క‌లిసి పోరాడుదాం..హోదా సాధించుకుందాం- వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి
- ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో హోరెత్తిన హోదా నినాదం
 తూర్పు గోదావ‌రి:  ప్ర‌త్యేక హోదా వ‌స్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంద‌న్న‌ది అక్ష‌ర స‌త్యం. అందుకు ప్ర‌త్యేక హోదా క‌లిగిన రాష్ట్రాలే సాక్ష్యం. హోదా ఉన్న రాష్ట్రాల‌కు రాయితీలు ఉంటాయి. రాయితీలు ఉంటే ప‌రిశ్ర‌మ‌లు ఎక్కువ‌గా వ‌స్తాయి. అప్పుడు చ‌దువుకున్న ప్ర‌తి ఒక్క‌రికీ ఉద్యోగం దొరుకుతుంది. నిరుద్యోగ స‌మ‌స్యే ఉండ‌దు. హోదా అనేది మ‌న‌కు ఖ‌చ్చితంగా సంజీవ‌నే. అందుకే అంద‌రం క‌లిసిక‌ట్టుగా పోరాడి హోదాను సాధించుకుందామ‌ని వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర 196వ రోజు తూర్పు గోదావ‌రి జిల్లా రాజోలు నియోజ‌క‌వ‌ర్గంలో కొన‌సాగుతోంది. చింత‌ల‌ప‌ల్లి వ‌ద్ద యువ‌కులు వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసి ప్ర‌త్యేక హోదా ఆంధ్రుల హ‌క్కు అంటూ నిన‌దించారు. బెంగుళూరుకు చెందిన సాప్ట్‌వేర్ ఇంజ‌నీర్లు, రాష్ట్రానికి చెందిన యువ‌కులు వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిశారు. హోదా కోసం వైయ‌స్ జ‌గ‌న్ చేస్తున్న పోరాటాల‌ను, ఇటీవ‌ల ఎంపీలు త‌మ ప‌ద‌వుల‌ను త్యాగం చేయ‌డంతో విద్యార్థులు, యువ‌కులు వైయ‌స్ జ‌గ‌న్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. హోదా సాధ‌న‌కు జ‌న‌నేత చేస్తున్న పోరాటాపై హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా వైయ‌స్ జ‌గ‌న్ మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా కోసం యువత ఉద్యమించాల్సిన అవసరముందని అన్నారు. 2014 ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుమలలో వెంకన్న సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చాక విస్మరించారన్నారు. విభజన సమయంలో ప్రత్యేక హోదా పదేళ్లు కావాలన్న వెంకయ్యనాయుడు, పదిహేనేళ్లు కావాలన్న చంద్రబాబు నాయుడు  ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకొని ఏపీని మోసం చేశారన్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు భయపడుతున్నారన్నారు. ప్రత్యేక హోదాతోనే యువత భవిష్యత్‌ ఆధార పడి ఉందన్నారు. హోదా వస్తే రాష్ట్రానికి రాయితీతో కూడిన పరిశ్రమలు వస్తాయని, ఫలితంగా నిరుద్యోగ సమస్య తీరుతుందన్నారు.  
Back to Top