ఆరు నెలల ముందు గుర్తొచ్చాయా బాబూ?– బాబు వస్తే నీరు లేదు..గిట్టుబాటు ధరల్లేవు.. రుణాలు లేవు..రాయితీ లేదు
– బాబు వస్తే వ్యవసాయం దండగా అంటున్నారు
– కోనసీమలో కూడా రబీలో సాగునీరు అందడం లేదు
– కోనసీమ నుంచి వలసలు మొదలయ్యాయి
– చంద్రబాబు ముఖ్యమంత్రిగా కొనసాగడానికి అర్హుడా?
– 108 ఉద్యోగులకు రెండు నెలలుగా జీతాలు లేవు
– బాబు హయాంలో అంబులెన్సులు కరువు
– నాలుగేళ్ల పాలనలో దోపిడీ, అరాచకం, అవినీతి, అన్యాయం, మోసం
– ప్రజలను మోసం చేయడంలో బాబు పీహెచ్‌డీ చేవారు
– నిరుద్యోగ భృతి ఏమైంది బాబు అని నిలదీయండి
– ముద్రగడను , ఆయన కుటుంబాన్ని బాబు అవమానించారు
– మేనిఫెస్టోలో పెట్టింది కాపులు అడిగితే అవమానించారు
– మంజునాథ్‌ కమిషన్‌ రాకముందే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు
– బోయలను, మత్స్యకారులను బాబు మోసం చేశారు. 
– తాను చేసిన తప్పును కేంద్రంపై నెట్టారు.
–అక్కచెల్లెమ్మలకు వడ్డీ లేని రుణాలు అందిస్తాం
– ఇళ్లను మహిళల పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేయించి ఇస్తాం

తూర్పు గోదావరి: చంద్రబాబు నాలుగేళ్ల పాలనపై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నాయకులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికలకు ఆరు నెలల ముందు ఆయనకు అన్నీ గుర్తుకు వస్తున్నాయని మండిపడ్డారు. బాబు నాలుగేళ్ల పాలనలో దోపిడీ, అవినీతి, అక్రమాలు, అబద్ధాలు, మోసాలు అనే పథకాలతో పాలన సాగించారని ఎద్దేవా చేశారు.  ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా రాజోలు పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ ప్రసంగించారు. 

– ఈ రోజు దాదాపుగా 40 డిగ్రీల సెంటిగ్రేడ్‌ ఎండలు ఉన్నా కూడా..నాతో పాటు వేలాది మంది అడుగులో అడుగులు వేశారు. ఒకవైపు బాధలు చెబుతూ..అర్జీలు ఇస్తూ..మరోవైపు నా భుజాన్ని తడుతూ అన్నా మేమంతా నీకు తోడుగా ఉన్నామని అడుగులో అడుగులువేశారు. ఏ ఒక్కరికి ఈ ఎండలో నాతో పాటు నడవాల్సిన అవసరం ఏ ఒక్కరికి లేదు. ఈ దుమ్ములో, రోడ్డుపై నిలవాల్సిన అవసరం ఏ ఒక్కరికి లేదు. అయినా కూడా ఇవేవి కూడా లెక్క చేయకుండా చిక్కటి చిరునవ్వులతో ఆప్యాయతలు చూపుతున్నారు. ప్రేమానురాగాలు చూపుతున్నారు. మీ అందరి ప్రేమానురాగాలకు, ఆత్మీయతలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు.
– కోనసీమ అంటే బయట ప్రపంచానికి చాలా సంపదలు ఉన్న ప్రాంతంగా కనిపిస్తోంది. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే వాస్తవాలు వేరేలా ఉన్నాయి. ఈ నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో ఏ ఒక్కరూ కూడా సంతోషంగా లేరు. రబీ సీజన్‌లో సాగునీరు అందడం లేదు. కొబ్బరికి రేట్‌ లేదు. పరిశ్రమలు లేవు. కనీసం తాగేందుకు కూడా నీరు లేని దుస్థితి నెలకొంది. బతకడానికి జిల్లా కాదు..ఏకంగా దేశం వదలి గల్ఫ్‌ దేశానికి వెళ్తున్నారు. ఇక్కడి ప్రజలు అంటున్నారు..అన్నా..బాబు వస్తే మాకు తాగేందుకు నీరు రాదనన్నా..మా పంటలకు రేట్లు ఉండవు అంటున్నారు. అన్నా..బాబు వస్తే రుణాలు రావన్నా..ఆయన వస్తే కనీసం రుణాలపై వడ్డీ రాయితీ కూడా రావడం లేదన్నా..బాబు వస్తే వ్యవసాయం దండగగా మారుతుందన్నా..రైతు గుళ్ల అవుతున్నాడన్నా అంటున్నారు.
