ప్రభుత్వ వైఫల్యంపై ధర్నాకొత్త మాజేరు జ్వర బాధితులకు బాసటసర్కారు తీరుని నిరసించిన వైఎస్సార్ సీపీ నేతలు
మచిలీపట్నం: కృష్ణా జిల్లా ముఖ్య కేంద్రం మచిలీపట్నంలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఈ ధర్నాకు నాయకత్వం వహించారు. ప్రభుత్వ వైఫల్యాల్ని నాయకులు కళ్లకు కట్టినట్లు ప్రజలకు వివరించారు. పెద్ద ఎత్తున జనం తరలి రావటంతో బందరు కలెక్టరేట్ కిటకిట లాడింది.
ప్రభుత్వ ఘోర వైఫల్యంకృష్ణా జిల్లా కొత్త మాజేరు గ్రామం కొన్ని రోజులుగా విష జ్వరాలతో వణికి పోతోంది. అక్కడ సురక్షిత తాగునీరు లేక కలుషిత నీటితో గొంతు తడుపుకొంటున్నారు. విష జ్వరాలు మొదలైనప్పటికీ ప్రభుత్వం వైపు నుంచి సమగ్రమైన చర్యలు లేవు. దీంతో ఒక్కరొక్కరుగా ప్రాణాలు విడిచారు. రెండున్నర నెలల కాలంలో 19 మంది చనిపోయారు. ఈ సంగతి తెలుసుకొని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఆ గ్రామంలో పర్యటించారు. వెంటనే వైద్య చికిత్స అందించాలని, మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులు హడావుడి చేసిన ప్రభుత్వం తర్వాత ఆ విషయం పట్టించుకోవటం మానేసింది.
బాధితులకు వైఎస్సార్‌సీపీ బాసటబాధితుల తరపున వైఎస్సార్‌సీపీ పోరాటం సాగించింది. ఇందులో భాగంగా బందరులో ధర్నా ఏర్పాటు చేసింది. కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన ధర్నా కు పెద్ద ఎత్తున జనం తరలి వచ్చారు. వైఎస్సార్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, స్థానికులు తరలి వచ్చి కొత్త మాజేరు గ్రామస్తులకు బాసటగా నిలిచారు. గ్రామంలో నెలకొన్న పరిస్థితుల్ని తెలియచెప్పారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ నాయకులు బాధితులకు అండగా నిలిచారు.
ప్రభుత్వ పెద్దలకు పట్టదా..!చల్లపల్లి మండలం కొత్త మాజేరు లో గ్రామస్తులు చనిపోతే బందరు ఎమ్మెల్యే, రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర బాద్యత లేకుండా మాట్లాడుతున్నారని పార్టీ అధికార ప్రతినిధి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమతో పాటు మంత్రి వస్తే కొత్త మాజేరు వెళదామని, గ్రామస్తులనే అడుగుదామని ఆయన అన్నారు. తాగడానికి నీళ్లు లేకపోయినా, బడ్డీ కొట్టులో బ్రాందీ మాత్రం దొరుకుతోందని తెలుగుదేశం పాలన తీరుని ఆయన ఎండగట్టారు.
ఈ ధర్నా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిపించే విధంగా ఉందని గన్నవరం నియోజక వర్గం ఇంఛార్జ్ దుట్టా రామచంద్రారావు అబిప్రాయ పడ్డారు. రాష్ట్రంలో విష జ్వరాలు ప్రబలుతున్నాప్రభుత్వానికి ఏమాత్రం పట్టడం లేదని ఆయన అన్నారు. వైద్య ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాసరావు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి తొత్తుగా వ్యవహరిస్తున్నారని పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ మండిపడ్డారు. ఎవరికీ ఏ రోగాలు రాలేదని చెబుతున్నారని విమర్శించారు.