బాబుకు బుద్ధి వచ్చేదాక గడ్డిపెడతాం

  • వైయస్ఆర్ సంక్షేమ పథకాలకు తూట్లు పొడుస్తున్న బాబు
  • బాబు తీరుపై మండిపడుతున్న పేదలు
  • ఆరోగ్యశ్రీ సక్రమంగా అమలయ్యేవరకు పోరాడతాం
  • పేద ప్రజలకు వైయస్సార్సీపీ అండగా ఉంటుంది
  • మేము వస్తున్నామని తెలిసి కలెక్టర్ లేకుండా పోయాడు
  • బాబుకు, కలెక్టర్ కు కొంచెమైనా బుద్ధి ఉండాలి
  • సంక్షేమ పథకాల అమలు కోసం బాబు మెడలు వంచుతాం
  • ఒంగోలు కలెక్టరేట్ వద్ద ధర్నాలో వైయస్ జగన్ ప్రసంగం
ఒంగోలుః చంద్రబాబుకు బుద్ధి వచ్చేదాకా గడ్డిపెట్టయినా ఆరోగ్యశ్రీ పథకాన్ని సక్రమంగా అమలయ్యేందుకు పోరాడతామని వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు భరోసా ఇచ్చారు.  ఆరోగ్యశ్రీ అమలు తీరును చూసి ప్రతి పేదవాడికి కడుపు మండిపోతోందని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరిన రెండున్నరేళ్ల కాలంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని నీరుగార్చిందని వైయస్‌ జగన్‌ చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. ఆరోగ్యశ్రీ ఉంటే పేదలకు వైయస్ఆర్  గుర్తుకు వస్తారని బాబు దాన్ని తొలగించే కుట్ర పన్నుతున్నారని జదన్ ఆగ్రహించారు.  శుక్రవారం ప్రకాశం జిల్లాలోని ఒంగోలు పట్టణంలో ఆరోగ్యశ్రీ అమలు తీరును నిరసిస్తూ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. బాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆరోగ్య శ్రీ అమల్లో టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. 

ఆనాటి మేలు వైభవం ఇప్పుడేది..
వైయస్‌ఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆరోగ్యశ్రీ పథకం అమలు తీరు అద్భుతంగా ఉండేదని కానీ బాబు దాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. పేదవాడు అనారోగ్యం కారణంగానో, పిల్లలను ఉన్నత చదువులు చదివించుకోవడానికే అప్పులు పాలయ్యేవాడని దివంగత వైయస్‌ఆర్‌ మదనపడేవారన్నారు. ఆ పరిస్థితి నుంచి బయటపడేయాలనే లక్ష్యంతో ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ లాంటి బృహత్తర పథకాలకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. పేదవాడు ఆర్థికంగా బలపడాలంటే వారి పిల్లలు ఉన్నత చదువులు చదివి ఉన్నత ఉద్యోగాలు చేయాలని మహానేత కలలు కనేవారని ఈ సందర్భంగా వైయస్‌ జగన్‌ గుర్తుచేశారు. అయితే బాబు అభిప్రాయం ఇందుకు భిన్నంగా ఉందన్నారు. బీసీలు అభివృద్ధి చెందాలంటే ఇస్త్రీ పెట్టెలు, క్షవరానికి కత్తెర్లు ఇస్తే సరిపోతుందని భావిస్తున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అందుకే చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడని తెలిపారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాలకు అరొకొర నిధులు కేటాయించి పథకాలకు తూట్లు పొడుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనాడు ఎవరైనా 108 కి ఫోన్‌ చేస్తే చాలు అంబులెన్స్‌ వచ్చేది. కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో చేర్పించి ఉచిత వైద్యం అందించి.. మందులిచ్చి.. వెళ్లడానికి ఛార్జీలకు డబ్బులిచ్చి పంపేవారు. ఆస్పత్రుల వద్ద ఆరోగ్యమిత్రలు ఉండి ఏ ఆస్పత్రుల్లో చేరితే బాగుంటుందని ఎలాంటి వైద్యం చేయించుకోవాలి.. అని అవగాహన కల్పించేవారని పేర్కొన్నారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితే లేదన్నారు.  అంబులెన్సులున్నా పనిచేయని పరిస్థితి. బాబు ముఖ్యమంత్రి అయ్యాక ఆరోగ్య మిత్రలను ఉద్యోగాల నుంచి తీసేశారు. అప్పుడేమో జాబు రావాలంటే బాబు రావాలని టీవీలు, పేపర్లు, గోడల నిండా ప్రచారం చేశారు. ఇప్పుడేమో  ఉన్న జాబులు ఊడగొడుతున్నారని తూర్పారబట్టారు. 

