నిజంగా ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా..!

హైదరాబాద్) శాసనసభలో చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న అరాచకాల్ని చూస్తుంటే అసలు
నిజంగా..మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా అన్న అనుమానం కలుగుతుందని ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ
అధ్యక్షుడు వైఎస్ జగన్ అభిప్రాయ పడ్డారు. అసెంబ్లీలో ఏం జరిగింది అనేది అందరూ చూస్తూనే
ఉన్నారని ఆయన అన్నారు.

అసెంబ్లీ దగ్గర ఎమ్మెల్యే రోజా ను ప్రభుత్వం అడ్డుకోవటంతో శాసనసభ దగ్గర వైఎస్
జగన్ నాయకత్వంలో ఆందోళన నిర్వహించారు. అనంతరం తోటి ఎమ్మెల్యేలతో కలిసి రాజ్ భవన్
కు వెళ్లి గవర్నర్ ను కలిసే ప్రయత్నం చేశారు. గవర్నర్ నరసింహన్ లేకపోవటంతో ఆయన
కార్యదర్శి కి ఫిర్యాదు చేశారు. అనంతరం రాజ్ భవన్ దగ్గర వైఎస్ జగన్ మీడియాతో
మాట్లాడారు.  వైఎస్ జగన్ ఏమన్నారో ఆయన
మాటల్లోనే విందాం..

      చంద్రబాబు ప్రభుత్వం శాసనసభను
చేతుల్లోకి తీసుకొని పెడదోవ పట్టిస్తున్నారనేది చూస్తున్నాం. శాసనసభలో స్పీకర్ అనే
వ్యక్తి రూల్స్ కు వ్యతిరేకంగా తెలుగుదేశానికి కొమ్ము కాస్తున్నారు. నిబంధనలు
అనుమతించక పోయినా కానీ ఎమ్మెల్యే రోజమ్మను సస్పెండ్ చేయటం చూశాం. నిబంధన 340
ప్రకారం సస్పెండ్ చేశామని చెబుతున్నారు.  కానీ,  ఈ నిబంధన ప్రకారం చూస్తే అసెంబ్లీ సెషన్స్ వరకు
మాత్రమే సస్పెండ్ చేయటానికి వీలవతుంది. నిబంధనలు ఇంత స్పష్టంగా చెబుతున్నప్పటికీ, ఏడాదిపాటు
సస్పెండ్ చేశారు.

శాసనసభలో రాజ్యాంగాన్ని ఎలా అపహాస్యం చేస్తున్నారో గమనించాలి. 179 (సీ) అధికరణ స్పీకర్ తొలగింపును గురించి చెబుతుంది. నోటీసు ఇచ్చాక 14 రోజుల తర్వాత చర్చ చేపట్టాలని స్పష్టంగా వివరిస్తోంది. అంత క్లియర్ గా చెబుతున్నప్పటికీ, ఎమ్మెల్యేలకు వెసులుబాటు కల్పించేందుకు 14 రోజుల తర్వాత పెట్టాల్సిన అంశాన్ని వెంటనే తీసుకొని వచ్చి నిబంధనల్ని సస్పెండ్ చేసి మరీ సభను నడిపించేశారు.  ప్రతిపక్షం గొంతు నొక్కి సభను నడిపించారు. ప్రతిపక్షం గొంతును నొక్కుతుంటే, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తుంటే .. స్పీకర్ నేరుగా టీడీపీ కి కొమ్ము కాస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అప్పట్లో నేను అనని మాటల్ని వక్రీకరించారు. కానీ ఈ రోజు రోజమ్మకు జరిగిన అన్యాయం అంతా ఇంతా కాదు. దీని మీద ఆమె సుప్రీంకోర్టు, హైకోర్టులకు వెళ్లి ఆదేశాల తెచ్చుకొన్నారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్ని స్పీకర్ కార్యాలయానికి సమర్పించటం జరిగింది. ఈ రోజు ను అసెంబ్లీకి వెళితే కోర్టు తీర్పును బేఖాతరు చేసి, స్పీకర్ పదవిని దుర్వినియోగం చేస్తున్నారు. మేం కోర్టుల కన్నా పెద్దవాళ్లం అంటూ రోజమ్మను రానీయని పరిస్థితి నెలకొంది. అసెంబ్లీ ఎదుట రోజమ్మను అడ్డుపడుతున్న పరిస్థితి నెలకొంది. ఎందుకు అడ్డుపడుతున్నారు అని అడిగితే జవాబు చెప్పని పరిస్థితి నెలకొంది. గంటన్నర పాటు అక్కడ ధర్నా చేసినా ప్రయోజనం లేదు. గాంధీ విగ్రహం దగ్గర ధర్నా చేశాం. చివరకు రాజ్ భవన్ కు వచ్చాం. గవర్నర్ నరసింహన్ అందుబాటులో లేకపోవటంతో ఆయన కార్యదర్శికి ఫిర్యాదు లేఖ ఇచ్చాం. గవర్నర్ గారికి అన్నీ వివరించమని చెప్పాం.  

      అటు రోజా తరపు న్యాయవాదులు హైకోర్టుకి వెళ్లారు. న్యాయస్థానంలో కోర్టు ధిక్కార పిటీషన్ వేయమని చెప్పటం జరిగింది. సోమవారం దీని మీద వాదనలు జరుగుతాయి.. న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంచి, రోజమ్మకు తోడుగా నిలుస్తాం. రోజమ్మకు అన్నివిధాలా అండగా ఉంటాం.

      చంద్రబాబు, స్పీకర్ ల అహంకారం ఏ స్థాయిలోకి వెళ్లిందో చూస్తున్నాం. కోర్టులు కూడా తమను ఏమీ చేయలేవని అనుకొంటున్నారు. అయితే దేవుడు అన్నీ చూస్తున్నాడు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో గట్టిగా బుద్ది చెబుతారు. ’’

  అని వైఎస్ జగన్ వివరించారు. అనంతరం గవర్నర్ కు ఇచ్చిన లేఖ కాపీలను మీడియాకు పంపించారు. 

Back to Top