రైతులను ఊరడించిన జగన్‌మోహనరెడ్డి

గుంటూరు: ఉండవల్లి రాజధాని ప్రాంత రైతులతో  వైఎస్ జగన్ ముఖాముఖి నిర్వహించారు. ఈ ముఖాముఖిలో పలు విషయాలు వెలుగు చూశాయి. ఆయన ముందుకు వచ్చి బాధిత రైతు, రైతుకూలీ కుటుంబాల వారు తమ గోడును వెళ్లబోసుకున్నారు. పార్వతి అనే మహిళా రైతు జగన్‌తో మాట్లాడుతూ.. ఉన్న మూడెకరాల్లో కూతుళ్లకు ఇవ్వగా మిగిలింది 20 సెంట్లేనని, దానికి ప్రభుత్వ అధికారులు పదో ఇరవై వేలో ఇస్తానంటున్నారని చెప్పారు. తమకు డబ్బులు ముఖ్యం కాదని, అసలు భూమి లేకుండా ఎలా బ్రతకాలని ప్రశ్నించారు. మేం గడ్డి తినాలా అని ప్రభుత్వాన్ని నిలదీ శారు. మా భూములు లాక్కుంటే నా భర్త నేను పంట పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుం టాం అంటూ  ఆమె కంటతడిపెట్టారు. ఆమెను అనున యించిన జగన్  మీ పెద్దకొడుకును నేనున్నానమ్మా అంటూ ఆమెకు ధైర్యం చెప్పారు.  ‘‘పొలాలు ఇచ్చేది లేదు. దయ చేసి మమ్మల్ని వదిలేయమని మీరైనా ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లండి సారూ..’’ అంటూ ఆమె జగన్‌ను అభ్యర్థించడం అందరినీ కలచివేసింది.  ఏవేవో మాయమాటలు చెప్పి ఆగం చేస్తారంటూ చెప్పినాయన ఎన్నాళ్లు అధికారంలో ఉంటాడో కూడా తెలియదు అని ఆమె అన్నారు. భూములు లేకపోతే తమ ఇళ్లల్లో పెళ్లిళ్లు ఎలా చేయాలని ఆమె ప్రశ్నించారు. ఇలా ఎందరో మహిళలు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. తమ నోటికాడ కూడు లాక్కుంటున్నారని, ప్రాణాలైనా వదులుతాం కానీ సెంటు భూమి కూడా ఇవ్వబోమని వారంతా స్పష్టం చేశారు.
Back to Top