ప్రతి కుటుంబం "వైయస్ఆర్ కుటుంబం" కావాలి

  • మన ఈ కార్యక్రమంతో చంద్రబాబుకు దిమ్మతిరగాలి
  • ఎన్నికల్లో ఇచ్చిన ఏ వాగ్ధానాన్ని నెరవేర్చలేదు..మోసం చేశాడు
  • సెప్టెంబర్ 11 నుంచి అక్టోబర్ 2 వరకు "వైయస్ఆర్ కుటుంబం" కార్యక్రమం
  • ప్రతీ గ్రామానికి వెళ్లండి..బాబు మోసాలను వివరించండి
  • వైయస్ఆర్ చేసిన మంచిని, విశ్వసనీయతను ప్రజలకు గుర్తు చేయండి
  • ప్రతి కుటుంబం నుంచి 9121091210కు మిస్డ్ కాల్ రావాలి
  • మనం అధికారంలోకి వచ్చాక నవరత్నాలతో మేలు జరుగుతుందని చెప్పండి
  • సమస్యల పరిష్కారానికి ప్రతి గ్రామంలో గ్రామ సెక్రటేరియట్ ఏర్పాటు చేస్తాం
  • పులివెందులలో "వైయస్ఆర్ కుటుంబం" కార్యక్రమం ప్రారంభించిన వైయస్ జగన్
పులివెందులః చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి పట్టిన శని అని వైయ్ససార్సీపీ అధినేత వైయస్ జగన్ మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేశాడని ధ్వజమెత్తారు. మహానేత వైయస్ఆర్ 8వ వర్థంతి సందర్భంగా వైయస్ జగన్ పులివెందులలో వైయస్ఆర్ కుటుంబం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..ప్రతీ ఇంటికి నవరత్నాలను తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వైయస్ఆర్ చేసిన మంచి పనిని, విశ్వసనీయతను ప్రజలకు గుర్తు చేయాలని సూచించారు. చంద్రబాబు చేసిన మోసాలను, అన్యాయాలను వివరించాలని పిలుపునిచ్చారు.  సెప్టెంబర్ 11 నుంచి అక్టోబర్ 2 దాకా వైయస్ఆర్ కుటుంబం  కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. నేటి నుంచి సెప్టెంబర్ 11వరకు బూత్ కన్వీనర్ లకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు.  ప్రతి ఇంటి నుంచి  వైయస్ఆర్ కుటుంబసభ్యునిగా ఎలా చేసుకోవాలన్న దానిపై తర్ఫీదు ఇస్తారని చెప్పారు.  10 మంది గ్రామ కమిటీ సభ్యులు  20 రోజుల పాటు గ్రామంలోని ప్రతి ఇంటికి వెళతారని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైయస్ జగన్ ఇంకా ఏమన్నారంటే...

పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం
ఓ ఇంట్లో కనీసం 20 నిమిషాలు కూర్చోండి. బాబు చేసిన అన్యాయాల మీద వంద ప్రశ్నలకు సంబంధించి ఆ కుటుంబంతోనే మార్కులు వేయించండి. ఎన్నికలప్పుడు బాబు ఇచ్చిన వాగ్ధానాలు చేశాడంటే చేశాడని, చేయలేదంటే చేయలేదని వారితోనే చెప్పించండి.  
నాన్న గారు చేసిన మేలును జ్ఞాపకం చేయండి. మనం అధికారంలోకి  వచ్చాక నవరత్నాలతో రాష్ట్రాన్ని బాగుపర్చే దిశగా అడుగులు
వేసే దానిపై పూర్తిగా అర్థమయ్యేలా చెప్పండి. ప్రతి ఒక్కరిలో నమ్మకం పెంచండి. రాష్ట్రంలోని ప్రతి ఇళ్లు వైయస్ఆర్ కుటుంబం దిశగా అడుగులు వేయాలి. కుటుంబంలో ఒకరితో ఈ టెలిఫోన్ నెంబర్(9121091210) కు మిస్డ్ కాల్ ఇప్పించాలి. రాష్ట్రవ్యాప్తంగా ఒకటే నంబర్ ఉంటుంది. ఒక్కసారి మిస్ట్ కాల్ ఇస్తే మన ఆఫీసుకు ఫోన్ వస్తుంది. కేవలం రెండు మూడు రోజుల్లోనే వైయస్సార్సీపీ ఆఫీసు నుంచే మిస్డ్ కాల్ వచ్చిన కుటుంబానికి ఫోన్ పోతుంది. మనవాళ్లు వాళ్లతో మాట్లాడి డిటైల్స్ తీసుకుంటారు. ఆ కుటుంబానికి రేషన్, పెన్షన్, ఇళ్లు ఏవి లేకపోయినా, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయంబర్స్ మెంట్ లాంటి ఎలాంటి సమస్యలు ఉన్నా మనం అధికారంలోకి వచ్చాక యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామని మాట ఇస్తున్నా.  

