పసుపు కుంకుమ కాదు..ఉప్పుకారం పథకం

నంద్యాల: చంద్రబాబు డ్వాక్రా మహిళలను మోసం చేశారని వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు.. పసుపు కుంకుమ పేరుతో మహిళలన మోసం చేశారని ధ్వజమెత్తారు.2014 ఎన్నికలకు ముందు పొదుపు సంఘాల రుణాలు అన్ని కూడా మాఫీ చేస్తామన్నారు. అంతకుముందు సున్నా వడ్డీకే రుణాలు వచ్చేవి. ప్రభుత్వాలు బ్యాంకులకు వడ్డీలు కట్టేవి. చంద్రబాబు రుణాలు మాఫీ చేయలేదు. సున్నా వడ్డీలకు సంబంధించి బ్యాంకులకు డబ్బులు కట్టకుండా ఆ పథకానికి పేరు మార్చి పసుపు కుంకుమ అని పెట్టారు. బ్యాంకులు అధిక వడ్డీకి మహిళలకు రుణాలు ఇవ్వాలట. ఈ స్కీమ్‌ను పసుపు కుంకుమ స్కీమ్‌ అంటారా? ఉప్పు కారం స్కీమ్‌ అంటారా మీరే చెప్పండి. కుడిచేతితో ఇస్తూ..ఎడమ చేతితో లాక్కుంటున్నారు.

ట్రాక్టర్ల స్కీమ్‌లో బాబుకు కమీషన్లు
ట్రాక్టర్ల స్కీమ్‌ అని నంద్యాలలో కొత్తగా ప్రవేశపెట్టారని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మండిపడ్డారు. కొన్ని కంపెనీల ట్రాక్టర్లు మాత్రమే కొనాలంట. కారణం ఆ కంపెనీలు చంద్రబాబుకు కమీషన్లు ఇస్తున్నాయట. డీలర్లు ఇష్టారాజ్యంగా రేట్లు పెంచి ప్రభుత్వ సబ్సిడీని కాంట్రాక్టర్లు కొంత, బాబు కొంత తీసుకుంటున్నార న్నారు.  

–ఉప ఎన్నిక వచ్చినప్పుడు నంద్యాలలో కూల్చివేతలు  గుర్తుకు వచ్చాయని వైయస్‌ జగన్‌ తప్పుపట్టారు. పెద్ద రోడ్డు కావాలని ఎవరైనా కోరుకుంటారు. పెద్ద రోడ్డు వేసేటప్పుడు నష్టపోయే వారితో సంప్రదింపులు జరపాలి. నష్టపరిహారం ఇంత ఇస్తామని చర్చలు జరపాలి. చంద్రబాబు మూడేళ్లలో ఏనాడు పట్టించుకోలేదు. రాత్రికి రాత్రే బుల్డోజర్లతో షాపులను ధ్వంసం చేస్తున్నారు. ఆ షాపులకు గజానికి రూ.18000 ఇస్తారట. ఆ ప్రాంతంలో సెంటు రూ.1.20 లక్షలు పలుకుతుంది. ఇంత అన్యాయమా అని అడిగితే పోలీసులను చూపించి తాట వలుస్తామని బెదిరిస్తున్నారు. 

–పింఛన్ల విషయంలో కూడా దారుణమే అని వైయస్‌ జగన్‌ తప్పుపట్టారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌రాజశేఖరరెడ్డి హయాంలో నంద్యాలలో 25 వేల పింఛన్లు ఉంటే, చంద్రబాబు వచ్చాక వాటిని 15 వేలకు కోత పెట్టారు. మళ్లీ ఇవాళ నంద్యాలలో ఉప ఎన్నికలు వచ్చాయని 25 వేల పింఛన్లు ఇస్తున్నారు. 

– నంద్యాల నియోజకవర్గంలో అందరికి తెలిసిన పెద్ద స్కామ్‌ కేశవరెడ్డి పెట్టిన పెద్ద టోపీ అని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. పిల్లల తల్లిదండ్రుల నుంచి లక్షలు వసూలు చేసిన కేశవరెడ్డి ఆ డబ్బులు చెల్లించకుండా మోసం చేశారు. వసూలు చేసిన డబ్బులు చెల్లించాలని తల్లిదండ్రులు కోరుతుంటే కేశవరెడ్డి వియ్యంకుడు ఆదినారాయణరెడ్డిని మంత్రిని చేసి నిందితుడికి చంద్రబాబు అండగా నిలిచారు. మరోవైపు సీఐడీతో చార్జీసిట్‌ ఫైల్‌ చేయిస్తున్నారు. కేశవరెడ్డి స్కూళ్లను నారాయణ, శ్రీచైతన్య యాజమాన్యాలకు అప్పగిస్తారు.

