బాబు నోరు తెరిస్తే అబద్ధాలే

- క‌రువు స‌మ‌యంలో ఏరియ‌ల్ స‌ర్వే విడ్డూరం
- రైతు కరువుతో అల్లాడుతుంటే పట్టదా బాబు
-పంటలన్నీ కాపాడానని పచ్చి అబద్ధాలు చెబుతావా
-పొలాల్లో తిరగకుండా హెలికాప్టర్ లోంచి చూస్తే కరువు తెలుస్తుందా 
-ఎర్రిపల్లిలో పంటలను పరిశీలించిన వైయస్ జగన్..బాబు తీరుపై ఆగ్రహం

వైయస్ఆర్ జిల్లా(ఎర్రిపల్లి): ముఖ్యమంత్రి పనితీరు దారుణంగా ఉందని ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ మండిపడ్డారు. పంటనష్టపోయిన రైతులను ఆదుకోకుండా చంద్రబాబు చోద్యం చూస్తున్నారని ఆగ్రహించారు. నాలుగు వేల ఎకరాలకు నాలుగు ఎయిర్ గన్ లిచ్చి పంటలన్నీ కాపాడానంటూ చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని నిప్పులు చెరిగారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 71 వేల హెక్టార్ల‌లో సాగు చేసిన వేరుశ‌న‌గ పంట‌లో.... 70 రోజులు గ‌డుస్తున్నా ఇంత‌వ‌ర‌కు కాయ‌లు రాలేద‌ని అన్నారు. వైయ‌స్సార్ జిల్లా పులివెందుల నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని ఎర్రిప‌ల్లిలో వైయ‌స్ జ‌గ‌న్ వేరుశ‌న‌గ పంట‌ను ప‌రిశీలించారు.  అగ్రిక‌ల్చ‌ర్ ఏడీ , రైతులు, సంబంధిత అధికారుల‌తో  పంట‌కు సంబంధించిన క‌రువుపై వైయస్ జగన్ చ‌ర్చించారు. 

అనంత‌రం విలేక‌రుల‌తో మాట్లాడుతూ... జూన్‌, జూలైలో కాస్తో కూస్తో వ‌ర్షాలు ప‌డ్డాయ‌ని ఈ స‌మ‌యంలో జిల్లాలో 71వేల హెక్టార్ల‌లో వేరుశ‌న‌గ పంట‌ను సాగు చేసిన రైతుల‌కు చేదు అనుభ‌వ‌మే ఎదురైంద‌న్నారు. ఆగ‌స్టు 12న జ‌రగాల్సిన ఎస్ఎల్‌బీసీ స‌మావేశాన్ని సీజ‌న్ అయిపోయాక, సెప్టెంబ‌ర్ 15 త‌రువాత నిర్వహించ‌డం వ‌ల్ల ఏమాత్రం ఫ‌లితం లేద‌న్నారు. రైతులు కరువుతో అల్లాడుతున్న సమయంలో బాబు  ఏరియల్ సర్వే నిర్వహించడం విడ్డూరమని దుయ్యబట్టారు.  వ‌ర‌ద వ‌చ్చిన స‌మ‌యంలోనే ఏరియ‌ల్ సర్వే చేస్తారు త‌ప్ప‌... క‌రువుతో త‌ల్లడిల్లుతున్న స‌మ‌యంలో కాదని ఎద్దేవా చేశారు. క‌రువు గురించి పంట పొలాల్లో ప‌ర్య‌టిస్తే తెలుస్తుంది త‌ప్ప హెలికాప్టర్ లోంచి చూస్తే కాదని చురక అంటించారు. 

పంట‌న‌ష్టపోయిన రైతుల‌ను ప్ర‌భుత్వం ఏవిధంగా ఆదుకుంటుందో తెలియ‌జేయాల్సిన బాధ్య‌త చంద్ర‌బాబుపై ఉందని అన్నారు. ప్ర‌భుత్వం చేయాల్సిన ప‌నుల్లో ఒక్క‌టి కూడా చేయ‌డం లేదని వైయస్ జగన్ మండిపడ్డారు. బ్యాంక‌ర్లు రైతుల‌కు రుణాలిచ్చారా..?  విత్త‌నాలు ఏ స్థాయిలో అందుతున్నాయి... వాటి ప‌నితీరు ఎలా ఉందని సీఎం తెలుసుకోకపోవడం బాధాకరమన్నారు. రైతుల‌కు రుణాలు మాఫీ కాక... రుణాలు రెన్యూవ‌ల్ కాక‌... ఇన్సురెన్స్ అంద‌ని ప‌రిస్థితి నెల‌కొంది. ఇన్‌ఫుట్ స‌బ్సిడీ 2014-15, 2015-16కు సంబంధించి ఇంత‌వ‌ర‌కు రూపాయి కూడా మంజూరు కాలేదు. వేరుశ‌న‌గ‌కు సంబంధించి 2012 క్రాప్ ఇన్సురెన్స్ ఇంత‌వ‌ర‌కు అంద‌లేదు. రాష్ట్ర ముఖ్య‌మంత్రి ప‌నితీరు ఇంత ఆధ్వానంగా ఉంటే రైతులు ఎలా బతుకుతారని వైయస్ జగన్ నిలదీశారు. 

