నంద్యాలను గుండెల్లో పెట్టుకుంటా

  • నాకున్న ఆస్తి నాన్నగారిపై మీకున్న అభిమానమే
  • చంద్రబాబులా నాకు దుర్భుద్ది లేదు
  • నవరత్నాలతో ప్రతి ఒక్కరూ చిరునవ్వుతో బతకాలి 
  • రాబోయే మహాసంగ్రామంలో నంద్యాలే  నాంది కావాలి 
  • నంద్యాల ఓటర్లు ధర్మానికి తోడుగా నిలవాలి
  • కానాల ఎన్నికల ప్రచారంలో వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి
కానాల: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో స్థానికులకు భరోసా కల్పించారు. నంద్యాలను నా గుండెల్లో పెట్టుకుంటానని వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. బుధవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా కానాల గ్రామంలో వైయస్‌ జగన్‌ రోడ్డు షో నిర్వహించారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. గత మూడు సంవత్సరాల్లో చంద్రబాబు ఎన్నడు నంద్యాల రోడ్డుపై నడవలేదని, మంత్రులు, టీడీపీ నేతలు ఎప్పుడు కనిపించలేదన్నారు. ఇవాళ నంద్యాలకు ఉప ఎన్నిక రావడంతో మంత్రులు, టీడీపీ పెద్ద పెద్ద నాయకులు ఇక్కడ తిష్ట వేశారని విమర్శించారు. ఈ ఉప ఎన్నికలో వైయస్‌ఆర్‌సీపీ తరఫున వైయస్‌ జగన్‌ అనే వ్యక్తి పోటీ పెట్టడంతో అభివృద్ధి అంటూ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఇదే నంద్యాల స్థానాన్ని ఏకగ్రీవంగా వదిలేసి ఉంటే..ఏ మంత్రి ఇక్కడికి వచ్చేవారు కాదన్నారు. చంద్రబాబు ఒక్క రూపాయి కూడా డబ్బులు ఇచ్చేవారు కాదన్నారు.  ఈ ఎన్నిక జరుగబట్టి, వైయస్‌ఆర్‌సీపీ పోటీ పెట్టింది కాబట్టి మోసపూరితమైన జీవోలు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని,  టీడీపీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఎలాంటి అభివృద్ధి చేశారో చెప్పాలని నిలదీశారు.  ఇక్కడ మాత్రం అభివృద్ధి జరిగిస్తున్నట్లుగా చంద్రబాబు ఫోజు కొడుతున్నారని ఫైర్‌ అయ్యారు.

అది బాబు నైజం
చంద్రబాబు నైజం గురించి భూమా నాగిరెడ్డి బావమరిది ఎస్వీ మోహన్‌ రెడ్డి ఇటీవలే చెప్పారని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గుర్తు చేశారు. మా ఎమ్మెల్యే ఎప్పుడు చనిపోతారా, మా నియోజకవర్గాలు ఎప్పుడు అభివృద్ధి చెందుతున్నాయా అంటూ పక్క ప్రాంతాల ప్రజలు అనుకుంటున్నారని ఎస్వీ మోహన్‌ రెడ్డి అన్న మాటలను వైయస్‌ జగన్‌ వివరించారు.  ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క వాగ్ధానాన్ని చంద్రబాబు నెరవేర్చలేదన్నారు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే చంద్రబాబు అధికారంలోకి రావాలన్నారు. ఆయన అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క రైతు రుణాలు మాఫీ కాలేదన్నారు. చిన్న పిల్లలు, చదువుకున్న వారిని వదలలేదు. జాబు రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు, ఒకే వేళ జాబు రాకుంటే రూ.2 వేలు నిరుద్యోగ భృతి అన్నారు. ఎన్నికలు అయ్యాపోయాయి ప్రజలందరిని చంద్రబాబు మోసం చేశారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి హోదాలో మూడేళ్ల క్రితం కర్నూలులో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో చంద్రబాబు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని వైయస్‌ జగన్‌ విమర్శించారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ఒక్క హమీ కూడా నెరవేర్చలేదు. ఇవాళ మళ్లీ ఉప ఎన్నిక జరుగుతుందని టేప్‌ రికార్డర్‌ ఆన్‌ చేశారని ఎద్దేవా చేశారు. ఇంతింత దారుణంగా అన్యాయాలు, మోసాలు చేస్తున్నారని మండిపడ్డారు. 

