ఇలాంటి దారుణమైన పాలన మీకు కావాలా?

–ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకానికి బాబు తూట్లు పొడిచారు
– రేషన్‌షాపుల్లో నిత్యవసర వస్తువులు కరువు
– బాబు ఒక్క ఇళ్లైనా కట్టించారా
– అధర్మానికి, అన్యాయానికి వ్యతిరేకంగా ఓటు వేయండి

నంద్యాల: ఏ ఒక్కరికి మేలు చేయని  ఇలాంటి దారుణమైన చంద్రబాబు పాలన మీకు కావాలా అని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నంద్యాల ప్రజలను సూటిగా ప్రశ్నించారు. అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబు ఈ మూడున్నరేళ్లలో అన్ని వర్గాలను మోసం చేశారని, నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ మోసాలకు, అన్యాయాలకు వ్యతిరేకంగా ఓటు వేయాలని వైయస్‌ జగన్‌ పిలుపునిచ్చారు. నంద్యాల ప్రచారంలో భాగంగా పట్టణంలోని నడిగడ్డ ప్రాంతంలో వైయస్‌ జగన్‌ స్థానికులను ఉద్దేశించి మాట్లాడారు.  2014 ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలు నమ్మి ప్రజలు ఓట్లు వేస్తే..ఆయన గెలిచిన తరువాత ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. మూడున్నర సంవత్సరాల పాటు చంద్రబాబు చేసిన మోసాలకు, అన్యాయాలకు వ్యతిరేకంగా ఉప ఎన్నికలో ఓటు వేయాలని సూచించారు. అధర్మానికి వ్యతిరేకంగా ఓటు వేసి ధర్మానికి తోడుగా నిలవాలని వైయస్‌ జగన్‌ విజ్ఞప్తి చేశారు. 

మహానేత హయాంలో చదువులకయ్యే ఖర్చు ప్రభుత్వమే భరించేది
దివంగత ముఖ్యమంత్రి వైయస్‌రాజశేఖరరెడ్డి పాలనలో పేదలు పెద్ద పెద్ద చదువులు చదువుకునేందుకు ఎప్పుడు ఇబ్బంది పడలేదని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ఎన్నో పేద కుటుంబాలు తమ పిల్లలను ఉన్నతంగా చదివించుకున్నారని గుర్తు చేశారు. పేదవాళ్లు  తమ పిల్లలను చదవించుకునేందుకు అప్పులపాలు అయ్యేవారని, ఎవరైనా ఆ కుటుంబంలో అనారోగ్యం పాలైతే వైద్యం కోసం అప్పులు చేసేవారని మహానేత అనే వారన్నారు. నాన్నగారి హయాంలో పేదవాడు డాక్టర్, ఇంజనీర్‌ చదివేందుకు అయ్యే పూర్తి ఖర్చు ప్రభుత్వమే భరించిందన్నారు. నాడు పేదవాడిని ఉచితంగా ఇంజనీర్, డాక్టర్‌గా తీర్చిదిద్దారన్నారు. ఇవాళ అదే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకానికి చంద్రబాబు తూట్లు పొడిచారని వైయస్‌ జగన్‌ నిప్పులు చెరిగారు. నేడు ఇంజనీరు చదవాలంటే రూ. లక్ష దాటుతుందన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కింద ప్రభుత్వం కేవలం రూ.35 వేలు మాత్రమే ఇస్తుందన్నారు. మిగిలిన రూ.65 వేలు ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు.  ఇల్లు అమ్ముకుని పిల్లలను చదవించే పరిస్థితి రాష్ట్రంలో నెలకొందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంజనీర్లు, డాక్టర్లు చదివించగలమా అని నిలదీశారు. ఇంజనీరింగ్‌ కాలేజీలకు లక్షలు పెంచేందుకు అనుమతి ఇచ్చారు. మరోవైపు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మాత్రం తగ్గించారని మండిపడ్డారు. ఇటువంటి దారుణమైన పాలన మీకు కావాలా అని వైయస్‌ జగన్‌  ప్రశ్నించారు.

ప్రజాపంపిణీ వ్యవస్థ నిర్వీర్యం
చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ప్రజాపంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేశారని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మండిపడ్డారు. గతంలో రేషన్‌షాపుకు వెళ్తే బియ్యం, చక్కెర, కిరోసిన్, గోదుమపిండి, కంది పప్పు, ఇలా 9 రకాల సరుకులు ఇచ్చే వారని వైయస్‌ జగన్‌ తెలిపారు. ఇవాళ రేషన్‌ షాపుకు వెళ్తే బియ్యం తప్ప ఏమీ ఇవ్వడం లేదన్నారు. ఇసుక నుంచి మట్టి దాకా, మద్యం నుంచి ఎ్రరచందనం వరకు ఇలా ప్రతిదాంట్లో కూడా టీడీపీ నేతలు అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు. ఇలా సంపాదించిన అవినీతి సొమ్ముతో చంద్రబాబు నంద్యాలకు వస్తున్నారని, ఓటర్లు లౌక్యంగా వ్యవహరించి ధర్మానికి, న్యాయానికి మద్దతుగా నిలవాలని, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్‌ రెడ్డిని ఆశీర్వదించి, ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేయాలని వైయస్‌ జగన్‌ అభ్యర్థించారు.  

తాజా వీడియోలు

Back to Top