తప్పు చేస్తున్నావు చంద్రబాబు
– ప్రజలు ప్రశ్నిస్తుంటే »ñ దిరిస్తూ చంద్రబాబు తప్పు చేస్తున్నారని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. మూడేళ్లుగా మాకు ఏమిచ్చావని చంద్రబాబును నంద్యాల ప్రజలు నిలదీయాలని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పిలుపునిచ్చారు. తాను ఏమీ చేయలేదని, ప్రజల వద్దకు వెళ్తే కొడతారని చంద్రబాబుకు కూడా తెలుసు అన్నారు. అందుకే కళ్లు పెద్దవి చేస్తారని విమర్శించారు. నా పింఛన్లు తీసుకుంటున్నారు...నేను వేసిన రోడ్లపై తిరుగుతున్నారు. వీధి దీపాల కింద నడుస్తున్నారని ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రజలను హెచ్చరిస్తున్నారు. చంద్రబాబు తప్పు చేస్తున్నావ్‌. నీవు వేసిన రోడ్ల మీదే నిలబడి ప్రశ్నిస్తాం, నిలదీయాలని పిలుపునిచ్చారు.

నవ రత్నాల అమలుకు నంద్యాల నాందీ కావాలి
రాష్ట్రంలో నవ రత్నాలు లాంటి పథకాల అమలుకు నంద్యాల నాందీ కావాలని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పిలుపునిచ్చారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీఅధికారంలోకి వస్తే నంద్యాలను నందన వనం చేస్తానని హామీ ఇచ్చారు. నంద్యాలలో మీరు వేసే ఓటు రేపటి ఎన్నికలకు తొలి ఓటు కాబోతుందన్నారు. మార్పుకు మీ ఓటు నాందీ కాబోతుందని చెప్పారు. వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నంద్యాల అభివృద్ధి బాధ్యత నాకు వదిలేయండి. విత్తనాభివృద్ధికి నంద్యాలను కేంద్ర బిందువు చేస్తాను. వ్యవసాయ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తాను. కుందు నదితో నంద్యాల ప్రజలు ఏరకంగా బాధపడుతున్నారో చూశాను. మిమ్మల్ని మభ్యపెట్టేందుకు నాలుగు ప్రోక్లెయిన్లు పెట్టారు. నాకు వదిలేయండి నేను అభివృద్ధి చేస్తాను. నంద్యాలను మోడల్‌ టౌన్‌గా చేస్తానని గట్టిగా చెబుతున్నాను. నవరత్నాల పథకాలను ప్రకటించాను. ఈ పథకాలు రేపు రాష్ట్ర చరిత్రను మార్చబోతున్నాయి. కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా అందరికి నవ రత్నాలు అందజేస్తాం. అందరికి ఈ పథకాలు అందాలంటే ఈ వ్యవస్థలో మార్పు రావాలి. వ్యవస్థ బలపడాలి. వ్యవస్థలను బలపరిచే దిశగా, నవరత్నాలను ప్రతి ఇంటికి చేర్చే దిశగా అడుగులు వేస్తూ..ప్రతి పార్లమెంట్‌ను ఒక జిల్లాగా చేయబోతున్నాను. 13 జిల్లాలను 25 జిల్లాలుగా చేయబోతున్నాను. నంద్యాలను ప్రత్యేక జిల్లాగా చేస్తాను. మీ కళ్ల ముందే కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం వుంటుంది. ప్రతి ప్రభుత్వ కార్యాలయం మీ ముందు ఉంటుంది. అత్యంత వేగంగా నంద్యాల అభివృద్ధి చెందుతోంది. నవరత్నాల అమలుకు నంద్యాలే నాందీ కావాలి. అభివృద్ధి బాధ్యత పూర్తిగా నాకు వదిలేయండి. 

ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తా
ఇల్లు లేని వారి బాధ్యత కూడా నాకే వదిలేయండి అని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. ఎవరో లంచాలు తీసుకున్న డబ్బును మీరు బ్యాంకులో కట్టాల్సిన పని లేదు. ప్రతి ఒక్కరికి ఉచితంగా ఇల్లు కట్టిస్తాను. రిజిస్ట్రేషన్‌ చేసిన పట్టాలను కూడా వారి చేతికిస్తాను. రోడ్డు విస్తరణ పేరుతో సరైన పరిహారం చెల్లించకుండా అన్యాయమైన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తానని హామీ ఇస్తున్నాను. 