నాకున్న ఆస్తి విశ్వసనీయతే
చంద్రబాబు మాదిరిగా నావద్ద డబ్బు, అధికారం, లేనిది ఉన్నట్టుగా చూపించే మీడియా లేదని, నాకున్న ఆస్తి నాన్నగారు దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డిపై మీకున్న అభిమానం, అబద్ధమాడడు, మోసం చేయడన్న విశ్వసనీయతే అని వైయస్‌ జగన్‌ స్పష్టం చేశారు. నంద్యాలలో జరుగుతున్న ఎన్నికల్లో మనం వేసే ప్రతి ఓటు కూడా బాబు లాంటి పాలన వద్దు అని ఓటు వేయాలని పిలుపునిచ్చారు. న్యాయానికి, అన్యాయానికి మధ్య జరగుతున్న యుద్ధం...ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతున్న ఉప ఎన్నికల్లో ధర్మం వైపు, న్యాయం వైపు నిలబడాలని సూచించారు. ఇవాళ చంద్రబాబు మాదిరిగా నావద్ద డబ్బు లేదు, అధికారం లేదు. పోలీసులు బలగం లేదు. లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా చూపించే మీడియా లేదన్నారు. నాకున్న ఆస్తి నాన్నగారి మీద మీకున్న అభిమానం. నాన్నగారు అమలు చేసిన ఆ సంక్షేమ పథకాలు మీ గుండెల్లో ఇంకా బతికే ఉండటమన్నారు. వైయస్‌ జగన్‌ అబద్ధం ఆడడు. మోసం చేయడన్న విశ్వసనీయతే నాకున్న ఆస్తి అన్నారు. విలువలతో కూడిన రాజకీయాలు చేయడమే నా లక్ష్యమన్నారు. నవరత్నాలతో నేను కూడా నాన్నలాగే పేదల ఇళ్లలో వెలుగులు నింపుతాడన్న నమ్మకమే నాకున్న ఆస్తి అని వైయస్‌ జగన్‌ పేర్కొన్నారు. 

దోపిడీ సొమ్ము పంచేందుకు వస్తున్నారు
మూడున్నరేళ్ల పాలనలో ప్రజల నుంచి దోచుకున్న డబ్బును నంద్యాల ఉప ఎన్నికలో పంచేందుకు టీడీపీ నేతలు వస్తున్నారని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. అవినీతితో సంపాదించిన డబ్బును విపరీతంగా పంచుతున్నారని ఆరోపించారు. ఇప్పటికే నంద్యాలలో  ట్రాక్టర్లు, కుట్టు మిషన్లు పంచిపెట్టారని విమర్శించారు.  ప్రతి ఒక్కరికి రూ.5 వేలు ఇస్తామంటున్నారు. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని వైయస్‌ జగన్‌ నిలదీశారు. దోపిడీ చేసిన డబ్బుతో ఇవాళ ఓటర్లకు రూ.5 వేల చొప్పున పంచుతున్నారన్నారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు మీ వద్దకు వచ్చి డబ్బులు పంచుతారు. మీతో ప్రమాణం చేయించుకుంటారు. అలాంటప్పుడు చంద్రబాబుకు చెప్పండి. దయ్యాలతో గొడవ పడాల్సిన పని లేదన్నారు. లౌక్యంగా ఈ దుర్భుద్దిని అరికట్టండి అని సూచించారు.

ధర్మానికి ఓటు వేయండి. 
నంద్యాల ఉప ఎన్నికలో ధర్మానికి ఓటు వేయాలని వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. నంద్యాలను నా గుండెల్లో పెట్టుకుంటానని, ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరుగదని హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో మన నవరత్నాలు ప్రతి ఇంటికి చేరాలన్నారు. ఈ పథకాలతో ప్రతి ఇంట్లో కూడా పేదరికం లేకుండా పోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.  ప్రతి రైతు చిరునవ్వుతో బతికే పరిస్థితి వస్తుందన్నారు.  వ్యవస్థ మారాలి. వ్యవస్థను మార్చే దిశగా అడుగులు వేస్తూ మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి పార్లమెంట్‌ను ఒక జిల్లా చేస్తానని ప్రకటించారు. నంద్యాలను జిల్లా హెడ్‌క్వార్టర్‌గా చేస్తానని మాటిచ్చారు. రాబోయే రోజుల్లో జరుగబోయే ఈ యుద్ధంలో ధర్మానికి తోడుగా ఉండండి, న్యాయానికి అండగా ఉండండి  అని కోరారు. మార్పుకు నంద్యాలే నాంది కావాలన్నారు. చంద్రబాబు మోసాలకు మళ్లీ మోసపోకండి. ఇవాళ మనం వేసే ఈ ఓటు చంద్రబాబు మోసాలను మనం ఒప్పుకోవడం లేదని చెప్పండి. మీ ఆశీస్సులు, దీవెనలు శిల్పా మోహన్‌రెడ్డిపై చూపాలని వైయస్‌ జగన్‌ అభ్యర్థించారు.

Back to Top