సమర దీక్ష చేపట్టిన వైఎస్ జగన్

మంగళగిరి: అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అయినా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసపుచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరిని ఎండగడుతూ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమర దీక్షకు దిగారు. గుంటూరు జిల్లా మంగళగిరి 'వై' జంక్షన్ సమీపంలో ఆయన బుధవారం దీక్ష చేపట్టారు. ముందుగా వైఎస్ జగన్ దీక్షా శిబిరం వద్ద ఏర్పాటు చేసిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన దీక్షకు కూర్చున్నారు. వైఎస్ జగన్ తో పాటు వేదికపై పార్టీ ఎమ్మెల్యేలు కూడా దీక్షలో పాల్గొన్నారు.

చంద్రబాబు మోసాలపై ప్రజల్లో ఎండగట్టడంతో పాటు ఇచ్చిన హామీలను అమలు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే లక్ష్యంతో వైఎస్ జగన్ ఈ దీక్ష చేపట్టారు. ప్రధానంగా వ్యవసాయ రుణాల మాఫీ, డ్వాక్రా మహిళల రుణాలను మాఫీ చేస్తామన్న హామీ నిలబెట్టుకోకపోవడం, ఇంటింటికీ ఉద్యోగం విషయంలో అశ్రద్ధ, ఏపీకి ప్రత్యేక హోదా సాధనలో విఫలం కావడం తదితర అంశాలపై ఈ వేదిక ద్వారా సర్కారుపై ఆయన  సమర శంఖం పూరించారు. రెండు రోజుల పాటు ఈ దీక్ష కొనసాగనుంది.  వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, ప్రజలు తరలి వస్తున్నారు. మరోవైపు వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా పార్టీ నాయకులు ఏర్పాట్లు చేశారు.
Back to Top