ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం అవసాన దశకు చేరుకోవడం బాధనిపించింది

 
 
27–05–2018, ఆదివారం
విస్సాకోడేరు, పశ్చిమగోదావరి జిల్లా


ఎంతో ప్రాశస్త్యం కలిగిన పంచారా మాలలో ఒకటైన సోమారామ క్షేత్రము, గోదావరి జిల్లాలకే మకుటాయమానమైన మావుళ్లమ్మ దేవాలయం ఉన్న భీమవరం ప్రాంతంలో పాద యాత్ర సాగిందీ రోజు. స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా సహాయ నిరాకరణోద్యమంలో ఈ ప్రాంతం చూపిన ఉద్యమ స్ఫూర్తిని మెచ్చిన మహాత్మాగాంధీగారు ఈ భీమవరాన్ని రెండో బార్డొలీ అని ప్రశంసించారు. భారతదేశానికి చెందిన వైద్య శాస్త్రజ్ఞులలో అగ్రగణ్యుడు డాక్టర్‌ యల్లాప్రగడ సుబ్బారావు, ప్రపంచ ప్రఖ్యాతిగాం చిన రచయిత, చిత్రకారుడు అడవిబాపిరాజు గారు ఈ ప్రాంతం వారే.

ఇంతటి ప్రసిద్ధిగాంచి, ఆక్వా హబ్‌గానూ పేరొందిన భీమవరం.. నేడు అవినీతి కంపుకొడుతోందని ప్రజలు వాపోతు న్నారు. నేటి పాలనలో దిగజారిన పరిస్థితులు అడుగడుగునా సమ స్యలై తారసపడుతు న్నాయి. దురదృష్టంకొద్దీ వ్యాధి బారినపడి.. చేతి వేళ్లు, కాలి వేళ్లూ ఊడిపోయి.. ఒళ్లు పుళ్లై.. వైకల్యం పొంది.. సమాజపు ఏహ్యభావానికి గురవుతూ ఊరికి దూరంగా కాలనీల్లో ఉండే విధి వంచితులైన కుష్ఠు వ్యాధిగ్రస్తులపై కూడా కర్క శంగా వ్యవహరిస్తున్న ఈ ప్రభుత్వ నిర్వాకాన్ని ఎండగట్టారు లెప్రసీ వ్యాధిగ్రస్తుల సొసైటీ ప్రతినిధులు. వేలి ముద్రలు పడటం లేదని, ఐరిస్‌ మ్యాచ్‌ అవడం లేదని పింఛన్‌లు, రేషన్‌కా ర్డులు తీసేసిన దుర్మార్గం ఈ పాలకులదని ఆక్రో శించారు. నాన్నగారి పాలనలో అంత్యోదయ కార్డులు కూడా ఇచ్చేవారట. వారిని అన్ని విధాలా ఆదుకున్న నాన్నగారిని ఆదర్శంగా తీసుకుని ఇతర రాష్ట్రాలు సైతం ఆచరిస్తూ ఉంటే.. మన రాష్ట్రంలో మాత్రం పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉండటం విషాదం.


