ప్రజాసంకల్పయాత్ర @ 500 కిలో మీటర్లు


-
- అడుగుకో బాధ.. ఇంటికో వ్యథ
- దారిపొడవునా జనమే జనం
- దిగ్విజయంగా ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌

 అనంత‌పురం:  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర దిగ్విజ‌యంగా కొన‌సాగుతోంది. అశేష ప్రజాదరణతో జ‌న‌నేత అడుగులు ముందుకు వేస్తున్నారు. 36వ రోజు అనంత‌పురం జిల్లా గొట్లూరు వ‌ద్ద వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర 500 కిలోమీట‌ర్ల మైలు రాయిని దాటింది.  అవ్వాతాతల దీవెనలు.. అక్కాచెల్లెళ్ల మంగళహారతులు.. యువత కేరింతలు.. అలసిన పాదాలకు ఊరూరా ముద్దబంతుల పాన్పులు.. అన్నొస్తున్నాడు.. అంటూ పిల్లా పాపలు మొదలు అన్ని వర్గాల ప్రజలు జననేతకు బ్రహ్మరథం పడుతున్నారు.  పాదయాత్ర సాగిన రహదారికి ఇరువైపులా కిలోమీటర్ల దూరం నుంచి జనం భారీగా తరలి వచ్చారు. దారిపొడవునా జనమే జనం.. మిద్దెలు, మేడలు కిక్కిరిసిపోయాయి.   కేరింతలతో యువత..మా రాజన్న బిడ్డే అంటూ అవ్వా తాతలు, అడిగో అన్న  అంటూ అక్కా చెల్లెళ్లు జగన్‌ వద్దకు వెళ్లి కరచాలనం చేయడానికి పోటీపడుతున్నారు.  కూలీలు, రైతులు పనులు మానేసి మరీ గంటల తరబడి తమ అభిమాన నేత కోసం వేచి చూసి ఆత్మీయతను చాటుకున్నారు. చిరునవ్వుతో మాట కలుపుతూ.. కరచాలనం చేస్తూ.. అందరికీ అండగా ఉంటానని భరోసా కల్పిస్తూ వైయ‌స్ జగన్‌ ముందుకు సాగుతున్నారు.   

అదే ఆద‌ర‌ణ‌..అదే ఉత్సాహం
ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేంద‌కు న‌వంబ‌ర్ 6న వైయ‌స్ఆర్‌ జిల్లా ఇడుపుల‌పాయ‌లో ప్రారంభ‌మైన ప్రజాసంకల్పయాత్ర విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. మొద‌టి రోజు నుంచి ఇవాళ 36వ రోజు వ‌ర‌కు కూడా ప్ర‌జ‌లు రాజ‌న్న బిడ్డ‌పై అదే ఆద‌ర‌ణ‌, ఆప్యాయ‌త‌, ప్రేమానురాగాలు  చూపుతున్నారు. వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర వైయ‌స్ఆర్ జిల్లా నుంచి  నవంబర్ 14న కర్నూలు జిల్లాలోకి ప్రవేశించింది. క‌ర్నూలు జిల్లా ఆళ్లగ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గం చాగ‌ల‌మ‌ర్రి మండ‌లంలో 100 కిలోమీటర్లు మైలురాయి, డోన్ నియోజ‌క‌వ‌ర్గంలోని ముద్ద‌వ‌రం గ్రామం వ‌ద్ద‌ 200 కిలోమీట‌ర్ల మైలు రాయిని దాటారు. అదే జిల్లా ఎమ్మిగ‌నూరు నియోజ‌క‌వ‌ర్గంలోని బి. అగ్ర‌హారం గ్రామం వ‌ద్ద 300 కిలోమీట‌ర్లు పూర్తి చేసుకున్న జననేత అనంత‌పురం జిల్లా గుమ్మేపల్లిలో 400 కిలోమీట‌ర్ల మైలురాయిని చేరుకున్నారు. ఇవాళ ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో గొట్లూరు వ‌ద్ద 500 కిలోమీట‌ర్ల మైలు రాయిని వైయ‌స్ జ‌గ‌న్ దాటారు. ప్ర‌తి వంద కిలోమీట‌ర్ల వ‌ద్ద వైయ‌స్ జ‌గ‌న్‌కు అక్క‌డి ప్ర‌జ‌లు ఆత్మీయ స్వాగ‌తం ప‌లికారు. రంగు రంగుల ముగ్గులు వేసి, పండుగ చేసుకున్నారు. ఇందుకు గుర్తుగా జ‌న‌నేత వంద కిలోమీట‌ర్ల వ‌ద్ద మొక్క‌లు నాటారు. 

అన్నా..మీరు రావాలి
వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా యాత్ర‌లో అడుగుకో బాధ‌..ఇంటికో వ్య‌థ వినిపిస్తోంది. ఎవ‌రిని ప‌ల‌క‌రించిన చంద్ర‌బాబు మాట‌లు న‌మ్మి మోస‌పోయామ‌ని వాపోతున్నారు. దారిపొడవునా జనం విన్నపాలు వినిపిస్తుంటే.. సావధానంగా వింటూ.. భరోసానిస్తూ జననేత ముందుకు సాగుతున్నారు. ప్ర‌తి ఒక్క‌రూ అన్నా మీరు రావాలి.. రాజన్న రాజ్యం తేవాలి.. అంటూ నిన‌దిస్తున్నారు.  జ‌నం బాధ‌లు వింటున్న వైయ‌స్ జ‌గ‌న్  అంద‌రిని ఓదార్చుతూ..ధైర్యం చెబుతూ.. ఏడాది ఆగితే రాజన్న రాజ్యం వస్తుందంటూభ‌రోసా క‌ల్పిస్తూ ముందుకు సాగుతున్నారు.   
Back to Top