పాలకుల వైఖరికి నిరసనగా నిరాహారదీక్ష

() మే నెల 16, 17, 18  తేదీల్లో వైఎస్ జగన్ నిరాహార దీక్ష
() క్రిష్ణా డెల్టా పరిరక్షణ కోసం, తాగు సాగునీటి అవసరాల కోసం ఉద్యమ బాట
() స్వయంగా నిరాహార దీక్ష చేయనున్న ప్రతిపక్ష నేత

హైదరాబాద్) కృష్ణా నది నుంచి దిగువ ప్రాంతాలకు వాటా మేరకు నీరు అందించాలని కోరుతూ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ దీక్ష చేయనున్నారు. వచ్చే నెల 16, 17, 18 తేదీల్లో కర్నూలు వేదికగా నిరాహార దీక్ష చేస్తున్నారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లోని కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్ ఏమన్నారో ఆయన మాటల్లోనే చూద్దాం.

          రాష్ట్ర ప్రభుత్వం నిలదీయాల్సిన విషయాల్లో నిలదీయకుండా ఉండని కారణంగా, పట్టించుకోవాల్సిన అంశాల్ని పట్టించుకోకుండా వదిలేసిన పరిస్థితుల్ని చూస్తున్నాం. రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. జరుగుతున్న అన్యాయాల్ని ప్రశ్నించే పరిస్థితి లేదు.

          ప్రత్యేక హోదా వస్తుందా, రాదా అన్న విషయంలో అనుమానాలు ఉన్నాయి. నిన్న పార్లమెంటులో జరిగిన విషయం చూస్తే, దాన్ని పేపర్లు రిపోర్టు చేసిన వార్తల్ని చూస్తే ఈ అనుమానాలు మరింత పెద్దవి అయ్యేట్లుగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం లేదు అన్నట్లుగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మాట్లాడారు. కేంద్ర మంత్రి అంత ధైర్యంగా ఎలా మాట్లాడగలుగుతున్నారు. ఎందుకంటే ఇక్కడి పాలకుల్లో ప్రత్యేక హోదా గురించి అడిగే నాథుడు కరవు అయ్యాడు. ఎన్నికలప్పుడు ఏం చెప్పారు, ఈ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించేటప్పుడు ఏం చెప్పారు అనేది గుర్తు చేసుకోవాలి. ఎన్నికల సమయంలో మ్యానిఫెస్టో విడుదల చేశారు. రాష్ట్రాన్ని విభజించే సమయంలో కాంగ్రెస్, బీజేపీ ఏకం అయ్యాయి. తెలుగుదేశం ముఖ్య పాత్ర పోషించింది. పార్లమెంటులో ఓట్లేయించి మరీ దగ్గర ఉండి విడగొట్టారు. అప్పుడు జరిగిన చర్చలో ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరుగుతోంది కాబట్టి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇవ్వటం జరిగింది. ఎన్నికల ప్రచారంలో టీడీపీ, బీజేపీ నేతలు చెప్పారు. మ్యానిఫెస్టో లో చెప్పారు. ప్రత్యేక హోదా అన్నది ఐదేళ్లు కాదు, పదేళ్లు తెస్తాం అని చెప్పారు.