శ్రీ‌శైలం పూర్తిగా ఎండిపోతోంది.... 854 అడుగుల నీటి మ‌ట్టం ఉంచితే త‌ప్ప పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు ఇవ్వలేని ప‌రిస్థితి . క‌డ‌ప‌కు వ‌చ్చిన ప్ర‌తిసారి గండికోట‌కు 10 టీఎంసీల నీరిస్తాన‌న్న చంద్ర‌బాబు హామీ ఏమైందని వైయస్ జగన్ ప్రశ్నించారు. గండికోట‌లో 10 టీఎంసీల నీరు నిల్వ ఉంచాలంటే ముందుగా ముంపు గ్రామాల‌కు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాలన్నారు. బ్రహ్మ‌సాగ‌ర్‌లో 12 టీఎంసీల నీరు నింపిన ఘ‌న‌త వైయ‌స్సార్‌దేనని గుర్తు చేశారు. దివంగ‌త మ‌హానేత డాక్ట‌ర్ వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి బ్ర‌హ్మ‌సాగ‌ర్ కెనాల్‌ను 80 పూర్తి చేశారని, అధికార ప్ర‌భుత్వం మిగ‌తా 20 శాతం కూడా పూర్తిచేయ‌లేక‌పోతోందని విమర్శించారు. వెలుగొడు ప్రాజెక్టుకు మ‌ర‌మ్మ‌తులు చేయాల్సి ఉండగా కెనాల్ ల‌కు మ‌ర‌మ్మ‌తులు చేయ‌డం లేదు. గ‌త రెండున్న‌రేళ్లుగా చంద్ర‌బాబు బ్ర‌హ్మ‌సాగ‌ర్‌కు ఒక టీఎంసీ నీరు కూడా ఇవ్వ‌లేక‌పోయారు. హంద్రీనీవా, గాలేరు నగరి, వెలుగోడు ప‌నులు న‌త్త‌న‌డ‌క‌న సాగుతున్నాయని దుయ్యబట్టారు.

నీళ్లు లేకున్నా వాట‌ర్ గ‌న్‌ల‌ను ఏమీ చేసుకోవాలి బాబూ..?
నాలుగువేల ఎక‌రాల శ‌న‌గ పంట‌కు నాలుగు వాట‌ర్ గ‌న్ లు ఎక్క‌డ స‌రిపోతాయని బాబును ప్రశ్నించారు.  ఒక వాట‌ర్ గ‌న్‌ను ఆన్ చేస్తే 50 అడుగుల వ‌ర‌కు నీరు ప‌డుతుంది . అస‌లు నీళ్లు లేని ప్రాంతానికి వాట‌ర్ గ‌న్‌లు ఏమీ చేస్తాయని నిలదీశారు.  రాయ‌ల‌సీమ ప్రాంతంలో కేవ‌లం 61 వేల హెక్టార్ల పంట మాత్ర‌మే దెబ్బ‌తింది... అందులో రెయిన్ గ‌న్‌లు పెట్టి 42వేల హెక్టార్ల పంటను కాపాడమ‌ని టీడీపీ మంత్రులు చెప్ప‌డం సిగ్గుచేటన్నారు. నోరు తెరిస్తే అబద్ధాలు అడే వ్య‌క్తి ఒక్క చంద్రబాబేనని విరుచుకుపడ్డారు. 2015-16 సంబంధించి పంటనష్టపోయిన రైతులకు ఇన్‌ఫుట్ స‌బ్సిడీ ఇవ్వాల‌ని, ప్రతి ఎక‌రాకు రూ. 10 వేల న‌ష్ట‌ప‌రిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 
Back to Top