న్యాయం చేయండి ప్లీజ్..!

() టీడీపీ అరాచకాలపై గవర్నర్ కు ఫిర్యాదు

() ఎమ్మెల్యే రోజాకు జరిగిన అన్యాయంపై వినతి

() చర్యలు తీసుకోవాలని కోరిన జన నేత వైఎస్ జగన్

హైదరాబాద్) హైకోర్టు అనుమతి ఇచ్చినప్పటికీ పట్టించుకోకుండా మహిళా ఎమ్మెల్యే
రోజాను అసెంబ్లీలోకి రానీయకుండా తెలుగుదేశం చేస్తున్న కుట్రల్ని... గవర్నర్ నరసింహన్
కు తెలియపరిచారు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్. ఈ మేరకు గవర్నర్ కార్యదర్శికి రెండు పేజీల వినతి పత్రాన్ని
సమర్పించారు. వినతి పత్రం సారాంశం ఇదే..!

          గవర్నర్ నరసింహన్ గారికి,

      ఆంధ్రప్రదేశ్ శాసనసభ నిబంధనా వళి
లోని రూల్ నెం. 340 (2) కింద డిసెంబర్ 18, 2015 నాడు అసెంబ్లీ నుంచి నగిరి
శాసనసభ్యురాలు శ్రీమతి ఆర్ కే రోజా ను ఏడాది పాటు 
సస్పెండ్ చేయటం జరిగింది. దీన్ని గౌరవ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి
ప్రతిపాదించగా, మా పార్టీ తరపున మేమంతా నిరసన తెలుపుతున్నప్పటికీ సభలో ఆమోదించినట్లు
ప్రకటించారు.

      ఈ నిబంధన 340(2) అనేది ఒక సభ్యుడు
లేక సభ్యురాలిని ఆ సెషన్ పూర్తయ్యే వరకు సస్పెండ్ చేయగలరు తప్పితే అంతకు మించి
సస్పెండ్ చేయటం కుదరదు. అదే విషయాన్ని మేం తెలియపరిచి నిరసన వ్యక్తం చేశాం. కానీ,
తాము తలచుకొంటే ఏదైనా చేయగలం అని, ఎటువంటి కోర్టులు తమను ఏమీ చేయలేవని సదరు మంత్రి
సభలో వెల్లడించారు. అయితే ఈ దేశంలో నిర్దిష్టమైన చట్టవ్యవస్థ ఉందని మరిచిపోయారు.
అనేక సందర్బాల్లో శాసన వ్యవస్థలో చోటు చేసుకొన్న పరిణామాలపై కోర్టులు జోక్యం
చేసుకొన్నాయి. తాజాగా అలగాపురమ్ ఆర్ మోహన్ రాజ్ మరియు ఇతరులు వెర్సస్ తమిళనాడు
శాసనసభ అనే కేసులో ఉన్నత న్యాయస్థానం సదరు సభ్యులకు న్యాయం ప్రసాదించింది.

      శాసనసభ నుంచి డిసెంబర్ 18, 2015
నాడు సస్పెండ్ చేస్తూ చేసిన తీర్మానం మీద హైకోర్టు ..శ్రీమతి రోజా కు మార్చి 17,
2016వ తేదీన ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది. వెంటనే సమావేశాలకు హాజరు అయ్యేందుకు
అనుమతిని ఇవ్వటంతో పాటు, ఈ ఆదేశాలను శాసన వ్యవహారాల శాఖ ముఖ్య కార్యదర్శికి  ఈ మెయిల్ ద్వారా పంపటం జరిగింది.

      అంతే కాకుండా అసెంబ్లీ
కార్యదర్శికి మార్చి 17, 2016వ తేదీనే మధ్యాహ్నం శ్రీమతి రోజా  ఈ ఉత్తర్వుల కాపీని అందచేయటం జరిగింది. దీన్ని
స్వీకరించినట్లు ఆయన ధ్రువీకరించారు.

      ఈ ఆదేశాలకు అనుగుణంగా శ్రీమతి
రోజా శాసనసభ సమావేశాలకు హాజరు అయ్యేందుకు సభకు వెళుతుంటే చీప్ మార్షల్స్ ఆమెను నిలిపివేశారు.
దీనిమీద ప్రతిపక్ష నేత గా నేను ఆయన్ని ప్రశ్నించాను. ఉన్నతాధికారుల ఆదేశం మేరకు
ఆమెను నిలిపివేస్తున్నానని చెప్పటం తప్ప ఆయనేమీ నిర్దిష్ట జవాబు ఇవ్వనే లేదు.
కనీసం రాత పూర్వకంగా ఉన్న ఆదేశాల్ని చూపటం లేదు. దీనిమీద కొందరు మా పార్టీ
ఎమ్మెల్యేలు అసెంబ్లీ కార్యదర్శిని ప్రశ్నించినప్పటికీ సరైన సమాధానం రాలేదు.
శాసనసభ స్పీకర్ నుంచి ఆదేశాలు వచ్చినట్లుగా పరిస్థితి కనిపిస్తోంది. కానీ, ఒక
ఎమ్మెల్యేకు చట్టబద్దంగా సంక్రమించిన హక్కుని కాలరాయటం కన్నా తీరని అవమానం
ఏముంటుంది.

      బహిరంగంగా హైకోర్టు ఇచ్చిన
ఆదేశాల్ని ఉల్లంఘించటమే కాకుండా తీవ్ర అన్యాయానికి ఒడిగడుతున్న పరిస్థితి మీద మేం
నిరసన తెలిపాం. అసెంబ్లీ గేటు దగ్గర ఉదయం 8.45 నుంచి 10.45 దాకా, తర్వాత గాంధీ
విగ్రహం దగ్గర మేం శాంతియుతంగా నిరసన తెలిపాం. కానీ ఏ మాత్రం ఉపయోగం లేకుండా
పోయింది.

      హైకోర్టు ఆదేశాల్ని పాటించాలని
గౌరవ శాసనసభ స్పీకర్ కు సూచించాలని ఈ రాష్ట్ర రాజ్యాంగ అధిపతిగా మిమ్మల్ని
కోరుతున్నాం.

ధన్యవాదములతో..

వైఎస్ జగన్.

 

Back to Top