ప్రత్యేక హోదా కారణంగా పరిశ్రమలు వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. హోదా అంటూ ఉంటే పారిశ్రామిక వేత్తలకు ఆదాయపు పన్ను లో మినహాయింపు ఉంటుంది. సుంకాల్లో మినహాయింపు ఉంటుంది. విద్యుత్ లో రాయితీ ఇస్తారు. పరిశ్రమల నుంచి చేసే రవాణాలో రాయితీ దొరకుతుంది. ఇన్ని రకాల సౌకర్యాలు, ఉపశమనాలు ప్రత్యేక హోదా ఉంటే మాత్రమే వస్తాయి. లేదంటే రావు. అప్పుడు చంద్రబాబు ఎక్కడకు తిరగాల్సిన అవసరం లేదు. పారిశ్రామిక వేత్తలు ఇక్కడకే క్యూ కడతారు. లక్షల ఉద్యోగాలు, కోట్ల రూపాయిల పెట్టుబడులు తరలి వస్తాయి. ఇన్ని రకాల ప్రయోజనాలు వస్తాయని తెలిసి కూడా, హోదా గురించి పట్టించుకోకుండా మన జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు.
ఎన్నికల సమయంలో ఇద్దరు నేతలు కలిసి ఉపన్యాసాలు ఇచ్చి ఊదర గొట్టారు. అప్పుడేమో ప్రత్యేక హోదా ఇస్తాం, తెస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చాక ప్రత్యేక హోదా ఏమీ సంజీవని కాదు అంటారు, కోడలే మగపిల్లాడ్ని కంటానంటే అత్త వద్దంటుందా అంటూ సెటైర్లు వేస్తారు. హోదాతోనే స్వర్గం అయిపోదు అని కామెంట్లు చేస్తారు. చంద్రబాబు ఒక పద్ధతి ప్రకారం, వ్యూహం మేరకు ప్రత్యేక హోదాను నీరుగారుస్తూ వచ్చారు. స్పష్టంగా చెప్పాలంటే ప్రత్యేక హోదా అనేది అవసరం లేదు అని చంద్రబాబు అంటున్నారు కాబట్టే కేంద్ర మంత్రులు పార్లమెంటులో ధైర్యంగా హోదా అవసరం లేదని చెప్పే పరిస్థితి వచ్చింది.

చంద్రబాబు ఎందుకు ధైర్యంగా నిలదీయటం లేదు. కేంద్రం ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరటం లేదు. పోలవరం, రైల్వే జోన్ వంటి అంశాల మీద ఎందుకు పోరాడటం లేదు. కేంద్రం నుంచి మంత్రుల్ని ఉపసంహరించుకుంటామని ఎందుకు అల్టిమేటమ్ ఇవ్వలేక పోతున్నారు. ఎందుకంటే చంద్రబాబు ఈ రాష్ట్రాన్ని పూర్తిగా అమ్మేస్తున్నారు. తన మీద ఉన్న ఓటుకి కోట్లు కేసు కి సంబంధించి, ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ఆడియో, వీడియో టేపులతో సహా దొరికి పోయిన కేసుల్లోంచి బయట పడేందుకు కేంద్రాన్ని నిలదీసే పరిస్థితి లేదు. అవినీతి కేసల నుంచి బయట పడేందుకు రాష్ట్రాన్ని పణంగా పెట్టారు. రాష్ట్ర ప్రయోజనాలు పణంగా పెట్టారు. కేంద్రాన్ని హామీల అమలు గురించి నిలదీయలేని పరిస్థితి. ప్రధానమంత్రిని అడిగే పరిస్థితి, ధైర్యం లేనే లేవు. ఒక వైపు కరువు తాండవిస్తోంది. కానీ సహాయ చర్యలు, నివారణ చర్యలు చేపట్టే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదు.

పాలమూరు..రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, డిండి పథకం ద్వారా 115 టీఎమ్ సీ ల నీటిని తీసుకొని పోయేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. చంద్రబాబు ఎందుకు నిలదీయటం లేదు. ఎందుకు ఆపే ప్రయత్నం చేయటం లేదు. కృష్ణా నదిలో నీళ్లు శ్రీశైలం ప్రాజెక్టుకి రావాలంటే మహబూబ్ నగర్ నుంచే రావాలి. ఈ సంగతి అందరికీ తెలుసు. ఆ తర్వాతే దిగువన ఉన్న నాగార్జున సాగర్ కు, క్రిష్ణా డెల్టాకు పోతుంది. కానీ మహబూబ్ నగర్ దగ్గరే లిఫ్టులు పెట్టి 115 టీఎమ్ సీల నీళ్లు తీసుకొని పోతుంటే ఆపేందుకు కూడా మాట రావటం లేదు. కింద ఉన్న రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, నల్గొండ, ఖమ్మం జిల్లాల ప్రజలు ఎలా బతకాలి. రాయలసీమ, దక్షిణ కోస్తా మాత్రమే కాదు తెలంగాణకు చెందిన నల్గొండ, ఖమ్మం జిల్లాలు కూడా నష్టపోతాయి.

