ఎన్నికల కోసం బాబు డ్రామాలు

 

– పింఛన్లు ఇవ్వడం లేదని చంద్రబాబుకు ఇప్పుడే తెలిసిందట
– కొత్త పింఛన్లతో పాటు నాలుగేళ్ల బకాయిలు కూడా ఇవ్వండి.
–కరెంటు బిల్లులు పెంచినందుకు ఓట్లు వేయాలా?
– ఏమీ చేయకుండా ఓట్లు అడుగుతున్న చంద్రబాబు సిగ్గుపడాలి.
– ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు.
– చంద్రబాబు పాలనలో రోగమొస్తే చనిపోవాల్సిందే
– అందరికీ కార్పోరేట్‌ వైద్యం అందిస్తాం
– ఎంత పెద్ద ఆçపరేషన్‌ అయినా ఉచితంగా చేయిస్తాం. 
 – కిడ్నీ పేషెంట్లకు నెలకు రూ.10 వేలు పింఛన్‌
– ఏపీఎస్‌ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం.
– పుంగనూరుకు నీరు తెస్తా..ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తా
 
చిత్తూరు: మరో ఏడాదిలో ఎన్నికలు జరుగబోతున్నాయని చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. నాలుగేళ్ల పాటు పింఛన్లు ఇవ్వకుండా అన్యాయం చేసిన ఈ వ్యక్తికి ఇప్పుడు జ్ఞానోదయం అయిందని, పింఛన్లు ఇవ్వడం లేదన్న విషయం ఇప్పుడే తెలిసిందని డ్రామాలాడుతున్నారని ఫైర్‌ అయ్యారు. నాలుగేళ్లలో ఏ ఒక్క హామీని అమలు చేయని వ్యక్తి తనకు ఓట్లు వేయకపోతే ప్రజలు సిగ్గుపడాలని చెప్పడం దుర్మార్గమన్నారు. చిత్తూరు జిల్లాకు చంద్రగ్రహణం పట్టుకుందని, అభివృద్ధి ఆగిపోయిందని జననేత ధ్వజమెత్తారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా చిత్తూరు జిల్లా సదుం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అశేష జనవాహిణిని ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన ఏమన్నారంటే..

– మేమంతా మీకు తోడుగా ఉన్నామని నాతో పాటే అడుగులో అడుగులేశారు. ఇన్ని వేల మంది ఈ నడిరోడ్డుపై ఇక్కడికి వచ్చి ఈ ఎండలో నిలబడాల్సిన అవసరం ఏ ఒక్కరికి లేదు. ఎండను ఖాతరు చేయడం లేదు. నడిరోడ్డు అని లెక్క చేయడం లేదు. చిక్కటి చిరునవ్వుతో ప్రేమానురాగాలు చూపుతున్నారు. ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.

ఓట్ల కోసం బాబు పాట్లు..
ఈ రోజు మీరు పేపర్‌ చదివి ఉంటారు. నిన్న చంద్రబాబు మాటలు చూస్తే నాకు ఆశ్చర్యమనిపించింది. నాలుగేళ్లు చంద్రబాబు పాలన చూశారు. మరో ఏడాదిలో ఎన్నికలు జరుగుతాయని చంద్రబాబు చెబుతున్నారు. ఇదే చంద్రబాబు అంటారు..పింఛన్లు ఇవ్వడం లేదన్న సంగతి నాకు ఇప్పుడే తెలిసిందట. చాలా మందికి పింఛన్లు ఇవ్వలేకపోయానని నాకు అర్థమైందని చంద్రబాబు అంటున్నారు. నాలుగేళ్ల పాటు సీఎంగా పనిచేశావు. మరో ఏడాదిలో ఎన్నికలు ఉన్నాయని డ్రామాలు ఆడుతున్నారు. ఇప్పటికైనా మీరు ఒప్పుకున్నారు. ఇక ఓట్ల కోసం ప్రజలను మభ్యపెట్టేందుకు కొత్త పింఛన్లు ఇవ్వండి, ఈ నాలుగేళ్ల పాటు బకాయిలు కూడా ఇవ్వమని నేను డిమాండు చేస్తున్నాను. గతంలో ఎన్‌టీ రామారావు కొత్త పార్టీ పెట్టినప్పుడు ప్రజలకు రూ.2 కిలో బియ్యం ఇస్తామని హామీ ఇచ్చారు. ఎన్‌టీఆర్‌కు ఓట్లు వేస్తారని అప్పటి ప్రభుత్వం రూపాయి 75 పైసలకే బియ్యం ఇచ్చారు. ఎన్నికలప్పుడే మేం గుర్తుకు వస్తామా అని ప్రజలు ఆప్పటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పినట్లు చంద్రబాబు కూడా ఇప్పుడు బుద్ధి చెప్పనున్నారు. 