– రాజోలు నియోజకవర్గంలో 30 వేల ఆయకట్టు భూములకు నీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే నాథుడు లేడు. సాగునీరు సరిగా అందక వ్యవసాయం చేయడమే కష్టంగా మారిందని అంటున్నారు. ఏదోరకంగా ఆ రైతు పంటను కాపాడుకుని పంటను మార్కెట్‌కు తీసుకొస్తే ..రేట్లు లేవు. వరి రూ.1130 కొనే నాథుడు లేడు. కొనుగోలు కేంద్రాలను హాస్యాస్పదంగా మార్చారు. ధాన్యం పూర్తిగా వ్యాపారుల చేతికి వెళ్లాక కొనుగోలు కేంద్రాలు తెరుస్తున్నారు. టీడీపీ నాయకులకు మాత్రమే రేట్‌ వచ్చేలా చేస్తున్నారు. చివరికి కొబ్బరి పరిస్థితి చూస్తే ..అన్నా..చంద్రబాబు సీఎం అయ్యాక మా ఖర్మ చూడండన్నా..కొబ్బరి రేటు సగానికి పడిపోయిందని చెబుతున్నారు. ఇవాళ పరిస్థితి ఒక్కసారి చూడండి అన్నా..వెయ్యి కొబ్బరి కాయలకు గతంలో రూ.14500 ఉంటే, ఈ ఏడాది రూ.9 వేలకు కూడా కొనడం లేదని చెబుతున్నారు. కొబ్బరిపై ఆధారపడ్డ కూలీల పరిస్థితి దారుణంగా మారింది. అర్ధరూపాయి రేటుతో గిట్టుబాటు కాక కూలీలు వలసలు వెళ్తున్నారు. తీరా పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే మరో పక్కా జీఎస్‌టీ రూపంలో 5 శాతం ట్యాక్స్‌ వేశారు. దాన్ని తీసేయమని చంద్రబాబు కేంద్రాన్ని అడగడానికి మనసు రాదు. 
– ఆరోజుల్లో నాన్నగారి పాలనను ఇక్కడి ప్రజలు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. వైయస్‌ రాజశేఖరరెడ్డి హాయంలో కొబ్బరిపై ఉన్న 4 శాతం పన్నును రద్దు చేశారని గుర్తుకు తెచ్చుకుంటున్నారు.
– దారిలో తమలపాకుల రైతుల పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉంది. తమలపాకుల రేట్లు దారుణంగా తగ్గిపోయింది. మరోవైపు కమీషన్ల పేరుతో దళారులు దోచుకుంటున్నారు. ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి ఎక్కడా లేదు.
– అన్నా..ఇదే నియోజకవర్గంలో దాదాపుగా 10 వేల ఎకరాల్లో రొయ్యల సాగు చేస్తున్నారు. చంద్రబాబు పరిపాలన పుణ్యమా అని పంటలకే కాదు..నీళ్లలోని చేపలు, రొయ్యలకు కూడా రేట్లు లేవని వాపోతున్నారు. ప్రజా సంకల్ప యాత్రలో నేను పాదయాత్ర చేస్తూ రైతుల బాధలు చూసి రొయ్యల రైతులకు రూపాయినరకే కరెంటు ఇస్తానని ప్రకటిస్తే..జగన్‌ చెప్పేంత వరకు చంద్రబాబుకు ఈ రైతులు గుర్తుకు రారు.
