ఉద్యోగాల విప్లవం తీసుకొస్తాం

 
- మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఖాళీలు భర్తీ చేస్తాం..  
 - గ్రామ సచివాలయాల ద్వారా 1.5 లక్షల ఉద్యోగాలను కల్పిస్తాం  

- పరిశ్రమల్లో 75 శాతం కొలువులు స్థానికులకే  
- ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం  
- హోదా కోసం పోరాటం ఆగదు... సాధించి తీరుతాం  
- నల్లధనం దాచుకోవడానికే చంద్రబాబు విదేశీ యాత్రలు
 - ‘జగన్‌ స్పీక్స్‌’ విడుదల

 హైదరాబాద్‌: దేవుడి ఆశీస్సులతో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిరుద్యోగుల కోసం ఒక ఉద్యోగాల విప్లవాన్ని తీసుకొస్తా మని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. పరిశ్రమలను ఆకర్షించడానికి పారదర్శక పారిశ్రామిక విధానాన్ని తెస్తామని, గ్రామ సచివాలయాల ద్వారా 1.5 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం రాత్రి ‘జగన్‌ స్పీక్స్‌’ పేరుతో విడుదల చేసిన వీడియోను ‘ఫేస్‌బుక్‌’లో ఉంచారు. వివరాలు ఆయన మాటల్లో...  ‘‘మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో ఉద్యోగాల విప్లవం సృష్టించాలని కృత నిశ్చయంతో ఉన్నాను. ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పటికే దాదాపు 22 సా ర్లు విదేశీ పర్యటనలకు వెళ్లారు. వెళ్లిన ప్రతిసారీ ఆయన పరిశ్రమలు, ఉద్యోగాల కోసం వెళుతున్నానని చెబుతున్నారు. ప్రతి సంవత్సరం ఆయన దావోస్‌కు వెళ్తున్నారు. వాస్తవానికి ఆయన తన నల్లధనాన్ని దాచుకోవడానికే పోతున్నారు తప్ప నిజంగా పిల్లల ఉద్యోగాల కోసం మాత్రం కాదు. ఇన్నిసార్లు విదేశాలకు వెళ్లారు కదా! అసలు ఈ నాలుగేళ్లలో రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు వచ్చాయని ప్రశ్నిస్తున్నా. ఆయన నోరు తెరిస్తే అబద్ధం, మోసాలే.  
  
ఏపీలో అనువైన పరిస్థితులేవీ? 
ఆంధ్రప్రదేశ్‌కు ఏ పరిశ్రమ అయినా రావాలి అంటే... చంద్రబాబు మొహం చూసో, జగన్‌ మొహం చూసో పారిశ్రామికవేత్తలు రారు. చంద్రబాబు విదేశీ పర్యటనలు చేస్తున్నారని రారు. తాము ఆంధ్రప్రదేశ్‌లో పెట్టే హోటల్, ఆసుపత్రి, పరిశ్రమకు పరిస్థితులు అనువుగా ఉన్నాయా లేదా అని చూస్తారు. అసలు మన రాష్ట్రంలో ఇలాంటివి పెట్టడానికి అనువైన పరిస్థితులు ఎక్కడున్నాయి? విజయవాడ, గుంటూరు ప్రాంతానికి ఏ పారిశ్రామికవేత్తలైనా ఎందుకు వస్తారు? పెట్టుబడులు పెట్టేటప్పుడు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లో నెలకొన్న అనువైన పరిస్థితులతో బేరీజు వేసుకుంటారు. ఆ నగరాల్లో 60 ఏళ్లుగా మౌలిక సదుపాయాలు బాగా అభివృద్ధి చెందాయి. అనువైన పరిస్థితులూ ఉన్నాయి. మరి అక్కడ కాకుండా మన దగ్గర పెట్టుబడులు పెట్టడానికి ఇష్టపడతారా? ఆ నగరాలన్నీ ఇప్పటికే ఒక దశ వరకూ అభివృద్ధి చెంది ఉన్నాయి. సహజంగానే అక్కడున్న పరిస్థితులను చూసి పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెడతారు గానీ, మన దగ్గరకు ఎవరూ పెట్టుబడులతో రానే రారు.  
 
ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి  
మన వద్దకు ఎవరైనా పెట్టుబడులతో రావాలంటే అది రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తేనే సాధ్యమవుతుంది. ప్రత్యేక హోదా గల రాష్ట్రాలకు ఆదాయపు పన్ను, జీఎస్టీలో మినహాయింపులు లభిస్తాయి. ఓ పదేళ్లపాటు ఆదాయపు పన్ను, జీఎస్టీలో మినహాయింపులు ఉన్నాయంటేనే ఎవరైనా వచ్చి ఆ రాష్ట్రాల్లో పెట్టుబడులు పెడతారు. చంద్రబాబు ఇప్పటికి 22 సార్లు విదేశాలకు పర్యటనలకు వెళ్లారు. అది కూడా ప్రత్యేక విమానాల్లో తన మందీ మార్బలంతో వెళ్లి సుమారు రూ.250 కోట్ల ప్రజాధనాన్ని నీటి పాలు చేశారు. విదేశాలకు వెళ్లడంలో చూపిన శ్రద్ధ, ఆసక్తి, చిత్తశుద్ధి, ప్రయత్నాల్లో కనీసం పది శాతం కనుక చంద్రబాబు ఇక్కడే ప్రధానమంత్రి నరేంద్రమోదీ వద్దకు వెళ్లి చేసి ఉంటే మన రాష్ట్రానికి ఎంతో మేలు జరిగేది.  
 
రూ.15 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయా?  
అసలు చంద్రబాబు ప్రధానిని కలవనే కలవడు, అక్కడికి వెళ్లి అడగనే అడుగడు. ఇటీవల ఆయన మోదీని కలిసి ఏం అడిగారోనని ఆసక్తితో చూశాం. చంద్రబాబు మోదీకి రాసిన లేఖ, అంతకు రెండు రోజుల ముందు వారి పార్టీ ఎంపీలు రాసిన లేఖను కూడా చూశాం. కానీ ఎక్కడా ఆయన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలనే విషయంపై ఒక్క వాక్యమైనా ప్రస్తావించలేదు. రాష్ట్రాన్ని విభజించడానికి ముందుగా రాజ్యసభలో మనకు ప్రత్యేక హోదా ఇస్తామని ఇచ్చిన హామీ అది. కానీ ఈ హామీ అమలు కోసం చంద్రబాబు పది శాతం కూడా ప్రయత్నం చేయలేదు. చంద్రబాబు గట్టి ప్రయత్నం చేసి ఉండి, ఆయన ప్రయత్నం వల్ల మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చి ఉంటే చంద్రబాబు విదేశాలకు వెళ్లాల్సిన పనే లేదు. 

విదేశాల్లో ఉండే పరిశ్రమలే మన రాష్ట్రానికి వచ్చేవి. చంద్రబాబు సచివాలయంలో కూర్చుని ఉంటే విదేశాల నుంచి పారిశ్రామికవేత్తలు వాళ్లంతట వాళ్లే వచ్చేవారు. ప్రత్యేక హోదా వచ్చి ఉంటే రూ.లక్షల కోట్ల పెట్టుబడులు, వేలాది పరిశ్రమలు వచ్చి ఉండేవి. ఈ పాటికే మన రాష్ట్రానికి లక్షలాది ఉద్యోగాలు వచ్చేవి. కానీ రాష్ట్రంలో ఇవాళ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటే... విశాఖపట్నంలో జరిగిన రెండు భాగస్వామ్య సదస్సుల్లో ఒకసారి రూ.5 లక్షల కోట్లు, మరోసారి రూ.10 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని చంద్రబాబు చెప్పారు. రూ.15 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెబుతున్నపుడు నిజంగా ఎన్ని పరిశ్రమలు వచ్చాయని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ‘డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ ప్రమోషన్‌ అండ్‌ పాలసీ’వద్ద ఎన్ని పరిశ్రమలు రిజిస్టర్‌ (నమోదు) అయ్యాయి అని చూస్తే... చంద్రబాబు పాలనలో ఈ మూడేళ్లలో సంవత్సరానికి సగటున రూ.5,000 కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడులు రాలేదని స్పష్టం అయింది. 2015లో రూ.4,500 కోట్లు, 2016లో రూ.9,500 కోట్లు, 2017లో రూ.4,450 కోట్లు పెట్టుబడులు మాత్రమే వచ్చాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థ లెక్కలే ఇలా ఉంటే ఎక్కడ మన రాష్ట్రానికి రూ.15 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి? ఎక్కడి నుంచి వేల పరిశ్రమలు వచ్చాయి?  
 
బాబు నోరు తెరిస్తే అబద్ధాలు, మోసాలే  
చంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలే, మోసపూరితమైన మాటలే. రాష్ట్రంలో ఉద్యోగాల విప్లవం రావాలంటే కచ్చితంగా ప్రత్యేక హోదా రావాల్సిందే. దానికోసం గట్టిగా పోరాడాలి. ఇవాళ కాకపోయినా రేపైనా సాధించి తీరుతాం. హోదా వచ్చినపుడు రాష్ట్రం ఒక్కసారి అభివృద్ధి పథంలోకి ఉన్నతస్థాయికి దూసుకెళ్తుంది. అందుకే వైఎస్సార్‌సీపీ దానికోసం పోరాడుతూనే ఉంటుంది.  
 
