చేనేతలకు ప్రత్యేక కార్పొరేషన్‌

 
– చేనేతల ఆత్మహత్యలను ఈ ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు
– చనిపోయిన ప్రతి ఇంటికి తాను వెళ్లాను.
– చేనేతల నిరాహార దీక్షలోనే 45 ఏళ్లకే పింఛన్‌ ఆలోచన వచ్చింది
– మన ప్రభుత్వం వచ్చాక చేనేతలకు  రూ. 2 వేల సబ్సిడీ 
– ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 45 ఏళ్లకే పింఛన్లు
– అవ్వాతాతలకు పింఛన్‌ రూ.2 వేలు చేస్తాం
– అమ్మ ఒడి పథకం కింద రూ.15 వేలు
– ఎంత ఖర్చైనా మీ పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తాను
– పొదుపు రుణాలు నాలుగు విడతల్లో మాఫీ చేసి మీ చేతులకే ఆ డబ్బు ఇస్తాం
– కలివేడులో చేనేతల ఆత్మీయ సమ్మేళనం
నెల్లూరు: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే చేనేతలకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి తోడుగా ఉంటామని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరిలో చిరునవ్వు చూడాలన్నదే తన ధ్యేయమని పేర్కొన్నారు. పేదవారి కోసం దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి ఒక అడుగు ముందుకు వేస్తే..ఆయన కొడుకుగా తాను రెండు అడుగులు ముందుకు వేస్తున్నానని చెప్పారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలోని కలిచేడు గ్రామంలో మంగళవారం ఏర్పాటు చేసిన చేనేతల ఆత్మీయ సమ్మేళనంలో వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..వైయస్‌ జగన్‌ మాటల్లోనే..

చంద్రబాబు నాలుగేళ్ల పాలన చూశారు..
వెంకటగిరి నియోజకవర్గంలో చేనేతల ఆత్మీయ సదస్సు జరపడం ఆనందంగా ఉంది. మరో ఏడాదిలో ఎన్నికలు జరుగబోతున్నాయని చంద్రబాబు తన కార్యకర్తల మీటింగ్‌లో చెబుతున్నారు. నాలుగేళ్ల చంద్రబాబు పాలన చూశాం. మరో ఏడాదిలో ఎన్నికలు జరుగబోతున్న సమయంలో మనందరం కూడా మన గుండెలపై చేతులు వేసుకొని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఈ నాలుగేళ్ల పాలనలో మనం ఎలాంటి అభివృద్ధి సాధించాం. నిన్నటికన్న ఇవాళ ఆనందంగా ఉంటే దాన్ని అభివృద్ధి అంటాం. కానీ చంద్రబాబు పాలనలో నిన్నటి కన్న ఈ రోజు మనం ఆనందంగా ఉన్నామా అన్నది మీరే ప్రశ్నించుకోండి. ధర్మవరంలో దాదాపుగా 34 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. వారిని ఎవరూ కూడా పట్టించుకోవడం లేదు. ఆత్మహత్యలు చేసుకున్నారని ఈ ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు. కారణం వారికి పరిహారం చెల్లించాల్సి వస్తుందని మౌనంగా ఉంది. ఆ చనిపోయిన కుటుంబాల వద్దకు తాను వెళ్లానని గర్వంగా చెబుతున్నాను. మొన్న ధర్మవరంలో 37 రోజుల పాటు నిరాహార దీక్షలు చేశారు. వారి శిబిరానికి వెళ్లి వారితో మాట్లాడిన సందర్భంలో వారి సమాధానాలు విన్న తరువాత చాలా బాధా అనిపించింది. ఈ ప్రభుత్వం నెలనెల సబ్సిడీ ఇవ్వడం లేదని, నాన్నగారు ప్రతి నెల సబ్సిడి ఇచ్చేవారని, చంద్రబాబు రూ.600 సబ్సిడీని వెయ్యి చేస్తానని చెప్పారు. ఇంతవరకు ఇవ్వడం లేదని వారు చెబుతున్నారు. మూడేళ్లుగా సబ్సిడీ అందడం లేదని చేనేతలు పేర్కొంటున్నారు. వైయస్‌ జగన్‌ ధర్మవరం వస్తున్నాడని అప్పటికప్పుడు కొద్దోగోప్పో సబ్సిడీ ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఇవాళ వెంకటగిరిలో మూడేళ్లుగా సబ్సిడీ ఇవ్వడం లేదన్న సమాధానాలు వినిపిస్తున్నారు. గతేడాది ముడి సరుకుల ధర రూ.3500 ఉంటే ఈ ఏడాది రూ.7 వేలు అంటున్నారు. సరుకులు అమ్ముదామంటే సరైన ధర రావడం లేదు. ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఎన్నికలు వచ్చే సమయానికి చంద్రబాబుకు బీసీలు బాగా గుర్తుకు వస్తారు. ఎవరైనా గౌడ సోదరుడు కనిపిస్తే ఆయన బుజం మీద ట్యూబు తీసుకొని తన బుజంపై వేసుకొని ఫొటోకు ఫోజులు కొడతారు. బుట్టలు కుట్టే అమ్మపక్కన కూర్చొని ఫొటో దిగుతారు. మగ్గం పక్కనే కూర్చొని ఫోజులు కొడుతూ ఫోటోలు దిగారు. ఎన్నికలకు ముందు టీడీపీ ప్రతి కులానికి ఒక పేపర్‌ పెట్టి అందర్ని మోసం చేశారు.