నిరుపేద కుటుంబాల్లో విద్యా సౌరభాలను వెదజల్లిన నాన్నగారి అద్భుత పథకం.. ఫీజురీ యింబర్స్‌మెంట్‌పై విస్తృత పరిశోధన చేసి డాక్టరేట్‌ సాధించిన చెల్లెమ్మ అన్నపురెడ్డి ధనలక్ష్మి కలిసినప్పుడు ఎంతో ఆనందం కలిగింది. లక్ష లాది పేద విద్యార్థుల జీవన గమనాన్ని మార్చిన ఆ పథకం గొప్పతనాన్ని, దేశవ్యాప్తంగా దానిని అమలు చేయాల్సిన ఆవశ్యకతను తన పరిశోధన గ్రంథంలో విపులంగా ప్రస్తావించింది. ఆ పథకం నిర్వీర్యమై పోవడంతో పేద విద్యార్థుల విద్య, ఉద్యోగావకాశాలు దారుణంగా దెబ్బతింటున్నాయని.. ఆ కుటుంబాల ఆర్థిక స్థితిగతులపై తీవ్ర ప్రభావం చూపడమేగాక ప్రొఫెషనల్‌ కాలేజీల్లో అడ్మిషన్లు సైతం పడిపోతున్నాయని ఆ పరిశోధ నలో ప్రస్ఫుటమైందట. ‘మీ నాన్నగారితోనే ఆ పథకంవైభవమూ పోయిందన్నా’ అని ఆ పరిశో ధకురాలు చెబుతుంటే.. దానికి నిదర్శనమా అన్నట్టు ఉదయం నన్ను కలిసిన వంశీ అనే సోదరుడు గుర్తొచ్చాడు. పాలిటెక్నిక్‌ కోర్సు పూర్తిచేసిన ఆ దళిత సోదరుడికి రెండో సంవత్సరం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రాలేదట. కోర్సు పూర్తయి రెండేళ్లయినా సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో అప్పులు చేసి ఫీజు కట్టలేక.. ఉద్యోగావకాశాలు కోల్పోతూ.. తీవ్ర మనో వేదనకు గురయ్యాడట. అంతటి గొప్ప పథకం ఈ ప్రభుత్వ నిర్వాకంతో అవసాన దశకు చేరుకోవడం మనస్సుకెంతో బాధనిపించింది.

ఈ రోజు నన్ను కలిసిన డయాలసిస్‌ టెక్నీషియన్లు, థెరపిస్టులు.. రెండు కిడ్నీలూ పాడైపోయి ప్రభుత్వాస్పత్రులలో సేవలందక నరకయాతనపడుతున్న పేద రోగుల దీనస్థితిని కళ్లకు కట్టారు.  ప్రభుత్వాస్పత్రులలో డయాలసిస్‌ మెషీన్లు సరిపడా లేవు. ఉన్నవీ సరిగా పనిచేయవని, నిపుణులైన టెక్నీషియన్లు లేరని, నెఫ్రాలజిస్టులు అసలే ఉండరని చెప్పారు. అత్యవసర సేవలు దొరకవు. పరిస్థితి విషమిస్తే ఆశలు వదులుకోవాల్సిందే.. అని వారు చెబు తుంటే మనసంతా కలచివేసినట్లైంది.

ఇక ప్రయివేటు ఆస్పత్రులను ఆశ్రయిద్దామంటే.. ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతోచాలా చోట్ల ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేశారట. ఉన్న చోటేమో నాసిరకం సేవలే అందుతున్నాయట. నెలకు దాదాపు 3000 డయాలసిస్‌లు అవస రమైన భీమవరం ప్రాంతంలో కేవలం 1700 మాత్రమే జరుగుతున్నాయంటే పరిస్థితి తీవ్రత అర్థమవుతోంది. డయాలసిస్‌ సేవలందక చాలా మంది రోగులు మరణిస్తున్నారంటే.. ఎంతటి దయనీయ పరిస్థితి నెలకొందో అవగతమవు తోంది. ఇక ఆ వ్యాధిగ్రస్తులకు ఇచ్చే పింఛన్‌ల మాట దేవుడికే ఎరుక. వేతన భద్రతలేక, ఆరోగ్య భద్రతా లేక.. తాము సైతం పేషెంట్లలానే దీన స్థితిలో ఉన్నామని.. ఈ పరిస్థితులన్నీ చక్కబడే రోజులొస్తాయని ఎదురుచూస్తున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు. 

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. నాన్నగారు ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం నిరుపేద కుటుంబాల అభ్యున్నతి కోసం ఉద్దేశించినదని తెలిసి కూడా నిర్లక్ష్యం చేస్తున్నారంటే.. వారి పట్ల మీకు చిత్తశుద్ధి లేదన్నది వాస్తవం కాదా? ఆ వర్గాల పట్ల మీరు చూపుతున్నది కపట ప్రేమ కాదా?
-వైయ‌స్‌ జగన్‌



 

తాజా వీడియోలు

Back to Top