1.42 లక్షల ఉద్యోగాలు ఖాళీ  
రాష్ట్రం విడిపోయేటపుడు ఏపీలో 1.42 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తేల్చారు. చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో ఒక్క ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయలేదు. కొన్ని పరీక్షలు పెట్టించారు. కానీ, అవి పోస్టింగ్‌ల వరకూ రాలేదు. కోర్టు కేసులనో... మరొకటనో ఆపేశారు. అసలు చంద్రబాబుకు ఉద్యోగాలు ఇవ్వాలన్న ఉద్దేశం, ఆలోచన లేవు. ఖాళీగా ఉన్న 1.42 లక్షల ఉద్యోగాలను రేపు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత భర్తీ చేస్తాం. ప్రతి సంవత్సరం ఏపీపీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తాం. ఎంపికైన వారిని ఖాళీల్లో నియమిస్తాం. గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి ఒక విప్లవాత్మకమైన కార్యక్రమం చేపట్టాలని ఉంది. ఇవాళ గ్రామాల్లో జన్మభూమి కమిటీల పేరుతో మాఫియా కమిటీలు పెత్తనం చెలాయిస్తున్నాయి. 


గ్రామ సర్పంచ్‌లకు విలువే లేకుండా పోయింది. ఇల్లు, పింఛను నుంచి మరుగుదొడ్డి మంజూరు కావాలన్నా జన్మభూమి కమిటీలు లంచాలు తీసుకుంటున్నాయి. రాజధాని భూములు, గుడి భూములు మొదలు అన్నింటా పై స్థాయిలో చంద్రబాబు లంచాలు తీసుకుంటుంటే కింది స్థాయిలో ఈ కమిటీలు దోచేస్తున్నాయి. అందుకే ఈ వ్యవస్థను మార్చేస్తూ ప్రతి గ్రామంలో సచివాలయాలను ఏర్పాటు చేస్తాం. ఆ సచివాలయంలో ప్రతి గ్రామం నుంచి పది మంది పిల్లలను తీసుకుని వారి ద్వారా ప్రజలకు కావాల్సిన పథకాలను దరఖాస్తు చేసిన 72 గంటల్లో మంజూరయ్యేటట్లు చేస్తాం. అర్హత గల వారు ఎవరి చుట్టూ తిరగాల్సిన పని లేకుండా చేస్తాం. 13,000 గ్రామ పంచాయతీలు, మున్సిపల్‌ ప్రాంతాలు అన్నీ కలిపి సుమారు 15,000 వరకూ ఉంటాయి. 

వీటిలో 10 మందికి చొప్పున అవకాశం కల్పిస్తాం కనుక దాదాపు లక్షన్నర ఉద్యోగాలు ఈ గ్రామ సచివాలయాల్లోనే వస్తాయి. మరో విప్లవాత్మక మార్పు ఏమిటంటే మనం కష్టపడి తెచ్చే ఉద్యోగాలు స్థానికులకు దక్కడం లేదు. ఉదాహరణకు నెల్లూరు జిల్లా తడలో ఒక ఎస్‌ఈజెడ్‌ ఉంది. కానీ, మన పిల్లలకు విద్యార్హతలున్నా అందులో ఉద్యోగాలు ఇవ్వడం లేదు. ఎక్కడో గుజరాత్‌లోనో మరొక చోటో ఉండే వారికి ఉద్యోగాలు ఇస్తున్నారు. స్థానికులకు సెక్యూరిటీ గార్డు, ఇతర చిన్న ఉద్యోగాలు మాత్రమే ఇస్తున్నారు. మన ప్రభుత్వం వచ్చాక మన వద్ద పెట్టే పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగాలు వచ్చేలా శాసనసభలో చట్టం తెస్తాం. చట్టం చేసి అన్ని పరిశ్రమలకూ సర్క్యులర్‌ పంపుతాం. మన పిల్లలకు 75 శాతం, స్థానికేతరులకు 25 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని చెబుతాం.  
 
పారదర్శక పారిశ్రామిక విధానం  
చంద్రబాబు పాలనలో తనకు నచ్చిన వారికే పారిశ్రామిక రాయితీలు ఇచ్చి, నచ్చని వారికి ఇవ్వడం లేదు. కానీ మనం వచ్చిన తరువాత తన, మన అనే భేదం లేకుండా పారిశ్రామికవేత్తలందరికీ రాయితీలు వచ్చేలా పారదర్శక పారిశ్రామిక విధానాన్ని తెస్తాం. ఈ విధానం చూడగానే పారిశ్రామికవేత్తలను ఆకర్శించేలా రూపొందిస్తాం. నిజంగా దేవుడు నా చేతులతో ఈ పనులు చేయిస్తాడని ఆశిస్తూ... నా చేతుల మీదుగా ఈ మంచి పనులు చేయాలని తపిస్తూ సెలవు తీసుకుంటున్నాను.   


Back to Top