ఒక్క హామీ అయినా నెరవేర్చారా?
చేనేత కార్మికుల బ్యాంకు రుణాలు మాఫీ అన్నారు. ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు. ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల తక్కువ వడ్డీకి రుణాలు అన్నారు. జిల్లాలో చేనేత పార్క్‌ ఏర్పాటు చేస్తామన్నారు. ఎక్కడైనా కనిపించిందా? బడ్జెట్లో కోటి రూపాయలు కేటాయిస్తానన్నాడు. ప్రతి చేనేత కుటుంబానికి రూ.1.50 లక్షలతో ఇల్లు, మగ్గం షెడ్డు నిర్మిస్తా అన్నాడు. చెప్పిన వాటి పరిస్థితి ఇలా ఉంటే..సబ్సిడీ కూడా ఇవ్వడం లేదు.

మనందరి ప్రభుత్వం వచ్చాక..
మీ అందరి చల్లని దీవెనలతో మనందరి ప్రభుత్వం వచ్చిన తరువాత మనం ఏం చేస్తామన్నది నవరత్నాలు ప్రకటించాం. చేనేతలకు ఇవి కాకుండా ఇంకా ఏం చేస్తే బాగుంటుందో మీరు సలహాలు ఇస్తే..వాటిని పరిశీలిస్తాం. పాదయాత్ర తరువాత బీసీ డిక్లరేషన్‌ ఏర్పాటు చేస్తాం. అందులో పొందుపరిచినవి అమలు చేస్తాం. మనందరి ప్రభుత్వం వచ్చాక మనం ఏం చేస్తున్నామో చెబుతున్నాను.

ఎన్ని లక్షలైనా ఫర్వాలేదు..
మన పిల్లలకు చదువులు ముఖ్యం. ఎన్నికలప్పుడు మాత్రం చంద్రబాబు బీసీలపై ప్రేమ అంటాడు. నాలుగు కత్తెర్లు ఇస్తే  అదేనా బీసీల మీద ప్రేమ. బీసీలపై నిజంగా ప్రేమ చూపింది ఒక్క వైయస్‌ రాజశేఖరరెడ్డి మాత్రమే అని గర్వంగా చెబుతున్నాను. పేదరికమన్నది పోవాలంటే మన కుటుంబాల నుంచి ఇంజినీర్లు, డాక్టర్లు అయితేనే అది సాధ్యం. పిల్లల చదువుల కోసం అప్పుల పాలు కాకుడదని ఆ రోజుల్లో నాన్నగారు ఫీజురీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఎన్ని లక్షలు అయినా ఫర్వాలేదు..నేను ^è దివిస్తానని ముందుకు వచ్చారు. ముఖ్యమంత్రి స్థానంలో మా పెద్దాయన ఉన్నారనే భరోసా ఉండేది. ఇవాళ మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మన పిల్లలను ఇంజినీర్లుగా, డాక్టర్లుగా చదివించే స్థితిలో ఉన్నామా? ఇవాళ ఇంజినీరింగ్‌ చదివించాలంటే లక్షల్లో ఫీజులు ఉన్నాయి. ఈ ప్రభుత్వం ముష్టి వేసినట్లు రూ.30, 35 వేల మాత్రమే ఇస్తుంది. మిగిలిన డబ్బుల కోసం తల్లిదండ్రులు అప్పులపాలు అవుతున్నారు. ఇవాళ ఈ వ్యవస్థ ఇంత దారుణంగా ఉంది. పేదవారి గురించి ఆరాటపడే పరిస్థితి లేదు. నాన్నగారు పేదవాడి కోసం ఒక్క అడుగు ముందుకు వేస్తే..ఆయన కొడుకుగా నేను రెండు అడుగులు ముందుకు వేస్తున్నాను. ఎన్ని లక్షలు ఖర్చు అయినా ఫర్వాలేదు..ఏం చదివిస్తారో చదివించండి..నేను భరిస్తాను. పిల్లలు హాస్టల్‌లో ఉండేందుకు అయ్యే ఖర్చుల నిమిత్తం ప్రతి ఏటా రూ.20 వేలు ఇచ్చి తోడుగా ఉంటాను. ఏ పిల్లాడు కూడా చదువుకోవడానికి తల్లిదండ్రులపై ఆధారపడకుండా ఉండేలా చూస్తాను. మన పిల్లలు ఇంజినీర్లు,డాక్టర్లు అవ్వాలంటే చిట్టిపిల్లలు బడికి వెళ్లాలి. వారి పునాది కోసం ప్రతి తల్లి తమ పిల్లలను బడికి పంపిస్తే చాలు ప్రతి ఏటా తల్లి ఖాతాలో రూ.15 వేలు జమా చేస్తామని మాట ఇస్తున్నాను. వాళ్లు ఉన్నత చదువులు చదివి మనకు తోడుగా ఉంటారు.