– సరుగుడు రైతుల పరిస్థితి అలాగే ఉంది. రూ.12 వేలు ఉన్న టన్ను సరుగుడు..ఇవాళ రూ.8 వేలు కూడా లేదని చెబుతున్నారు. నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో ఒక్క పంటకైనా గిట్టుబాటు ధర వచ్చిందా? అని అడుగుతున్నాను. గిట్టుబాటు ధరలు రాకపోవడానికి దళారీలకు చంద్రబాబే నాయకుడిగా ఉండటమే. హేరిటేజ్‌ కంపెనీ రైతుల నుంచి తక్కువ ధరలకు కొనుగోలు చేసి వాటిని ప్యాక్‌ చేసి రైతుల కంటే మూడు రేట్లకు ఎక్కువగా రైతులకే అమ్ముతున్నారు. ఏ పంటకు కూడా రేట్‌ రాకుండా చేస్తున్నారు.
– ఈ ప్రాంతం నుంచి ౖచూస్తే పి.గన్నవరం, అమలాపురం నియోజకవర్గాల నుంచి దాదాపు 40 వేల మంది గల్ఫ్‌ దేశాలకు వలస వెళ్లారు. వీరి గురించి ప్రభుత్వం పట్టించుకోలేదు. గల్ఫ్‌ దేశాల్లో వారు పడుతున్న బాధలు నాతో పంచుకుంటున్నారు. సురేష్‌ గౌడు అనే వ్యక్తి వచ్చి అన్నా..నేను గల్ఫ్‌ నుంచి ఎలా వచ్చానో తెలియదన్నా అని చెప్పారు. మా ఎంపీ విజయసాయిరెడ్డికి ఆదేశించడంతో గల్ఫ్‌ దేశాల్లో ఉన్న ఈ ప్రాంతం ప్రజల గురించి వాకాబు చేశారు. ఇక్కడి నుంచి గల్ప్‌ దేశాలకు తీసుకెళ్తున్న ఏజెన్సీలను ఏ నాడు ప్రశ్నించడం లేదు. ఇటువంటి పరిస్థితిని కట్టడి చేయాల్సిన చంద్రబాబు పూర్తిగా గాలికి వదిలేశారు
– రాజోలు ప్రాంతంలో తాగడానికి నీరు లేదు. బోర్లు వేస్తే ఉప్పునీరు. ఆయిల్‌ కంపెనీల కారణంగా కలుషిత నీరు వస్తోంది. మహానేత ఏర్పాటు చేసిన మంచినీటి పథకాలను సక్రమంగా నిర్వహించడం లేదు. గుడిమల్కాపురం నుంచి పైప్‌లైన్‌ వేసి మంచినీటిని సరఫరా చేసేవారు. మహానేత చనిపోయిన తరువాత మంచినీటిని కూడా ఇవ్వలేని దుస్థితి నెలకొంది. వైయస్‌ఆర్‌ హయాంలో రామేశ్వరం, అంతర్వేది పాలెంలో తాగునీటి పథకాలు ఏర్పాటు చేసి దాహర్తి తీర్చారు. ఈ పథకాలను కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రాజోలులోని నీటి శుద్ధి కార్యక్రమాన్ని అసలు పట్టించుకోవడం లేదు. చంద్రబాబు మాత్రం రూ.2 లీటర్‌ మంచినీళ్లు అని గొప్పలు చప్పారు. ఎక్కడైనా ఇచ్చాడా అని అడుగుతున్నాను. తాగునీటిని కొని తాగుతున్నారు.
– వశష్ట గోదావరిపై సఖినేనిపల్లి బ్రిడ్జి కట్టిస్తానని చంద్రబాబు ఎన్నోమార్లు హామీ ఇచ్చారు. రెండేళ్ల క్రితమే ఈ బ్రిడ్జి పనులు ప్రారంభమయ్యాయని టీడీపీ నాయకులు స్వీట్లు పంచుకున్నారు. ఎక్కడైనా కనిపించిందా? రాజోలులో 50 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తామన్నారు. ఈ ఆసుపత్రిలో కనీసం గైనకాలజిస్టు లేరు. జనరల్‌ సర్జరీ డాక్టర్లు లేని పరిస్థితితో ఇవాళ రాజోలు నగరం ఉంది. 