ఆర్యవైశ్య కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తాం
ఆర్యవైశ్యలకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తానని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చారు. ఆర్యవైశ్యులందరు నన్ను అడిగారు. మాలో కూడా పేదవాళ్లు ఉన్నారు. ఆర్యవైశ్య కార్పొరేషన్‌ విషయంలో చంద్రబాబు పట్టించుకోవడం లేదు. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆర్యవైశ్య కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తాం. 

– టీడీపీలో మైనార్టీ నేత ఫరూక్‌ ఉన్నారు. మన వైపున ఉన్న మైనార్టీలకు న్యాయం చేయమని స్థానికులు అడిగారు. మన పార్టీకి ఒకే ఒక ఎమ్మెల్సీ సీటు వస్తుంది. ఆ స్థానాన్ని నంద్యాలకు చెందిన మైనారిటీ నేతకు కేటాయిస్తాం.   

– కేశవరెడ్డి బాధితులకు న్యాయం చేస్తామని వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. చంద్రబాబు చొక్కాలు వదిలిస్తాం. ఆదినారాయణరెడ్డి నిక్కర ఊడగొడతాం. ఆగ్రిగోల్డు బాధితులకు అదే చేప్పాం. బాధితులు ఎవరైనా సరే వారికి రావాల్సిన డబ్బులు పూర్తిగా ఇస్తాం.  ఆ తరువాత వాళ్ల చొక్కాలు, నిక్కర్లు ఎట్టా విప్పాలో మేం ఆలోచిస్తాం. మీ ఆశీస్సులు రేపటికి పునాదులు కావాలి.

–కుతంత్రాలతో చంద్రబాబు మనుషులు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్నారట. వైయస్‌ జగన్‌ ఇప్పుడే సీఎం కాదు గదా అని చెబుతున్నారట. ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి. ధర్మానికి, ఆ ధర్మానికి మధ్య,  ఈ ఎన్నికలు ఏడాదిన్నరలో జరిగే సార్వత్రిక ఎన్నికలకు నాందీ కావాలి.

చక్రపాణిరెడ్డి సింహం, పులి
ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వచ్చిన శిల్పా చక్రపాణిరెడ్డి సింహం, పులిలాంటి వ్యక్తి అని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. నిన్న చక్రపాణిరెడ్డి నా వద్దకు వచ్చారు. ఆయనకు నేను ఒక్కటే చెప్పాను. అన్న చంద్రబాబు లాగా నేను రాజకీయాలు చేయలేను. చంద్రబాబు ద్వారా వచ్చిన పదవిని ఆయన ముఖాన కొట్టమన్నాను. నేను చెప్పిన ఆ మాటలకు చక్రపాణిరెడ్డి ఒప్పుకున్నారు. స్పీకర్‌ ఫార్మట్‌లో రాజీనామా లేఖ అప్పగించారు. ఇది పులి అంటారు..సింహం  అంటారు. ఈ రాజీనామాలు ఆమోదిస్తే మంచి రాజకీయాలు అంటారు. ఇవాళ చంద్రబాబు పరిస్థితి ఏంటంటే డబ్బులు ఆశ చూపించి, పదవులు ఆశచూపించి కొనుగోలు చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. ఇటువంటి కలియుగ రాక్షకుడిని సంహరించాలని కోరుతున్నాను. మార్పు తీసుకొచ్చేందుకు నంద్యాల ప్రజలు నాందీ పలకాలి. వంచనకు, విశ్వసనీయతకు మధ్య జరిగే పోరాటంలో మీరు భాగస్వాములు కావాలని కోరుతున్నాను. తిరుగులేని మెజారిటీతో గెలిపించాలని పేరు పేరున విజ్ఞాప్తి చేస్తున్నాను. తోడుగా రావాలని కోరుతున్నాను. మన గుర్తు తెలిసిన వారంతా కూడా చేతులు ఊపుతూ ఫ్యాన్‌ గుర్తు చూపించాలని కోరుతున్నాను. 9వ తేదీ నుంచి 21 వరకు నంద్యాలలో ఉంటానని వైయస్‌ జగన్‌ వెల్లడించారు. ప్రతి వీధికి వస్తా. ప్రతి ఊరికి వస్తా..చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థను అన్యాయం జరుగకుండా చూస్తాను. రాజగోపాల్‌రెడ్డికి సముచిత స్థానం కల్పిస్తాను.. చక్రపాణిరెడ్డిని ఎమ్మెల్యే స్థానంలో కూర్చోబెడతానని హామీ ఇస్తున్నాను. 
Back to Top