మీ తోడు కావాలి– రాష్ట్రంలో అంతటా అవినీతే
– రైతులకు అండగా ఉంటా
– పగటి పూట 9 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తాం.
– ప్రతి ఏటా పెట్టుబడుల కోసం రూ.12,500 ఇస్తాం
– రైతులకు వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తాం
– రూ. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి
– రూ. 4 వేల కోట్లతో ప్రకృతి వైఫరిత్యాల నిధి
– ప్రతి మండలంలో కోల్డు స్టోరేజ్, గిడ్డంగులు 
– రాయలసీమను సస్యశ్యామలం చేస్తాం

అనంతపురం: చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో విశ్వసనీయత అనే పదానికి అర్థం రావాలని, అందుకు మీ అందరి తోడు తనకు కావాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కోరారు. నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో అబద్ధాలు, మోసాలను చూశామని, చంద్రబాబు లాంటి మోసం చేసే వ్యక్తి మళ్లీ మనకు కావాలా అని ఆయన ప్రశ్నించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా బుధవారం శింగనమల నియోజకవర్గంలోని తరిమెల గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అశేష జనవాణిని ఉద్దేశించి వైయస్‌ జగన్‌ ప్రసంగించారు. ఆయన ఏమన్నారంటే.. తరిమెల గ్రామానికి పాదయాత్ర కార్యక్రమాన్ని రప్పించేందుకు మీరంతా రోడ్డు వేసి నాకు స్వాగతం పలకడం, నాపట్ల మీరు చూపిన ప్రేమను నా గుండెల్లో పెట్టుకుంటానని చెబుతున్నాను. చెరగని చిరునవ్వుతో ఇంతటి ఆప్యాయతలు చూపిన ప్రతి ఒక్కరికి హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు.

తరిమెల నాగిరెడ్డి పేరు ఇప్పటికీ మరిచిపోలేం
కమ్యూనిస్టు నాయకుడు తరిమెల నాగిరెడ్డి పేరు ఇప్పటికీ మరిచిపోలేం. ఈ గ్రామం రాజకీయంగా ఎంతో చైతన్యవంతమైంది. ఈ గ్రామం గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈ గ్రామం నుంచి పెద్ద పెద్ద నాయకులు వచ్చారు. తరిమెల నాగిరెడ్డి గురించి ఇవాల్టికి కూడా మరిచిపోలేం. ఇవాళ చంద్రబాబు పాలనను నాగిరెడ్డి చూసి ఉంటే తాను ఏం చేసి ఉండేవారో అనిపిస్తుంది. రాజకీయాల్లో విశ్వసనీయత అన్న పదానికి అర్థం లేకుండా పోయింది. 

ఎన్నికల సమయంలో హామీలు..సీఎం కాగానే మోసం
నాలుగేళ్ల టీడీపీ పాలనలో ఇసుక నుంచి మొదలు మట్టి, బొగ్గు, మద్యం, రాజధాని భూములు, కాంట్రాక్టులు, చివరకు గుడి భూములు కూడా వదిలిపెట్టడం లేదు. రాష్ట్రంలో న్యాయం లేదు..ధర్మం లేదు. జన్మభూమి కమిటీల పేరుతో గ్రామస్థాయిలోS మాఫియాను తయారు చేశారు. పింఛన్లు, మరుగుదొడ్డు కావాలన్నా లంచాలు ఇవ్వాల్సి వస్తోంది. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఎన్నో హామీలు ఇచ్చారు. ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. నాలుగేళ్లలో అబద్ధాలు, మోసాలు చూశాం. ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తామన్నాడు. ఒక్క ఇల్లైనా కట్టించాడా?. విఫరీతంగా కరెంటు బిల్లులు పెంచారు. నాలుగేళ్ల క్రితం బియ్యంతో పాటు 9 రకాల సరుకులు దొరికేవి. ఇప్పుడు బియ్యం తప్ప ఏమీ ఇవ్వడం లేదు. జాబు కావాలంటే బాబు కావాలని హామీ ఇచ్చారని, ఉద్యోగం ఇవ్వకుంటే ప్రతి ఇంటికి రూ. 2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని మాట ఇచ్చి మోసం చేశాడు. ప్రతి ఇంటికి రూ. 90 వేలు బాకీ పడ్డాడు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. అక్షరాల రూ.87 వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తానన్నాడు. బాబు చేసిన రుణమాఫీ వడ్డీలకు కూడా సరిపోవడం లేదు. ఒక్కసారి మన మనసాక్షిని అడుగుదాం. మనకు మరో ఏడాదిలో ఎన్నికలు జరుగబోతున్నాయి. మనకు ఎలాంటి నాయకుడు కావాలని మీ అందరిని అడుగుతున్నాను. మోసం చేసేవాడు, అబద్ధాలు చెప్పేవాడు నాయకుడు కావాలా? చంద్రబాబు లాంటి వ్యక్తి కావాలా అని అడుగుతున్నాను. ఇలాంటి వ్యక్తిని మనం క్షమిస్తే రేపొద్దున ఏ స్థాయికి దిగజారిపోతారో తెలుసా. రేపు పెద్ద పెద్ద హామీలు ఇస్తారు. ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తానంటారు. ఇంతటితో ఆగిపోడు ప్రతి  ఇంటికి మారుతి కారు కొనిస్తాని అంటారు. ఇలాంటి వ్యక్తులు ఈ రాజకీయ వ్యవస్థ నుంచి వెళ్లిపోవాలి. రాజకీయాల్లో విశ్వసనీయత అనే పదానికి అర్థం రావాలి. రాజకీయ వ్యవస్థ బాగుపడాలంటే దానికి మీ  అందరి తోడు కావాలి.