రాబోయే రోజుల్లో మనం విప్లవాత్మక మార్పు చేయబోతున్నాం. బాబు పాలనకు భిన్నంగా ప్రతి గ్రామంలో గ్రామ సెక్రటేరియట్ తీసుకొస్తాం. ప్రజలకు పెన్షన్, రేషన్, ఇళ్లు, ఫీజు రీయంబ మెంట్, ఆరోగ్యశ్రీ లాంటి ఎలాంటి ఇబ్బందులున్నా ఎవరూ ఎమ్మెల్యేలు,మంత్రుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. అందరికీ గ్రామ సెక్రటేరియట్ తోడుగా ఉంటుంది. అదే గ్రామంలోని ప్రతి సామాజిక వర్గం నుంచి చదువుకున్న వారికి పదిమందికి ఉద్యోగాలిస్తాం. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం మన కుటుంబసభ్యులయ్యాక మనం అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలు పరిష్కారం అవుతాయని హామీ ఇస్తున్నాం. ప్రతి కుటుంబం నుంచి మిస్డ్ కాల్ రావాలి. రాష్ట్రం మొత్తం వైయస్ఆర్ కుటుంబ సభ్యత్వం తీసుకున్నాక అందరికీ మేలు జరుగుతుంది.  పులివెందుల నుంచే నేను ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేస్తున్నా. చంద్రబాబుకు మనం చేసే ఈ కార్యక్రమంతో  దిమ్మతిరగాలి. ఎన్నికల్లో రూ. 200కోట్లు ఖర్చు చేసి రెండు, మూడు సార్లు 6వేలు చొప్పున డబ్బులిచ్చి, పోలీసులను ఇష్టానుసారం వాడుకొని, ఓటేయకపోతే మీ పెన్షన్లు , రేషన్ కట్ చేస్తామని బై ఎలక్షన్లో గెలిచి చంద్రబాబు విర్రవీగుతున్నాడు. ఏ నిరుద్యోగి, రైతులు,  డ్వాక్రా అక్కచెల్లెమ్మలు బాబుకు ఓటు వేయలేదు. ఏ ఉద్యోగం ఇవ్వకపోయినా, నెలకు రూ. 2వేలు భృతి ఇవ్వకపోయినా, రుణాలు మాఫీ చేయకపోయినా...అధికారంలో ఉన్నాడు కాబట్టి ఆయనకు ఓటు వేసినా, వేయకపోయినా సంవత్సరం ఉంటాడన్న ఉద్దేశ్యంతో ఓటేశారు.  ఓటేయకపోతే పథకాలు కట్ అవుతాయన్న భయంతో బాబు ఇచ్చిన డబ్బులు తీసుకొని ఓటేశారు. 