ఆరునెలలుగా బిల్లులు లేవు
ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు ఆరు నెలలుగా బిల్లులు ఇవ్వకపోతే  ఆస్పత్రులు ఎలా నడుస్తాయని వైయస్‌ జగన్‌ ప్రభుత్వాన్ని నిలదీశారు.  నిధులు సక్రమంగా విడుదల చేయకపోతే పేదవారికి వైద్యం ఎలా చేస్తారన్న కనీసం జ్ఞానం కూడా బాబుకు లేదని మండిపడ్డారు. ఆయనింకా ఏమన్నారంటే... ‘ఆరోగ్యశ్రీ పథకం అమలు కావాలంటే కనీసం రూ.910 కోట్లు కావాల్సి ఉంటుందని అధికారులు తేల్చారు. అయితే ప్రభుత్వం మాత్రం కేవలం రూ.560 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుంది. వాటిలో బకాయిలు దాదాపు రూ.390 కోట్లు వరకు ఉన్నాయి. అంటే మొత్తం విలువ రూ.1300 కోట్లు అవసరం ఉంది. కాగా నిన్నోమొన్ననో మరో రూ.262 కోట్లు ఇచ్చారు. మొత్తమంతా ఇచ్చింది 820 కోట్లు. ఇంకా 500 కోట్లు కావాలి. ఇదంతా కేవలం మామూలు వైద్యానికే. కేన్సర్, డయాలసిస్‌ లాంటి సమస్యలుంటే ఇంకా ఎక్కువ కావాలి. పేదలను ఆదుకునేందుకు మరో వెయ్యి కోట్లు కేటాయించినా నష్టం లేదు. నాడు పదేళ్ల కిందట మహానేత వైయస్‌ఆర్‌ హయాంలో జరిగిన కేటాయింపులే నేటికీ కొనసాగడం సిగ్గుచేటు.  ఆస్పత్రి నిర్వహణ, కరెంటు బిల్లులు ఇలా అన్ని చార్జీలు పెరిగియాని, తక్కువ బిల్లులకు వైద్యం అందించలేమని ఆస్పత్రి యాజమాన్యాలు చేతులెత్తేస్తే బాబు పట్టించుకోకపోవడం దారుణమని వైయస్ జగన్ ఫైర్ అయ్యారు.  

క్యాన్సర్‌ బాధితులకు 2 లక్షలు ఎలా సరిపోతాయి
క్యాన్సర్‌తో బాధపడేవారికి చికిత్స చేయించుకోవాంటే ఈ రోజుల్లో చాలా ఖర్చుతో కూడుకున్నదని వైయస్‌ జగన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. కీమోథెరపీ చేయించుకోవాలంటే ఏడెనిమిది షార్ట్స్‌ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఒక్కో షార్ట్‌కి కనీసం లక్ష రూపాయలైనా అవుతుందన్నారు.  అయితే కేవలం రెండు లక్షలు కేటాయిస్తే ఎలా సరిపోతుందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. డయాలసిస్‌ చేయాలంటే కనీసం సంవత్సరానికి మూడు లక్షలకు పైగా ఖర్చవుతుందన్నారు. ఇలాంటి మొండిరోగాలకు ప్రభుత్వం కేటాయించిన నిధులు సరిపోయే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. అలాంటిది అవసరానికన్నా తక్కువ నిధులు కేటాయిస్తే ప్రజలు బతికేదెలా అన్ని ప్రశ్నించారు. దాదాపు 13 రోగాలను ఆరోగ్యశ్రీ పరిధి నుంచి తొలగించడం చూస్తుంటేనే పథకాన్ని ఎంతగా నీరుగార్చారో అర్థం అవుతుందని పేర్కొన్నారు.

నాడు 2వేల మంది దరఖాస్తు చేసేవారు
చంద్రబాబు సీఎం కానంత వరకు రోజుకు 2వేల మంది ఆరోగ్యశ్రీకి దరఖాస్తు చేస్తే, ఇప్పుడు ఆ సంఖ్య 1200 కూడా లేదన్నారు. దీన్నిబట్టి చూస్తే పథకం అమలు తీరు అర్థమవుతుందన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన ప్రతిఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. అనంతరం కలెక్టర్‌కి వినతి పత్రం ఇచ్చేందుకు బయలు దేరబోగా కలెక్టర్‌ అక్కడ లేరని సమాచారం అందింది. వెంటనే వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ ...చంద్రబాబును గట్టిగా మందలిస్తున్నాం, హెచ్చరిస్తున్నాం.  ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంటు, ఇళ్లు కట్టించే పథకాలలో ఏవి చేయకపోయినా చంద్రబాబు మెడలు వంచి చేయిస్తాం. ఆరోగ్యశ్రీ పథకం కోసం గట్టిగా ఉద్యమిస్తాం, చంద్రబాబుకు బుద్ధి వచ్చేవరకు ఆయనకు గడ్డి పెడుతూనే ఉంటాం. మీ తరఫున అన్ని రకాలుగా పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుంది.  చంద్రబాబు మనసు మారకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తాం. నేను స్వయంగా కలెక్టర్‌కు అర్జీ ఇవ్వాలని అనుకున్నా. మనం వస్తున్నామని చంద్రబాబు ఫోన్‌ చేసి చెప్పారేమో, కలెక్టర్‌ వెళ్లిపోయారట. చంద్రబాబుకు బుద్ధి ఉండాలి, ఆ వెళ్లిపోయిన కలెక్టర్‌కు బుద్ధి ఉండాలి. ఈ పోరాటం కొనసాగుతుంది, చంద్రబాబు వైఖరిలో మార్పు రాకపోతే మరింత తీవ్రంగా పోరాడతామని అల్టిమేటం ఇస్తున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు.  
Back to Top