అనుభవమంటే అబద్దాలు చెప్పడమేనా?

హైదరాబాద్, ఆగస్టు 22: బాధ్యతగల ప్రతిపక్ష నేతగా ప్రజా సమస్యలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నిస్తే ఆయనకేమీ తెలియదని, అవగాహన లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవమానించేలా మాట్లాడటం గర్హనీయమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు.

చంద్రబాబు దృష్టిలో అనుభవం అంటే ప్రజలకు అబద్దాలు చెప్పడమేనా? అని ప్రశ్నించారు. గురువారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ...అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేతగా జగన్ రుణ మాఫీతో సహా అనేక హామీలపై నిలదీస్తే 'మీకేమీ తెలియదు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలకు అవగాహన లేదు' అని ముఖ్యమంత్రి తేలిగ్గా మాట్లాడి తప్పించుకుంటున్నారని ఆక్షేపించారు. జగన్ అడుగుతున్న వాటిలో అర్థం కానివేమీటంటూ ఆయన కొన్ని ప్రశ్నలు సంధించారు.

ఎన్నికల్లో టీడీపీ గెలవటానికి రైతు, డ్వాక్రా రుణమాఫీ, మరో ఆరేడు వాగ్దానాలు ప్రధాన కారణం. వీటిని నమ్మే ప్రజలు బాబుకు ఓట్లేశారు. మరి ఆ వాగ్దానాలకు అనుగుణంగా బడ్జెట్ లో కేటాయింపులు పెట్టలేదని జగన్ ప్రశ్నించారు. దీనికి ఏం అనుభవం కావాలి? రుణమాఫీపై ముఖ్యమంత్రి, మంత్రులు పొంతన లేకుండా మాట్లాడుతూ ప్రజలను గందరగోళపరుస్తున్నారు. స్పష్టత ఇవ్వండని ప్రతిపక్ష నేత అడిగారు. దానికి జవాబు చెప్పకుండా...మీకేమీ తెలియదంటూ విషయాలను పక్కదోవ పట్టిస్తున్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రజల తరఫున ప్రతిపక్ష నేతే ప్రశ్నిస్తారు. ఈ మాత్రం బాబుకు తెలియదా?

జగన్ పై కేసులున్న విషయాన్ని అధికారపక్షం పదే పదే ప్రస్తావించడం సరికాదు. ఆ కేసులన్నీ న్యాయస్థానాల్లో విచారణలో ఉన్నాయి.

ప్రణాళికా వ్యయం కింద బడ్జెట్ లో కేటాయించిన నిధులు తక్కువగా ఉన్నప్పుడు కేంద్ర నుంచి 28.500 కోట్ల రూపాయల మేరకు నిధులు ఎలా వస్తాయని జగన్ ప్రశ్నించారు. ఇటీవలి కేంద్ర బడ్జెట్ లో సైతం ఈ అంశం ప్రస్తావించలేదు. సరికదా...గతంలో ఎన్నడూ గ్రాంట్ ఇన్ ఎయిడ్ గా ఇంత పెద్ద మొత్తంలో నిధులు రాలేదు. అలాంటపుడు కేంద్ర నిధులు ఎలా వస్తాయి?

రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు రైతు రుణాల మాఫీకి వాగ్దానం చేశానని చంద్రబాబు చెప్పడం శుద్ధ అబద్దం. రాష్ట్రం విడిపోయాకే ఎన్నికల కమిషన్ కు రుణామాఫీ చేస్తానని బాబు లేఖ రాశారు. అనుభవం అంటే అబద్దాలు చెప్పడమేనా?

చంద్రబాబు విడుదల చేస్తున్న శ్వేతపత్రాల్లో గత పదేళ్ళలో రాష్ట్రం అన్ని రంగాల్లోనూ భ్రష్టుపట్టి పోయిందని అంటున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వ సంస్థల వద్ద ఉన్న రికార్డుల్లో పేదరిక నివారణలో రాష్ట్రం ముందంజలో ఉన్నట్లు రాష్ట్ర జీఎస్ డీపీ పెరిగినట్లు వెల్లడవుతోంది. ఇదంతా బాబు దివాళాకోరుతనం కాదా? అని ధర్మాన ప్రశ్నించారు.

Back to Top