ఎవరి దగ్గరకెళ్లి మైకు పట్టుకున్నా నాన్న గారి హయాంలో మీకు మంచి జరిగిందా అని అడిగితే  ప్రతి చేయి పైకి లేస్తుంది. మంచి జరిగిందని చెబుతారు. నాన్న గారి హయాంలో ఎమ్మెల్యేలు, ఎంపిటీసీలు, సర్పంచ్ లు ఎవరైనా ఊళ్లోకి గర్వంగా పోయేవారు. చెప్పగానే పలనా చేశారని గర్వంగా చెప్పే పరిస్థితి ఉండేది.  పెన్షన్ లు, రేషన్లు, ఇళ్లు, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయంబర్స్ మెంట్ సహా ఏ పథకమైనా గ్రామాల్లో  లేని వారెవరైనా ఉన్నారంటే ప్రతి ఒక్కరికి వచ్చేలా చేశారు. ఏ పేదవాడు  అప్పులపాలయ్యే పరిస్థితి లేకుండా మేలు జరిగిన కాలమేదైనా ఉందంటే అది వైయస్ఆర్ సువర్ణయుగంలో అని గర్వంగా చెప్పవచ్చు. రాజన్న రాజ్యమని ఇంకా సగర్వంగా చెప్పుకుంటాం. ఇవాళ బాబు హయాంలో మనకు కనిపిస్తున్నదేమిటి. ఎన్నికలప్పుడు ఇచ్చిన మాటలేమిటి. ప్రతి పేదవాడికి ఇళ్లు, 3 సెంట్ల స్థలం అన్నడు. ఒక్క ఇళ్లైనా కట్టించాడా అని అడుగుతున్నా. మోసం చేశాడు. ఎన్నికలప్పుడు బాబు నోట్లోంచి వచ్చిన మాటేమిటి...? జాబు కావాలంటే బాబు రావాలన్నడు. జాబు ఇవ్వకపోతే ఇంటింటికీ రూ.2వేలు నిరుద్యోగ భృతి అన్నడు. 40నెలల కాలంలో బాబు ప్రతి ఇంటికీ రూ. 80వేలు బాకీ పడ్డాడు. మూడున్నరేళ్లలో ఒక్క రూపాయైనా మనకొచ్చిందా..? మోసం చేశాడు. 

బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటింకి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. రూ. 87, 612కోట్ల రుణాలు బేషరతుగా మాఫీ చేస్తానన్నాడు. మూడున్నరేళ్ల తర్వాత అడుగుతున్నా. బ్యాకుల్లో బంగారం ఇంటికొచ్చిందా..? రూపాయైనా మాఫీ అయిందా...? బాబు ఇచ్చింది వడ్డీలకు కూడ సరిపోని పరిస్థితి.  డ్వాక్రా రుణాలు మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నడు. డ్వాక్రా అక్కచెల్లెమ్మలను అడుగుతున్నా...? రూపాయైనా మాఫీ అయిందా అని అడుగుతున్నా..? పేదవాళ్లను, ఆడవాళ్లను, రైతులను, చివరకు పిల్లలను కూడ వదిలిపెట్టలేదు.  ఎన్నికలప్పుడు ఇచ్చిన ఏ వాగ్ధానాన్ని బాబు నెరవేర్చని పరిస్థితి. సూటిగా ఒకటే అడుగుతున్నా.   మాట ఇస్తే మడమ తిప్పని నాయకుడు కావాల్నా...బాబులా జీవితంలో ఎప్పుడూ నిజం చెప్పని మనిషి కావాలా..?  బాబు లాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉన్నంతకాలం విశ్వసనీయతకు అర్థం పోతుంది. ఎన్నికలప్పుడు మాటలు చెప్పి మోసం చేసిన బాబును కాలర్ పట్టుకొని నిలదీసినప్పుడే వ్యవస్థ మారుతుంది. అది జరగాలంటే గ్రామ గ్రామంలో తిరగాలి. ప్రతి ఇంటికి మనం పోయి చంద్రబాబు చేసిన అన్యాయాలను, మోసాలను విపులంగా చెప్పాలి. రాజన్న హయాంలో జరిగిన మంచిని కూడ చెప్పాలి. నవరత్నాలతో  రాజన్న రాజ్యానికి బీజం పడుతుంది. ప్రతి కుటుంబాన్ని వైయస్ఆర్ కుటుంబసభ్యునిగా మార్చాలి. మీ మీద ఆ బాధ్యతను పెడుతున్నా. అక్టోబర్ 2 దాకా ప్రతి  బూతు సభ్యుడు ప్రతి ఇంటికి వెళ్లాలి. అక్టోబర్ 27 నుంచి మన పాదయాత్ర 6 నెలలపాటు కొనసాగుతుంది. పాదయాత్ర అయిపోయే లోపు బాబు పాలన అంతం కూడ అవుతుంది. బాబు అన్యాయమైన పాలనకు తుదిగడియలు సమీపించేలా చేయేలంటే నా ఒక్కడితో సాధ్యం కాదు. జగన్ కు మీ అందరి తోడు కావాలి. రాష్ట్రంలోని ప్రతి వైయస్సార్సీపీ కార్యకర్త ఈ బాధ్యతను తీసుకొని వైయస్ఆర్ సువర్ణయుగాన్ని తెచ్చుకోవాలి. మోసం చేస్తున్న బాబు పాలనను బంగాళాఖాతంలో కలపాలి. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆశిస్తున్నా.

Back to Top