నెల్లూరు: ప్రత్యేక హోదా మీద చంద్రబాబు చేస్తున్న మోసాలపై ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపడ్డారు. ఈ విషయంలో కేంద్రంతో లాలూచీ పడ్డారని విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్య చేసుకొన్న లక్ష్మయ్య కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. ఉదయం హైదరాబాద్ నుంచి తిరుపతికి విమానంలో చేరుకొన్నారు. అక్కడ ఆయనకు చిత్తూరు జిల్లా పార్టీ నాయకులు స్వాగతం పలికారు. అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా నెల్లూరు జిల్లాకు ఆయన తరలి వెళ్లారు. అక్కడ లక్ష్మయ్య కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వారికి తమ పార్టీ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఆత్మహత్యలకు పాల్పడవద్దని, ఐక్యంగా పోరాడి ప్రత్యేక హోదాను సాధించుకొందామని పిలుపు ఇచ్చారు. \<br/>ఎన్నికల్లో గెలవటానికి తెలుగుదేశం, బీజేపీ అనేక వాగ్దానాలు చేశారని వైఎస్ జగన్ గుర్తు చేశారు. మరి ఇప్పుడు చంద్రబాబు ఎందుకు ఈ విషయంలో మభ్య పెడుతున్నారని ఆయన అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తో గంటన్నర పాటు మాట్లాడానని చంద్రబాబు అంటున్నారని, మరి ఏ ఏ విషయాలు మాట్లాడారని ఆయన నిలదీశారు. గంటన్నర భేటీ తర్వాత ప్రత్యేక హోదా మీద నామ మాత్రపు ప్రకటన కూడా బయటకు రాలేదని ఆయన చెప్పారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ సీపీ ఇచ్చిన బంద్ ను విజయవంతం చేయాలని ఆయన పిలుపు ఇచ్చారు.