నీకు ఓటేందుకు వేయాలి బాబూ?
చంద్రబాబుకు ఓట్లు వేయకపోతే మనం సిగ్గుపడాలంట. ఆయన అంటున్న మాటలు చూస్తే చంద్రబాబుకు కన్నులు నెత్తికి వచ్చినట్లు అనిపించడం లేదా అని ప్రశ్నించారు. మనిషి ఎదిగే కొద్ది ఒదగాలి.  నాలుగేళ్ల చంద్రబాబు పాలన చూశారు కాబట్టి నేను అడుగుతున్నాను. నీకు ఓటు వేయకపోతే ప్రజలు సిగ్గుపడాలా? అన్ని రకాలుగా అన్యాయాలు చేస్తూ దోచుకొని పరిపాలన చేస్తూ మళ్లీ ప్రజలను ఓట్లు అడుగుతున్నందుకు నీవు సిగ్గుపడాలా?. చంద్రబాబు నీకు ప్రజలు ఓట్లు ఎందుకు వేయాలని అడుగుతున్నాను. ఆర్టీసీ చార్జీలు పెంచినందుకు ఓటు వేయాలా అని అడుగుతున్నాను. మూడు సార్లు కరెంటు బిల్లులు పెంచినందుకు ఓట్లు వేయాలా?. రేషన్‌ షాపుల్లో గతంలో 9 రకాల సరుకులు ఇచ్చేవారని, ఇప్పుడు బియ్యం తప్ప వేరేవి ఏమీ ఇవ్వడం లేదు.
 
ఎన్నికల్లో ఊదరగొట్టారు..
ఎన్నికల సమయంలో చంద్రబాబు అది చేస్తాం..ఇదిచేస్తామని ఊదరగొట్టారు. తీరా అధికారంలోకి వచ్చాక ఏ ఒక్కటి చేయడం లేదు. ప్రతి పేద వాడికి మూడు సెంట్ల స్థలం, పక్కా ఇల్లు కట్టిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. నాలుగేళ్లలో కనీసం ఒక్క ఇల్లైనా కట్టించాడా?.  బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు రావాలన్నారు.  వ్యవసాయ రుణాలన్నీ కూడా బేషరత్తుగా మాఫీ కావాలంటే బాబు సీఎం కావాలన్నారు. నాలుగేళ్ల తరువాత అడుగుతున్నాను..బ్యాంకుల్లో బంగారం ఇంటికి వచ్చిందా అని అడుగుతున్నాను. బ్యాంకుల్లో బంగారం ఇంటికి రాలేదు. బ్యాంకుల నుంచి నోటీసులు మాత్రమే వస్తున్నాయి. రుణమాఫీ పథకం రైతుల వడ్డీలకు సరిపోవడం లేదు.  పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల రుణాలన్ని పూర్తిగా మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. నాలుగేళ్ల తరువాత అడుగుతున్నాను..కనీసం ఒక్క రూపాయి అయినా మాఫీ అయ్యిందా అని అడుగుతున్నాను. పైగా వడ్డీ లేని రుణాలు కూడా రావడం లేదు. సీఎం కాగానే బ్యాంకులకు వడ్డీ లెక్కలు చెల్లించడం లేదు.  జాబు రావాలంటే బాబు రావాలని ఆ నాడు ఎన్నికల సమయంలో అన్నాడు. ఆ రోజు ప్రతి నిరుద్యోగికి  రూ.2 వేల నిరుద్యోగ భృతి చెల్లిస్తామని ప్రతి ఇంటికి లెటర్‌ పంపించాడు. ఇప్పటి వరకు రూ.90 వేలు ప్రతి ఇంటికి బాకీ పడ్డాడు. నిరుద్యోగ భృతి ఎగురగొట్టినందుకు నీకు ఓటు వేయాలా ? . ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తారు. దాని వల్ల కాస్తోకూస్తో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. నాడు ప్రత్యేక హోదా సంజీవని అని, 15 ఏళ్ల ప్రత్యేక హోదా తీసుకువస్తానని చెప్పిన వ్యక్తి తన ఓటుకు కోట్లు కేసు కోసం తాకట్టు పెట్టారు.ప్రత్యేక హోదాను అమ్మినందుకు ఓట్లు వేయాలా?

రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి 
రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి జరుగుతుంది. ఇసుక, మట్టి, బొగ్గు, రాజధాని భూములు, గుడి భూములు కూడా వదలకుండా అవినీతి చేస్తున్నారు. పైస్థాయిలో చంద్రబాబు అవినీతికి పాల్పడుతూ గ్రామస్థాయిలో జన్మభూమి కమిటీలతో మాఫియాను తయారు చేశారు. పింఛన్లు రావాలన్నా..మరుగుదొడ్డి మంజూరు కావాలన్నా లంచాలు అడుగుతున్నారు.

చంద్రగ్రహణం
పుంగనూరు నియోజకవర్గంలో తాగునీరు ఇచ్చేందుకు కొళ్లకుంట రిజర్వాయర్‌ను కట్టించారు. పుంగనూరులో సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకును దివంగత ముఖ్యమంత్రి కట్టించారు. మధ్యలో వేసే పైప్‌లైన్‌కు గ్రహణం పట్టుకుంది. ఇవాల్టికి పుంగనూరుకు తాగునీరు కరువైంది. ఇదే సదుంలో 30 పడకల ఆసుపత్రి కోసం రామచంద్రారెడ్డి తన సొంత భూమి 11 ఎకరాలు ప్రభుత్వానికి ఇచ్చారు. ఆ రోజు శంకుస్థాపన కూడా జరిగింది. టెండర్లు కూడా పిలిచారు. దానికి చంద్రగ్రహణం పట్టుకుంది. ఆ భూమి వెనక్కి ఇవ్వరు. ఆసుపత్రి కట్టడం లేదు. మనమన్న ఆ ఆసుపత్రి కడుదామని రామచంద్రారెడ్డిని అడుగుతున్నాను. ఆసుపత్రి కట్టించి ఓట్లు అడుగుదాం. 

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తా
పుంగనూరులోని ఆర్టీసీ డిపో కట్టి 7 సంవత్సరాలు అవుతున్నా..ఇంతవరకు బస్సులు కేటాయించడం లేదు. ఇదీ చంద్రబాబు పాలన తీరు. ఇల్లు ఇవ్వరూ, ఏ నిధులు ఇవ్వరు. ఆయనంతకు ఆయనే డబ్బాలు కొట్టుకుంటున్నారు. ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయ పాలన ఇలా ఉంది. ఏడాదిలో ఎన్నికలు జరుగబోతున్నాయని చంద్రబాబే అంటున్నారు. రేపు మనందరి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఏం చేస్తామన్నది చెబుతున్నాను. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని మాట ఇస్తున్నాను. ఆర్టీసీ డిపోను బ్రహ్మండంగా నడిపిస్తానని చెబుతున్నాను. హంద్రీనీవా పనులకు సంబంధించి కాల్వలు తవ్వినా..పిల్ల కాల్వలు తవ్వడం లేదు. నీరు ఇవ్వాలన్న ధ్యాస చంద్రబాబుకు లేదు. హంద్రీనీవా నీళ్లను తీసుకొస్తానని హామీ ఇస్తున్నాను. మీ చెరువులకు నీరిచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తానని చెబుతున్నాను.