– ఈ రోజు నా వద్దకు 108 ఉద్యోగులు వచ్చారు. అన్నా..నాన్నగారి హయాంలో మండలానికి ఒక అంబులెన్స్‌ ఉండేది. ఇ వాళ నియోజకవర్గంలో ఒక్క అంబులెన్స్‌ కూడా కష్టమే అంటున్నారు. రాజోలులో ఉన్న ఒకే ఒక అంబులెన్స్‌ ఇవాళ షెడ్యుల్‌లో ఉంది. జీతాల మోహం చూసి రెండు నెలలు అవుతుందని సిబ్బంది అంటున్నారు. రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో ఈ పరిస్థితి చూస్తే తెలుస్తోంది.
– చంద్రబాబు మాత్రం ఏమంటారు? 2029కి దేశంలోనే ఏపీ నంబర్‌ అంటారు. 2050కి ప్రపంచంలోనే నంబర్‌ వన్‌ చేస్తామంటారు. ఆయనను ఇంకా ఆయన పరిపాలన చూసి భరించగలమా? చంద్రబాబును చూస్తే ఒక చిన్న కథ గుర్తుక వస్తుంది. ఆ కథేంటంటే..
– అనగనగా చంద్రబాబు లాంటి ఓ స్టూడెంట్‌ ఉండేవారు. ఆయన పరీక్ష రాయడానికి వెళ్లాడు. పరీక్ష ప్రారంభమై రెండు గంటలు అయిపోయింది. రెండున్నర సమయం అయిపోయిన తరువాత అప్పుడు ఈ స్టూడెంట్‌ లేచి మాస్టర్‌ వద్దకు వెళ్లి ..మాస్టర్‌ మాస్టర్‌ నాకు మరో మూడు గంటల సమయం కావాలని అడిగారట. ఇదేంటయ్య బాబూ..రెండున్నర గంటలు ఏం చేశావని మాస్టర్‌ అడిగారట. ఇవాళ మాస్టర్‌ లాంటి ప్రజలు చంద్రబాబును నాలుగేళ్లలో ఏం చేశారని ప్రశ్నిస్తే..ఆయన మాత్రం నాకు ఇంకా కొంత టైం ఇస్తే వందకు వంద మార్కులు తెచ్చుకుంటానని చంద్రబాబు లాంటి స్టూడెంట్‌ మాస్టర్‌కు చెప్పాడట. మరో ఆరు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ నాలుగేళ్లలో చంద్రబాబు దోపిడీ, అరాచకాలు, అక్రమాలు, అవినీతి, అన్యాయం..ఈ ఐదు స్కీమ్‌లు చేసి..మరోసారి అవకాశం ఇస్తే ప్రపంచంలోనే నంబర్‌ వన్‌గా చేస్తానని చెబుతున్నారు. ఇటువంటి పరిస్థితిలో చంద్రబాబు పాలనకు సంబంధించి ఒక్కసారి ఆలోచన చేయండి.
– మొట్టమొదటి సంతకం రైతుల రుణాలన్నీ మాఫీ అన్నారు. రుణాల మాఫీ కథ దేవుడెరుగు..వ్యవసాయం మాఫీ అయ్యింది. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. బ్యాంకుల నుంచి బంగారం ఇంటికి రావడం లేదు..నేరుగా నోటీసులు వస్తున్నాయి. ఇవాళ రైతులకు వడ్డీలకు కూడా రుణమాఫీ సరిపోవడం లేదు. రైతులు అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
– ఇంటికో ఉద్యోగం, అది వచ్చే వరకు నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి అని చంద్రబాబు ఎన్నికల ముందు అన్నారు. ఇంటింటికి మనిషిని పంపించి లేఖలు పంపించారు. మళ్లీ ప్రజలను మోసం చేయడానికి ఆరు నెలల్లో ఎన్నికలు రాబోతుండగా అదిగో భృతి..ఇదిగో చేశా అని డ్రామాలు. 
