అరుణ్ జైట్లీతో వైయస్ జగన్ భేటీ

  • బాబు రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారు
  • ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు
  • అగ్రిగోల్డ్ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలి
  • పేపర్ లీకేజీ అంశాన్ని బాబు తప్పుదోవ పట్టిస్తున్నాడు
  • ఓటుకు కోట్లు కేసులో బాబు అడ్డంగా దొరికిపోయాడు
  • తమ గురించి మాట్లాడే నైతిక హక్కు బాబుకు లేదు
న్యూఢిల్లీ:  చంద్రబాబుకు తన తప్పులను ఎత్తిచూపిన వారిపై ఆరోపణలు చేయడం అలవాటుగా మారిందని ప్రతిపక్షనేత, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు.  ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసం ఢిల్లీలో వివిధ జాతీయ పార్టీల నాయకులను కలుస్తున్న ఆయన... అందులో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీని కలిశారు. వైయస్ఆర్‌సీపీ గుర్తుపై గెలిచిన వారిని టీడీపీలోకి తీసుకొని రాజీనామా చేయించకుండా బాబు నలుగురికి మంత్రి పదవులు ఇచ్చిన విషయాన్ని వైయస్‌ జగన్‌ జైట్లీ దృష్టికి తీసుకు వెళ్లారు.

అరుణ్‌జైట్లీతో భేటీ అనంతరం వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ ....ఎన్డీయే భాగస్వామిగా ఉన్న చంద్రబాబు రాజ్యాంగాన్ని ఉల్లంఘించి, ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేశారన్నారు. అనర్హత పిటిషన్లను పెండింగ్‌లో ఉంచారన్నారు. అలాగే అగ్రిగోల్డ్‌ డిపాజిట్‌దారుల ఆవేదనను జైట్లీకి వివరించినట్లు చెప్పారు. హాయ్‌ల్యాండ్‌ లాంటి విలువైన ఆస్తులను వేలానికి రాకుండా చూస్తున్నారని, అగ్రిగోల్డ్‌ వ్యవహారంపై సీబీఐ విచారణ చేయించాలన్నారు. వ్యవస్థలను మేనేజ్‌ చేస్తూ ...డిపాజిటర్లకు నష్టం కలిగిస్తున్నారన్నారు. బినామీ ఆస్తులను వెలికి తీయాలని డిమాండ్‌ చేశారు. ఓటుకు కోట్లు కేసులో దొరికిపోయినప్పుడు తన ఫోన్‌ను ఎలా ట్యాప్‌ చేస్తారని చంద్రబాబు ఆరోపించిన విషయాన్ని వైయస్‌ జగన్‌ ఈ సందర్భంగా గుర్తు చేశారు. నారాయణ స్కూల్‌లో పదో తరగతి ప్రశ్నాపత్రం లీకైతే మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాసరావుపై చర్యలు తీసుకోలేదన్నారు. పైగా డీఈవోకు సమాచారం ఇచ్చిన జర్నలిస్ట్‌పై ప్రత్యారోపణలు చేశారన్నారు. ఈ అంశాన్ని స్టింగ్‌ ఆపరేషన్‌ అంటూ చంద్రబాబు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని వైయస్‌ జగన్‌ వ‍్యాఖ్యానించారు.

పార్టీ మారినవారిపై అనర్హత వేటు వేయకుండా వారికి మంత్రి పదవులిచ్చారన్నారు. దానిపై ఫిర్యాదు చేయడానికి ఢిల్లీకి వస్తే తమపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.  చంద్రబాబులా కేసుల నుంచి తప్పించుకునే అలవాటు తనకు లేదన్నారు. తనపై పెట్టిన కేసులు కుట్రపూరితమన్నారు. తనను రాజకీయంగా అణగదొక్కాలని చేసిన కుట్ర అని అన్నారు. ఈ విషయం ప్రజలందరికీ తెలుసునని వైయస్‌ జగన్‌ అన్నారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారని, అలాంటి వ్యక్తికి తమ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. ఆడియో, వీడియో టేపుల్లో అడ్డంగా దొరికిపోయి, పదవిలో కొనసాగుతున్న ఏకైక వ్యక్తి చంద్రబాబు అన్నారు. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి ఘటన జరిగి ఉండదని వైయస్‌ జగన్‌ పేర్కొన్నారు. ఓటుకు కోట్లు కేసులో అన్ని పరిశీలించాకే సుప్రీంకోర్టు చంద్రబాబుకు నోటీసులు ఇచ్చిందన్నారు. 
Back to Top