పేదల ముఖాల్లో చిరునవ్వు చూడాలన్నదే ధ్యేయం
మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనం ఏం చేయబోతున్నామన్నది నవరత్నాల గురించి ప్రతి మీటింగ్‌లో చెప్పుకుంటూ వస్తున్నాను. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నవరత్నాల్లోని వైద్యం గురించి మీ అందరికి చెబుతున్నాను. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనను గుర్తుకు తెచ్చుకోండి. పేదవాడు అప్పులపాలు అయ్యేది రెండే రెండు కారణాలు. వైద్యం, విద్య కోసం అప్పులు చేస్తున్నారు. ఆ పరిస్థితి మార్చేందుకు దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి గొప్ప స్వప్నాన్ని చూశారు. నాడు 108కు ఫోను చేస్తే 20 నిమిషాల్లో మీ ముందుకు వచ్చేది. ఇవాళ మీ గుండెల మీద చేతులు వేసుకొని ఆలోచన చేయండి. ఇవాళ 108 నంబర్‌కు ఫోన్‌ కొడితే అంబులెన్స్‌ వస్తుందా? మా డ్రైవర్లకు జీతాలు ఇవ్వడం లేదు. మా అంబులెన్స్‌కు టైర్లు బాగలేవు అన్న సమాధానాలు వస్తున్నాయి. దారిపొడువునా ఈ పాదయాత్రలో రోజుకు ఎంతో మంది నా వద్దకు వచ్చి వైద్యం చేయించుకోలేకపోతున్నామని వాపోతున్నారు. పెద్ద ఆపరేషన్లు చేయించుకోవాలంటే మనమంతా కూడా హైదరాబాద్‌కు వెళ్తాం. ఇక్కడ మనకు మంచి ఆసుపత్రులు లేవు కాబట్టి హైదరాబాద్‌కు వెళ్తాం. అయితే ఇవాళ హైదరాబాద్‌కు వెళ్తే ఆరోగ్యశ్రీ వర్తించదట. ఎవరికైనా క్యాన్సర్‌ వస్తే 7, 8 సార్లు కీమో థెరఫీ చేయాలట. ఇవాళ ప్రభుత్వం రెండు సార్లు మాత్రమే చేస్తున్నారు. ఆరు నెలల తరువాత పేషేంట్‌ అకాల మరణం పొందుతున్నారు. ఇవాళ మూగ చెవుడు ఉన్న పిల్లాడికి ఆపరేషన్‌ చేయించకపోతే జీవితాంతం అలాగే బతకాల్సి వస్తుంది. ఆ నాడు మూగచెవుడు పిల్లలకు ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్లు చేయించేవారు. ఇవాళ అలాంటి పరిస్థితి లేదు. కిడ్నీ బాగోలేకపోతే డయాలసిస్‌ చేయించుకోవాలి. ఒక్కసారి చేయించాలంటే రూ. 2 వేలు అవుతుంది. ఏడాది రూ.2 లక్షలు ఖర్చు అవుతుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డయాలసిస్‌ చేయడం లేదు. నెట్‌ వర్క్‌ ఆసుపత్రులకు బిల్లులు ఇవ్వడం లేదు. రేపు మనందరి ప్రభుత్వం వచ్చిన తరువాత నాన్నగారు ఒక్క అడుగు ముందుకు వేస్తే..ఆయన కొడుకుగా నేను రెండు అడుగులు ముందుకు వేస్తాను. ఆరోగ్యశ్రీలో ఎంతటి ఆపరేషన్‌ అయినా సరే ఉచితంగా చేయిస్తానని హామీ ఇస్తున్నాను. వెయ్యి రూపాయల బిల్లు దాటితే ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయిస్తాం. నాన్నగారి హయాంలో మీరంతా చూశారు. ఆయన కొడుకుగా రెండు అడుగులు ముందుకు వేస్తున్నాను. ఆపరేషన్‌ చేయించిన తరువాత విశ్రాంతి తీసుకునే సమయంలో కూడా డబ్బులు ఇస్తామని మాట ఇస్తున్నాను. కిడ్నీ పేషేంట్లకు ప్రతి నెల  పింఛన్లు రూ.10 వేలు ఇస్తానని చెబుతున్నాను. పేదవాడి ముఖంలో చిరునవ్వులు చూడాలన్నదే నా ధ్యేయమని వైయస్‌ జగన్‌ పేర్కొన్నారు.
 

తాజా వీడియోలు

Back to Top