ఇష్టం వచ్చినట్లు నీరు తీసుకెళ్తున్నారు
శింగనమల నియోజకవర్గంలో సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయి. టీడీపీ నాయకులు ఇష్టం వచ్చినట్లు నీరు తీసుకెళ్లి తమ చెరువులు నింపుకుంటున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనలో ఇదే హెచ్‌ఎస్‌ఎల్‌సీలో నీరు ఎలా పారేవో మీరే ఆలోచన చేయండి. టీడీపీ అధికారంలోకి వచ్చాక నీరు అందడం లేదు. ఈ పాలనలో నీళ్లు ఇచ్చేటప్పుడు ఒక ప్రణాళిక లేదు. శ్రీశైలం, తుంగభద్రలో నీరున్నా.. మనకు ఇవ్వడం లేదు. సాగునీరు అందించేందుకు నికర జలాల రిజర్వాయర్‌ ఉన్నా కూడా మనమంతా కూడా ఇబ్బందులు పడుతున్నాం. ఇదే శింగనమల నియోజకవర్గంలో వచ్చేటప్పుడు పంటలు చూశాను. పత్తి, వేరుశనగ, కంది పంటలు ఎండిపోతున్నాయి. ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. ఒకవైపు చంద్రబాబు మోసం..మరో వైపు ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. ఇంతటి దారుణంగా ఇవాళ పాలన సాగుతోంది. ప్రతి రైతుకు తోడుగా నిలిచేందుకు ఇవాళ పాదయాత్ర చేస్తున్నాను. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు అండగా నిలిచేందుకు, చదువుకుంటున్న పిల్లలకు ధైర్యం చెప్పేందుకు పాదయాత్ర చేస్తున్నాను, నిరుద్యోగులకు భరోసా ఇచ్చేందుకు ఇవాళ 3 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసేందుకు బయలుదేరాను. దారిపొడవునా మీ సలహాలు, సూచనలు కోరుతున్నాను.

సలహాలు ఇవ్వండి
మనం అధికారంలోకి వచ్చిన తరువాత మనం ఏం చేస్తున్నామని చెప్పడానికి నవరత్నాలు ప్రకటించాం. కొన్ని నవరత్నాలు మీ అందరికి వివరిస్తున్నాను. అందులో మార్పులు, చేర్పులు చేయాల్సి వస్తే మీరే సలహాలు, సూచనలు ఇవ్వండి దారి పొడువునా వింటున్నాను.

రైతన్న తోడుగా ఉంటా 
రాష్ట్రంలో రైతులు పరిస్థితి దారుణంగా ఉంది. రైతులను బాగుపరచాలంటే నాలుగు రకాల సమస్యలు ఉన్నాయి. ఉత్పత్తి వ్యయం తగ్గించాలి. ఇందుకోసం మన పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతి రైతుకు 9 గంటల పాటు పగటి పూట ఉచిత విద్యుత్‌ ఇస్తాం. పంటలు వేసుకునేందుకు ఒక నెల ముందు ప్రతి ఏటా మే నెలలో ప్రతి రైతుకు రూ.12,500 పెట్టుబడి కింద అందజేస్తాం. రైతులకు సున్నా వడ్డీ రుణాలు అందడం లేదు.  ప్రతి రైతుకు వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తాం. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర దొరకడం లేదు. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తున్నాను. ప్రభుత్వమే పంటలు కొనుగోలు చేస్తుంది. ఇవాళ చంద్రబాబే ఒక దళారీ అవతారం ఎత్తారు. ఆయనకు కూడా హెరిటేజ్‌ షాపు ఉంది. రైతుల వద్ద నుంచి వారు తక్కువ ధరలకు కొనుగోలు చేసి, వాటికి ఫ్యాకింగ్‌ చేసి ఎక్కువ ధరలకు హెరిటేజ్‌లో అమ్ముతున్నారు. కరువు, అకాల వర్షాల సమయంలో రైతులను ఆదుకునేందుకు ఇవాళ ఇన్‌పుట్‌ సబ్సిడీ రావడం లేదు. ఇలాంటి పరిస్థితులను మారుస్తాం. ప్రకృతి వైఫరీత్యాల ఫండ్‌ కింద రూ. 4 వేల కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తామని మాట ఇస్తున్నాను. పెండింగ్‌లో ఉన్న ప్రతి ప్రాజెక్టును పూర్తి చేస్తాం, పోతిరెడ్డిపాడు నుంచి నీటిని తీసుకొచ్చి రాయలసీమను సస్యశ్యామలంగా తీర్చిదిద్దుతా. ప్రతి మండలంలోనూ కోల్డు స్టోరేజ్, గిడ్డంగులు తీసుకువచ్చి రైతులకు తోడుగా నిలుస్తానని హామీ ఇస్తున్నాను.

 
Back to Top