కరెంట్ కోతలపై జగన్ ఆందోళన

విజయవాడ, జూన్ 14: వడగాడ్పుల వల్ల ఆంధ్రప్రదేశ్ లో నిత్యం వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆవేదన, ఆందోళన వ్యక్తం చేశారు. గత రెండు రోజుల్లోనే ఏకంగా 225 మంది ప్రాణాలు పోయాయంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థమవుతోందన్నారు.

జూన్ మూడో వారంలోకి అడుగుపెడుతున్నా...ఒక వంక వడగాడ్పులు, ఎండ తీవ్రత తగ్గకపోవడం...మరో వంక అటు పల్లెల్లోను ఇటు పట్టణాలలోను భారీగా కరెంట్ కోతలు విధించడం ఈ పరిస్థితికి కారణం అవుతోందని శ్రీ జగన్ పేర్కొన్నారు. నీటి కొరత కూడా ప్రజల ప్రాణాలు పోవటానికి కారణం అవుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించి ప్రజల రక్షణ కోసం ప్రభుత్వ యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేయాలని, అన్ని చర్యలు తీసుకోవాలని కోరారు. కరెంట్ కోతలు లేకుండా చూడాలని, వడగాడ్పుల ప్రభావం వలన ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని ఆయన కోరారు.

Back to Top