దోపిడీ పాలనకు బుద్ధి చెప్పండి

  • నంద్యాలలో బాబు క్యాబినెట్ ప్రలోభాలు
  • డబ్బుల మూటలతో  బేరసారాలు
  • బాబు దుర్నీతిని ఎండగట్టండి
  • నంద్యాల ఎన్నికలో ధర్మం వైపు నిలబడండి
  • చాబ్రోలులో వైయస్ జగన్ రోడ్ షో
  • శిల్పాను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి
చాబ్రోలు))చంద్రబాబు నంద్యాలలో వందలకోట్ల అవినీతి డబ్బుల్ని విచ్చలవిడిగా వెదజల్లుతున్నాడని వైయస్సార్సీపీ అధినేత వైయస్ జగన్ మండిపడ్డారు.  కార్పొరేటర్ల దగ్గర్నుంచి చిన్నచితకా నాయకుల వరకు నీరేటు ఎంత అని కొనుగోలు చేస్తున్నారని చంద్రబాబుపై వైయస్ జగన్ నిప్పులు చెరిగారు. నంద్యాల ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా రెండవ రోజు చాబ్రోలుకు చేరుకున్న వైయస్ జగన్ అక్కడ ప్రసంగించారు. బాబు క్యాబినెట్ అంతా నంద్యాల నడిరోడ్లపైనే కనిపిస్తోందని ఎద్దేవా చేశారు.  నంద్యాలలో ప్రతి సామాజిక వర్గానికి బాబు ఎర వేస్తున్నాడని, బుజ్జగింపులు, బెదిరింపులకు పాల్పడుతున్నాడని విమర్శించారు. ఎన్నికలప్పుడు ఇచ్చిన ఏ ఒక్క వాగ్ధానాన్ని  అమలు చేయకపోవడం వల్లే బాబుకు ఇంత దారుణమైన పరిస్థితి వచ్చిందని అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయి మూడున్నరేళ్లయినా ఏ ఒక్క సామాజిక వర్గానికి కూడ న్యాయం చేయలేదన్నారు. విపరీతమైన అవినీతి చేస్తూ దారుణంగా పాలన సాగిస్తున్నాడని బాబుపై ధ్వజమెత్తారు. 

బాబు తన దుర్మార్గపు పాలనను కప్పిపుచ్చుకునేందుకు..నంద్యాల ఉపఎన్నికలొచ్చేసరికి మళ్లీ టేప్ రికార్డర్ ఆన్ చేశాడు. మళ్లీ మోసం చేసేందుకు సిద్ధమయ్యారు. నీరేటెంత అని ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినట్టే ప్రజలను ప్రలోభపెడుతున్నాడు. బాబుకు కళ్లు నెత్తికెక్కాయి. డబ్బుతో ఎవరినైనా కొనొచ్చన్న అహంకారంతో కొనుగోళ్లు మొదలుపెట్టాడు. బాబు అధికారం, పోలీసు బలగం, డబ్బుల మీద ఆధారపడుతున్నాడు. చంద్రబాబు మాదిరి అధికారం కోసం దిగజారిపోయి అబద్ధాలు ఆడడం... మోసం చేయడం నాకు చేతకాదు. నాకున్న ఆస్తి నాన్నగారిపట్ల మీరు చూపిస్తున్న అభిమానం. చంద్రబాబు మూటలకు మూటలు డబ్బులు తెచ్చి కొనుగోలు చేస్తున్నాడు. అక్కచెల్లెమ్మలను మోసం చేసేందుకు బాబుకు కుట్టుమిషన్ లు గుర్తుకువస్తాయి. రైతులను మోసం చేసేందుకు ట్రాక్టర్ లు గుర్తుకువస్తాయి. ఓటుకు రూ.5వేలిస్తానని మొహమాటం లేకుండా చెబుతున్నాడు. ఇంతింత డబ్బు బాబుకు ఎక్కడి నుంచి వచ్చిందంటే...మన దగ్గరి నుంచి దోచిన సొమ్మే. మద్యం నుంచి ఇసుక దాక... ఇసుక నుంచి  కాంట్రాక్టర్లదాకా..చివరకు గుడిభూములను కూడ వదిలిపెట్టలేదు. రాజధాని భూముల నుంచి గుడిభూముల  దాకా దోపిడీ చేశారు. 

బాబు మూడున్నరేళ్లలో మూడున్నర లక్షల కోట్లు వెనకేసుకున్నాడు. రాష్ట్ర జనాభా ఆరుకోట్లు బాబు దోచింది మూడున్నర లక్షల కోట్లు. సగటున అందరి దగ్గర రూ. 66వేల రూపాయలు దోచుకున్నాడు. దాంట్లో 5వేలు పంచుతానంటడు. బాబు దుర్నీతిని తిప్పికొట్టండి. ధర్మానికే ఓటు వేయండి. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి కావడం కోసం మోసం చేశాడు. ఎన్నికలయ్యాక ప్రతి ఒక్కరినీ వెన్నుపోటు పొడిచాడు. రైతుల రుణాలు మాఫీ కావాలన్నా,  బ్యాంకుల్లో బంగారం ఇంటికి రావాలన్నా బాబు ముఖ్యంత్రి కావాలన్నాడు. ఏ గోడల మీద చూసినా జాబు రావాలంటే బాబు రావాలన్న రాతలే కనిపించాయి. ఉద్యోగం లేనివారికి ఇంటికి రూ.2వేలు భృతి ఇస్తానన్నాడు. రుణాలు మాఫీ అయ్యాాయా..?బ్యాంకుల్లోని బంగారం ఇంటికొచ్చిందా..? నిరుద్యోగ భృతి ఇచ్చారా అని వైయస్ జగన్ ప్రశ్నించగా లేదు లేదు అని ప్రజలు చేతులు ఊపుతూ సమాధానమిచ్చారు. ప్రజలు అవసరమొచ్చినప్పుడు అది చేస్తా, ఇది చేస్తానంటడు. ఎన్నికలయిపోయాక టోపీ పెడతడు. బాబు మోసాలకు, అన్యాయానికి , అధర్మానికి వ్యతిరేకంగా మనం ఇవాళ ఓటు వేస్తున్నాం. నంద్యాలలో జరుగుతున్న ఈ ధర్మయుద్ధంలో ధర్మానికి తోడుగా ఉండండి. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి శిల్పా మోహన్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుందామని వైయస్ జగన్ పిలుపునిచ్చారు. 
Back to Top