంగా ధర్నాలు చేయండని కులాల మధ్య చంద్రబాబు వైరం పెడుతున్నాడని ఆరోపించారు. చంద్రబాబు కంటే వయస్సులో చిన్నవాడినైనా మోసం చేయడం రాదని, అందుకనే చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తామని ప్రకటించానన్నారు.  

చంద్రబాబుకు బీసీలపై ఎంత ప్రేమ ఉందో ధర్మవరంలోని చేనేత కార్మికులను అడిగితే చెబుతారని వైయస్‌ జగన్‌ తెలిపారు. 37 రోజులుగా చేనేత కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా.. ప్రభుత్వానికి సంబంధించిన ఏ ఒక్కరూ వారిని పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ప్రతిపక్షనేతగా వెళ్లి పరామర్శించానని వైయస్‌ జగన్‌ చెప్పారు. 30 మందికిపైగా ఆత్మహత్యలు చేసుకున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. రిలే నిరాహార దీక్షలు మహిళలు చేస్తున్నారన్నారు. అమ్మా.. చేనేత కార్మికులకు చంద్రబాబు ఏ హామీ ఇచ్చారని అడిగితే.. మగ్గం ముందు కూర్చొని ఫోజు మాత్రం బాగా పెట్టాడు కానీ రుణాలన్నీ మాఫీ చేయలేదని వారు మండిపడ్డారన్నారు. ప్రతి కార్మికుడికి ఇళ్లు కట్టించి మగ్గం షెడ్‌ వేయిస్తానన్నాడు. రుణాలన్నీ మాఫీ చేసి లక్షన్నర వడ్డీలేని రుణాలిస్తానన్నాడు.. ఇవన్నీ జరిగాయా..అడిగితే.. అన్నా ఇవన్నీ జరగడం దేవుడెరుగు.. మన్నటి వరకు నెలకు రూ. 600 సబ్సిడీ వచ్చేది చంద్రబాబు వచ్చిన తరువాత దానికి కటింగ్‌ పెట్టాడన్నారని వైయస్‌ జగన్‌ చెప్పారు. చంద్రబాబుకు బీసీల మీద ఉన్న ప్రేమ నాలుగు కత్తెరలు, నాలుగు ఇస్తీ్ర పెట్టెలు ఇచ్చి చేతులు దులుపుకోవడమేనని వైయస్‌ జగన్‌ విరుచుకుపడ్డారు. 

బీసీలు పేదరికం నుంచి బయటకు రావాలంటే చంద్రబాబు మాదిరిగా కత్తెరలు, ఇస్తీ్ర పెట్టెలు ఇవ్వడం కాదని, పేదరికం నుంచి వారిని బయటకు తీసుకురావాలంటే దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డిలా పరిపాలన చేయాలని చంద్రబాబుకు సూచించారు. ప్రతీ పేద కుటుంబం నుంచి ఒక్కరైనా డాక్టర్, ఇంజినీర్‌  కావాలని, అప్పుడే పేదరికం పోతుందని వైయస్‌ఆర్‌ పాలన చేశారన్నారు. బీసీ సోదరులకు తాను తోడుగా ఉండి.. నువ్వు చదువుకో నేను ఫీజులు కడతానని చెప్పారని గుర్తు చేశారు. వైయస్‌ఆర్‌ హయాంలో చదువుల విప్లవం వచ్చిందని, ఆయన 5 సంవత్సరాల పాలనలో ఎంతో మంది గొప్పచదువులు చదివారని, వారంతా వైయస్‌ఆర్‌ను గుర్తు పెట్టుకున్నారన్నారు. 

చంద్రబాబు పాలనలో బీసీలు వెరైనా ఇంజినీరింగ్, డాక్టర్లు చదువుతున్నారా..అని వైయస్‌ జగన్‌ ప్రశ్నించారు. ఫీజు రియంబర్స్‌మెంట్‌ కింద చంద్రబాబు విద్యార్థులకు ఇచ్చేది రూ.30 వేలు.. మిగిలిన డబ్బులు పేదవాడు కట్టే పరిస్థితిలో ఉన్నాడా.. ఇదేనా చంద్రబాబు బీసీల మీద మీకున్న ప్రేమ అని ప్రశ్నించారు. అదే విధంగా ఆరోగ్యశ్రీ పథకం హైదరాబాద్‌లో వర్తించదట. మంచి ఆస్పత్రులన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నప్పుడు మరి ఏ ఆస్పత్రుల్లో చూపించుకోవాలని వైయస్‌ జగన్‌ నిలదీశారు.
  
వైయస్‌ఆర్‌ పేద ప్రజల అభ్యున్నతికి ఒక అడుగు ముందుకేస్తే ఆయన కొడుకుగా నేను రెండు అడుగులు ముందుకేసి నవరత్నాలను ప్రకటించానని వైయస్‌ జగన్‌ చెప్పారు. మీ పిల్లలను డాక్టర్లు చేస్తారో.. ఇంజినీర్లను చేస్తారో.. అంతకంటే పెద్ద చదువులే చదివిస్తారో.. మీ ఇష్టం ఆ చదువులకయ్యే మొత్తం ఫీజు అంతా నేనే కడతానని వైయస్‌ జగన్‌ భరోసా ఇచ్చారు. బయట ప్రాంతంలో చదివే విద్యార్థులకు ప్రతి ఏడాదికి ఖర్చులకు రూ. 20 వేలు ఇస్తామని వైయస్‌ జగన్‌ ప్రకటించారు. ఎవరూ చదువుల కోసం అప్పుల పాలు కాకూడదు.. అలా పాలన చేస్తానని వైయస్‌ జగన్‌ పేదలకు ధైర్యం చెప్పారు. 

అమ్మఒడి పథకం కింద పిల్లలను బడికి పంపిస్తే ఆ తల్లులకు ఏటా రూ. 15వేలు అందజేస్తామని వైయస్‌ జగన్‌ ఆత్మీయ సమ్మేళనంలో ప్రజలకు వివరించారు. ఎందుకంటే మన దేశంలో నూటికి 32 శాతం మందికి చదువురాదని, వారి తలరాతలు మారాలంటే ఆ పిల్లలు చదువుకోవాలన్నారు. అమ్మఒడి, ఫీజురియంబర్స్‌మెంట్‌ పథకాలు కాకుండా పెన్షన్లు రూ.2 వేలు చేస్తామని, అది కూడా 45 సంవత్సరాలకు కుదిస్తామన్నారు. అంతే కాకుండా ఆరోగ్యశ్రీ కింద విప్లవాత్మక మార్పులు చేస్తున్నామని, ఎంత చిన్న వైద్యమైనా రూ. వెయ్యి దాటితే అది ఆరోగ్యశ్రీ కిందికి వర్తించేలా చేస్తామన్నారు. ఎంత పెద్ద ఆపరేషన్‌ అయినా ఆరోగ్యశ్రీ కింద ఫ్రీగా చేయించుకునేలా.. అది కూడా ఎక్కడైనా చేయించుకునేలా చేస్తామన్నారు. ఆపరేషన్‌ అనంతరం డాక్టర్ల సూచన మేరకు పేషంట్‌ విశ్రాంతి తీసుకుంటే ఆ సమయంలో కూడా ఆ కుటుంబం ఇబ్బందులు పడకుండా డబ్బులు ఇస్తామన్నారు. దీరఘకాలిక రోగాలతో బాధపడే వారికి నెలకు రూ. 10 వేల పెన్షన్‌ ఇస్తామన్నారు.  
Back to Top