– పొదుపు సంఘాలను నేనే కనిపెట్టానని చంద్రబాబు ఆ రోజు చెప్పారు. పొదుపు రుణాలు పూర్తిగా మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. ఒక్క రూపాయి అయినా మాఫీ అయ్యిందా? కాకపోగా బ్యాంకులోళ్లు నేరుగా ఇంటికి వస్తున్నారు. విఫరీతంగా టీవీ అడ్వర్‌టైజ్‌మెంట్లు ఇచ్చారు. ఆయనొస్తున్నారని ప్రచారం చేశారు. మంగళసూత్రం తెంచుకుపోతుంటే ఆయన వస్తున్నారని గొప్పలు చెప్పించారు. ఆయన వచ్చిన తరువాత ఎవరైనా బాగుపడ్డారా? ఇంత దారుణంగా అబద్ధాలు ఆడుతున్న ఈ పెద్ద మనిషి ఎవర్ని వదిలిపెట్టలేదు. ప్రతి కులానికి ఒక పేజీ పెట్టి ఏ రకంగా మోసం చేయగలమని పీహెచ్‌డీ చేసి మేనిఫెస్టో రూపొందించారు. ఈ రోజు ఆ మేనిఫెస్టో ఎక్కడ ఉందో కనిపించదు. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన వాగ్ధానం నెరవేర్చు అని కాపులు అడిగితే చంద్రబాబు ఏమంటారో తెలుసా? కాపులను ఆయన అవమానించారు. ముద్రగడ్డ పద్మనాభంను ఇంట్లో పెట్టి అదే పెద్దాయన కళ్లేదుటే ఆయన భార్య, కుటుంబ సభ్యులతో అమర్యాదగా ప్రవర్తించే కార్యక్రమాలు చేపట్టారు. కంచాలు మోగించినందుకు అందరిపై కేసులు పెట్టించారు. మోసం చేసే దాంటో ఒక అడుగు ముందుకు వేస్తూ..కాపుల కోసం మంజునాథన్‌ అనే కమీషన్‌ వేశారు. ఆ కమిషన్‌ రిపోర్టు రాకముందే అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి కేంద్రానికి నివేదిక పంపించి చేతులు దులుపుకున్నారు. బోయలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు మరో తీర్మానం చేసి వదిలేశారు. మత్స్యకారులను ఎస్సీలుగా చేర్చుతామని చెప్పారు. వారు వెళ్లి అడిగితే తాట తీస్తామని బెదిరించారు. నిన్న నాయీ బ్రాహ్మణులు టీడీపీ మేనిఫెస్టోలోని పేజీ నంబర్‌ 22లో మీరే చెప్పిన హామీని నెరవేర్చాలని అడిగితే వారిని అవమానించేలా మాట్లాడారు, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి తాట తీస్తానని బెదిరించారు. ఈ పెద్ద మనిషి మోసం చేయడమే కాకుండా తోక కత్తరిస్తానని హెచ్చరించారు. ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా అర్హుడా? 
– మోసం చేయడం పీహెచ్‌డీ చేసిన వ్యక్తి ఇవాళ అయ్యే పింఛన్లు రావడం లేదా అంటున్నారు. ఆరు నెలల్లో ఎన్నికలు వస్తున్నాయని అయ్యే..రేషన్‌కార్డు లేదా? ఆఫీసర్‌కు తోలు తీస్తానని హెచ్చరించారు. బియ్యం ఇవ్వడం లేదా అంటున్నారు. ఇల్లు లేవా అంటూ ఇళ్ల స్థలాలు ఇవ్వలేదా అంటున్నారు. అయ్యే ఆకలిగా ఉందా? అన్నా క్యాంటిన్లు ఏర్పాటు చేస్తా అంటారు. మంచినీరు అందడం లేదా..నాకు ఇప్పుడే తెలిసింది..అధికారులకు క్లాస్‌ పీకుతా అంటారు. ఆరు నెలల ముందు కరెంటు చార్జీలు తగ్గిస్తా అంటారు. విభజన హామీలు అమలు చేయడం లేదా అయితే కేంద్రం నుంచి వెనక్కి వస్తా అంటారు. పోలవరం  డయఫ్రం వాల్‌కు శంకుస్థాపన చేసి జాతికి అంకితం చేశారు. నరేంద్ర మోడీ అక్కడి కనిపిస్తే..ఇక్కడ వంగి దండాలు పెట్టారు. ఇట్లాంటి పాలన నాలుగేళ్లలో చూస్తున్నాం. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థలోకి విలువలు, విశ్వసనీయత అన్న పదాలకు అర్థం రావాలి. ఎవరైనా రాజకీయాల్లో హామీ ఇచ్చి నెరవేర్చకపోతే తన పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లాలి. ఈ వ్యవస్థలో మార్పు రావాలంటే వైయస్‌ జగన్‌కు మీ అందరి తోడు, దీవెనలు కావాలి. అప్పుడే ఈ వ్యవస్థలో విశ్వసనీయత, నిజాయితీ అన్న పదాలకు అర్థం వస్తుంది.