గోదావరి నది మీద ప్రాణహిత, ఇంద్రావతి వంటి ఉపనదులు మీద పంపులు పెట్టి నీటిని తోడుతున్నారు. నీరు వచ్చే మార్గంలో అడ్డుకొంటే ఎందుకు నిలదీయటం లేదు. అదేమీ చేయకుండా పట్టి సీమ పథకాన్ని తెచ్చారు. ఎటువంటి నిల్వ సామర్థ్యం లేని పట్టిసీమతో ప్రయోజనం ఏమిటి. కేవలం శబరి నదిలో నీరు పొంగినప్పుడు, తెలంగాణ లో అంతా తోడేసుకొని ఎక్కువ అయ్యాయంటూ నీరు వదిలేసినప్పుడు మాత్రమే నీరు దొరకుతుంది. అది కూడా జూలై, ఆగస్టు, సెప్టెంబర్ లలో నీటిని తోడుకొనే పరిస్థితి. బహుళ ప్రయోజనాలు ఉన్న పోలవరం ప్రాజెక్టు కట్టుకొంటే 190 టీఎమ్ సీ ల నీటిని ఆపుకోవచ్చు. ఆ పనులు చూస్తే నత్త నడకన నడుస్తున్నాయి. కట్ట పనులు 2శాతం, కాంక్రీట్ పనులు 4శాతం మాత్రమే పూర్తి అయ్యాయి. పోలవరం అన్నది పూర్తిగా స్కాముల ప్రాజెక్టుగా మారిపోయింది. పెట్రోల్, డీజీల్ ధరలు అదుపులో ఉన్నాయి, ఇసుక ఉచితంగా వస్తోంది. స్టీల్ రేట్లు తగ్గుముఖం పట్టాయి. అయినా సరే నాలుగు వేల నుంచి 7వేలకు పెంచేసి మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చేశారు. ఇంత ఆలస్యంగా పనులు చేస్తున్న కాంట్రాక్టర్ ను బ్లాక్ లిస్టు లో పెట్టాల్సింది పోయి సబ్ కాంట్రాక్టర్లను తెచ్చుకొని పనులు చేయించుకోండి అంటూ క్యాబినెట్ లో తీర్మానాలు చేస్తున్నారు. ఇంత భారీ స్థాయిలో స్కాములు చేస్తుంటే భయపడిపోయి కేంద్రం నిధులు ఇవ్వటం లేదు.

          పట్టి సీమ తో దమ్మిడి ఉపయోగం లేదు. గోదావరి నీటి వినియోగ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాల్లో 7ఈ, 7ఎప్ చూపించి తెలంగాణ ప్రభుత్వం దులిపేసే పరిస్థితి ఉంది. అందుకే తెలంగాణ ఎత్తిపోతల పథకాల గురించి ఏమాత్రం అడగటం లేదు. పట్టిసీమ తో చంద్రబాబు ఏ మేరకు నష్టం చేకూర్చాడు అన్నది అంతా ఆలోచించుకోవాలి.
          శ్రీశైలం ప్రాజెక్టులో 854 టీఎమ్ సీల కన్నా ఎక్కువగా నీరు చేరితేనే పోతిరెడ్డి పాడు ద్వారా రాయలసీమకు నీటి చుక్క వస్తుంది. కానీ ఇప్పుడు అక్కడ ఉన్న నీటిమట్టం 780 టీఎమ్సీలు. అటువంటప్పుడు నీరు నిండేది ఎప్పుడు, ఆ నీరు శ్రీశైలం నుంచి రాయలసీమ నెల్లూరు ప్రకాశం జిల్లాలకు వెళ్లేది ఎప్పుడు, దిగువకు ప్రవహించి నాగార్జున సాగర్ నుంచి గుంటూరు, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు నీరు ఎప్పుడు చేరతాయి. ఇవేమీ పాలకులు పట్టించుకోవటం లేదు.

          పోలవరం ప్రాజెక్టుని నీరుకారుస్తున్నారు. అందుకే గోదావరి, కృష్ణా నదుల వినియోగం గురించి వాటర్ బోర్డు లు వేయాలని అప్పట్లో చెప్పారు. కానీ ఈ విషయం మీద చంద్రబాబు గట్టిగా నిలదీయటం లేదు. అందుకే చంద్రబాబు వైఖరికి నిరసనగా, కృష్ణా ఆయకట్టు, గోదావరి ప్రాంతాల ప్రయోజనం కోసం వచ్చే నెల 16, 17, 18 తేదీల్లో కర్నూలు వేదికగా దీక్షకు కూర్చొంటున్నాను. అంతా సహకరించండి.
          అని వైఎస్ జగన్ వివరించారు. 
Back to Top