రూ.2 వేలు ఒక ఊరట..
చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో అవ్వతాతల పింఛన్లు పెంచాలనే ఆలోచన చంద్రబాబుకు రావడం లేదు. కారణం వారి పింఛన్లు పెంచితే చంద్రబాబుకు కమీషన్లు రావు కాబట్టి. అదే కాంట్రాక్టర్లకు అంచనాలు పెంచి ఇస్తున్నారు. అన్ని రేట్లు తగ్గినా కాంట్రాక్టర్లకు వేల కోట్లు దోచిపెడుతున్నారు. కారణం ఆయనకు బాగా లంచాలు వస్తాయి. నవరత్నాల్లో భాగంగా అవ్వతాతలకు తోడుగా ఉండేందుకు పింఛన్‌ వెయ్యి నుంచి రూ.2 వేలకు పెంచుతున్నాం. అంతేకాదు ఇవాళ ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీల పరిస్థితి దారుణంగా ఉంది. వారం రోజుల పాటు ఏదైనా జ్వరం వచ్చి పనులకు వెళ్లకపోతే పస్తులు ఉండాల్సి వస్తుంది. ఇలాంటి వారి కోసం పింఛన్‌ 45 ఏళ్లకే వచ్చేలా చేస్తాం. రూ.2 వేలు వస్తే ఒక ఊరట ఉంటుంది. 

ఆరోగ్యశ్రీని పూర్తిగా మార్చేస్తా..
ఆరోగ్యశ్రీని మెరుగు పరుస్తాం. ఇవాళ 108 నంబర్‌కు ఫోన్‌కొడితే అంబులెన్స్‌ రావడం లేదు. గతంలో 20 నిమిషాల్లో మన ఇంటి ముందు వచ్చి వాలేది. ఇవాళ 108కు ఫోన్‌చేస్తే జీతాలు ఇవ్వడం లేదని, అంబులెన్స్‌కు డీజిల్‌ లేదన్న సమాధాలు వస్తున్నాయి. ఇవాళ మంచి ఆసుపత్రులు అన్నీ కూడా హైదరాబాద్‌లోనే ఉన్నాయి. ఆరోగ్యశ్రీ పరిస్థితి దారుణంగాఉంది. వైద్యం చేయించుకునేందుకు హైదరాబాద్‌కు వెళ్తే ఆరోగ్యశ్రీ వర్తించదట. ఎటువంటి మంచి ఆసుపత్రులు లేని చోట ఆరోగ్యశ్రీ ఉన్నా..ఫలితం ఉండదు. ఇక్కడికి రాకముందు కూడా ఎంత దారుణంగా ఈ పథకం పరిస్థితి ఉందో రోజుకు ఒక్కటి, రెండు కేసులు నా ముందుకు వస్తున్నాయి. ఆరోగ్యశ్రీని పూర్తిగా మార్చేస్తాను. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వెయ్యి రూపాయిలు దాటితే చాలు దాన్ని ఆరోగ్యశ్రీ కిందికి తీసుకొస్తాం. ఎన్ని లక్షలు ఖర్చు అయినా ఫర్వాలేదు. ఉచితంగా ఆపరేషన్లు చేయించి ప్రతి ఒక్కరికి తోడుగా ఉంటానని మాట ఇస్తున్నాను. డాక్టర్లు ఆపరేషన్‌ చేసిన తరువాత రెస్టు తీసుకోవాలని చెబితే..సంపాదించే యజమాని విశ్రాంతి తీసుకుంటే..ఆ సమయంలో కూడా డబ్బులు ఇచ్చి తోడుగా ఉంటామని చెబుతున్నాను. దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారికి ప్రతి నెల రూ.10 వేల పింఛన్‌ ఇచ్చి పేదవాడికి తోడుగా ఉంటానని చెబుతున్నాను. ఇవి కాకుండా చేనేతలకు ఏదైనా చేస్తే బాగుంటుందని మీరు సలహాలు, సూచనలు ఇస్తే దాన్ని స్వీకరించి మనందరి ప్రభుత్వం వచ్చాక దాన్ని అమలు చేసి మీ అందరి ముఖాల్లో చిరున వ్వులు చూడాలన్నదే నా ధ్యేయం. ప్రతి చేనేత కార్మికుడికి ఎంతగా మేలు చేస్తాననంటే..తాను చనిపోయిన తరువాత మీ ఇంట్లో నాన్నగారి ఫోటో పక్కన నా ఫొటో పెట్టుకునేంతగా మేలు చేస్తానని మాట ఇస్తున్నాను.
 

తాజా వీడియోలు

Back to Top