– పొరపాటున చంద్రబాబును క్షమిస్తే..రేపు పొద్దున ఎన్నికల సమయంలో మీ వద్దకు వచ్చి ఏం చేస్తారో తెలుసా? రేపు ఎన్నికల్లో ఈ సారి నాకు ఓటు వేయండి..ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తామంటారు. నమ్ముతారా? నమ్మరని ఆయనకు తెలుసు కాబట్టి..ప్రతి ఇంటికి బెంజి కారు అంటారు. నమ్మరని ఆయనకు తెలుసు..కాబట్టి ఏం చేస్తారో తెలుసా? ప్రతి ఇంటికి ఒక మనిషిని పంపిస్తారు. ఆ మనిషి మీ ఇంటికి వచ్చి ప్రతి చేతిలో రూ.3 వేలు డబ్బు పెడతారు. డబ్బు ఇస్తే మాత్రం వదనకండి. రూ.5 వేలు కావాలని గుంజండి. ఆ డబ్బంతా మనందే. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం మనసాక్షి ప్రకారం వేయండి. అబద్ధాలు చెప్పేవారిని, మోసం చేసేవారిని బంగాళఖాతంలో కలిపే పరిస్థితి రావాలి. అప్పుడే ఈ వ్యవస్థలో మార్పు వస్తుంది.
– రేపు పొద్దున ఈ ప్రభుత్వం పోయి..మనందరి ప్రభుత్వం వచ్చాక ఏం చేస్తామన్నది చెప్పేందుకు నవరత్నాలు ప్రకటించాం. ఈ పథకాల్లోని కొన్ని అంశాలనే ప్రతి మీటింగ్‌లో చెబుతున్నాను. ఈ రోజు అక్కచెల్లెమ్మల కోసం ఏం చేస్తామన్నది చెబుతాను.
– చంద్రబాబు పాలనలో అక్కచెల్లెమ్మల పరిస్థితి దాయణీయంగా ఉంది. బ్యాంకు గడప ఎక్కలేకపోతున్నారు. వడ్డీలపై వడ్డీలు చెల్లించలేక అవస్థలు పడుతున్నారు. ఇదే అక్కచెల్లెమ్మల పరిస్థితి ఆ దివంగత నేత వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనలో ఎలా ఉండేదో గుర్తుకు తెచ్చుకోండి. అక్కచెల్లెమ్మలు సంతోషంగా ఉంటే ఇళ్లంతా సంతోషంగా ఉంటుందని మహానేత అనేవారు. అక్కచెల్లెమ్మలు లక్షాధికారులు కావాలని, తమ కాళ్లపై తాము నిలబడే పరిస్థితి రావాలని, బ్యాంకుల నుంచి లక్షల్లో రుణాలు ఇచ్చినప్పుడు, ఆ రుణాలపై వడ్డీలు భారం కాకూడదని మహానేత భావించారు. చంద్రబాబు పొదుపు రుణాలు మాఫీ చేస్తామన్న మాట  అన్యాయమైతే..ఆయన చేసిన మరో మోసం ఏంటో తెలుసా? గత ప్రభుత్వాలు డ్వాక్రా రుణాలు, రైతుల రుణాలపై వడ్డీ డబ్బులు బ్యాంకులకు కట్టేవి. ఇవాళ చంద్రబాబు వడ్డీ డబ్బులు బ్యాంకులకు కట్టడం లేదు. 
– రేపు పొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతి అక్క చెల్లెమ్మకు చెబుతున్నాను. ఎన్నికల నాటికి ఎంతైతే బ్యాంకుల్లో అప్పు ఉంటుందో ఆ అప్పంతా నేరుగా అక్కచెల్లెమ్మలకే నాలుగు దఫాలుగా ఇస్తాం. అంతేకాకుండా అక్కచెల్లెమ్మలు లక్షాధికారులు అయ్యేవిధంగా వడ్డీ లేకుండా రుణాలు ఇప్పించే కార్యక్రమం చేస్తాం. వడ్డీ డబ్బులుప్రభుత్వమే బ్యాంకులకు చెల్లిస్తుందని మాట ఇస్తున్నాను. దీనివల్ల అక్కచెల్లెమ్మలకు ఊరట కలుగుతుంది.
– రెండో మంచి కార్యక్రమం ఏంటంటే..నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో ఒక్కసెంట్‌ స్థలం కూడా ఇవ్వలేదు. ఇల్లు కట్టించలేదు. ఆ రోజు దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనను గుర్తుకు తెచ్చుకోమని చెబుతున్నాను. నాన్నగారు రాష్ట్రంలో 48 లక్షల ఇల్లు కట్టి దేశంతో పోటీ పడ్డారు. ఇదే నియోజకవర్గంలో వైయస్‌ఆర్‌ 20 వేల ఇల్లు కట్టించారు. ఇల్లు లేని ప్రతి నిరుపేదకు చెబుతున్నాను. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పేదవాడి కోసం ఒక్క అడుగు ముందుకు వేస్తే..ఆయన కొడుకుగా రెండు అడుగులు ముందుకు వేస్తాను. ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తాను. ఆ ఇల్లు అక్క చెల్లెమ్మ పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయిస్తాను. ఆ ఇల్లు ఒక ఆస్తిగా వస్తుంది. ఎప్పుడైనా హఠాత్తుగా డబ్బుతో అవసరం పడినప్పుడు అక్కచెల్లెమ్మలు నేరుగా బ్యాంకు వెళ్లి రుణం తీసుకునేందుకు పావలా వడ్డీకే రుణం ఇప్పిస్తాం.
– మూడో కార్యక్రమం ఏంటంటే..చంద్రబాబు ఎన్నికలకు ముందు పిల్లలు తాగి చెడిపోతున్నారని చెప్పారు. అధికారంలోకి రాగానే బెల్టుషాపులు మూసేస్తా అన్నారు. నాలుగేళ్ల కాలంలో మందు షాపు లేని గ్రామం ఉందా ? . ఫోన్‌ కొడితే ఎవరూ మినరల్‌ వాటర్‌ తీసుకురావడం లేదు. కానీ మద్యం బాటిల్‌ తెస్తున్నారు. పిల్లలను చెడిపోయే పరిస్థితిలోకి చంద్రబాబు దగ్గరుండి చెడగొడుతున్నారు. రేపు పొద్దున దేవుడు ఆశీర్వదించి..మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మద్యాన్ని విడతల వారిగా నిషేదిస్తాం. మందు తాగాలంటే ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో వెళ్లి తాగేలా కఠినంగా చట్టం చేస్తాం. మళ్లీ ఐదేళ్ల తరువాత మద్యాన్ని తీసేసి మీ వద్దకు వస్తాను. ఇందులో ఎవరైనా సలహాలు, సూచనలు ఇవ్వాలనుకుంటే నేను ఎక్కడ ఉంటానో మీ అందరికి తెలుసు. ఈ చెడిపోయిన వ్యవస్థను మార్చేందుకు పాదయాత్రగా బయలుదేరిన మీ బిడ్డను ఆశీర్వదించమని పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెబుతూ సెలవు తీసుకుంటున్నా...
 
Back to Top