మీ పాలనే తెస్తానని చెప్పే దమ్ముందా?

మదనపల్లి (చిత్తూరు జిల్లా) :

సమైక్యాంధ్ర నినాదంతో తాను ప్రజల్లోకి వెళ్ళి 30 ఎంపీ సీట్లు గెలుచుకుంటానని, రాష్ట్ర విభజన సరి కాదని చెప్పి ఎన్నికలకు వచ్చే దమ్ము, ధైర్యం కాంగ్రెస్, టీడీపీలకు ఉన్నాయా? అని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సవాల్‌ చేశారు. ప్రస్తుత తరుణంలో కుప్పం నుండి శ్రీకాకుళం వరకూ రాష్ట్ర ప్రజలంతా సమైక్యాంధ్ర నినాదమే ప్రతిధ్వనిస్తోందన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఆనందంతో జీవించిన మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి నాటి సువర్ణ యుగాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు తాను మళ్ళీ అందిస్తానని శ్రీ జగన్‌ పేర్కొన్నారు. సమైక్య శంఖారావం యాత్రలో భాగంగా సోమవారంనాడు శ్రీ జగన్‌ చిత్తూరు జిల్లా మదనపల్లిలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఉద్వేగభరితంగా ప్రసంగించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేవారినే ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెడతాం అన్నారు.

ప్రధాని పదవిలో తన కుమారుడు రాహుల్‌ గాంధీని చూసుకోవడం కోసం ప్రజల సెంటిమెంట్‌ను అస్సలు పట్టించుకోకుండా సోనియా గాంధీ మన రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించడానికి సిద్ధపడ్డారని శ్రీ వైయస్‌ జగన్‌ ఆరోపించారు. మన పిల్లల భవిష్యత్తుతో సోనియా ఆడుకుంటున్నారని విమర్శించారు. సోనియా గాంధీతో కుమ్మక్కయిన చంద్రబాబు నాయుడు విభజనకు అన్ని విధాలుగా వత్తాసు పలుకుతున్నారని దుయ్యబట్టారు. వీర విధేయుడైన‌ సీఎం కిరణ్‌ కుమార్‌రెడ్డి కూడా ప్రజల సెంటిమెంటుకు ప్రాధాన్యం ఇవ్వకుండా సోనియా గాంధీ చెప్పినట్టల్లా చేస్తున్నారని ఆరోపించారు.

'టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఎన్నికలలో లబ్ధి పొందడానికి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని శ్రీ జగన్ ‌ఆరోపించారు. ప్రజలకు ఏవేవో ఎన్నికల హామీలు ఇస్తున్నారన్నారు. అయితే ప్రజల్లోకి వెళ్లి మీ తొమ్మిదేళ్ల పాలన తిరిగి తెస్తానని ప్రజలకు చెప్పగలవా?’ అని చంద్రబాబును శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి సవాల్ ‌చేశారు. గతంలో ఎన్నికలకు ముందు తాను ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా.. ఎన్టీఆర్ పథకాలను కూడా తుంగలో తొక్కిన ఘనత చంద్రబాబుదే‌ అని విమర్శించారు.

2014లో తాను అధికారంలోకి వచ్చిన తరువాత దివంగత మహానేత డాక్టర్ వై‌యస్‌ఆర్ సువర్ణ యుగాన్ని మళ్లీ తీసుకొని వస్తానని‌ శ్రీ జగన్మోహన్‌రెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు. రాజన్న రాజ్యంలో ప్రతి పేదవాని గుండె చప్పుడు వింటానని, ప్రతి పేదవాని మనసు తెలుసుకుంటానని భరోసా ఇచ్చారు. ‘నేను మరణించిన తరువాత కూడా ప్రతి పేదవాడి ఇంట్లో నాన్న ఫొటో పక్కన నా ఫొటో కూడా పెట్టుకునేంతలా పేదవాడి కోసం కృషి చేస్తాను’ అన్నారు.

అందరి నోటా జై సమైక్యాంధ్రే :
ఇప్పుడు ప్రతి గొంతు ఒకే ఒక మాట మాట్లాడుతోందని, ప్రతి మనసు ఒకే ఒక్క ఆలోచనతో ఉద్యమ బాట పట్టిందని శ్రీ జగన్‌ అన్నారు. ఆ ఒకే ఒక్క మాట ‘జై సమైక్యాంధ్ర’ అన్నారు. ఈ గడ్డ మీద పుట్టిన చంద్రబాబుకు, కిరణ్‌కుమార్‌రెడ్డికి మాత్రం ఆ మాట అర్థం కావట్లేదని ఆయన వ్యాఖ్యానించారు. సోనియా చేస్తున్న అడ్డగోలు విభజనను కళ్లుండీ కబోదుల్లా నాటకం ఆడుతున్న చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డిలకు ఎలా చెప్పాలి? అని ప్రశ్నించారు.

దివంగత మహానేత వైయస్ఆర్ బతికి ఉన్నప్పుడు ‌మనకు సువర్ణయుగాన్ని ఇచ్చారు. ఆ యుగంలో ఎవ్వరూ విడిపోదాం అని అడిగే అవకాశం లేకుండా రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపించారన్నారు. మహానేత మరణించిన తరువాత రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థ ఎంతలా దిగజారిపోయిందంటే.. నిజాయితీ కరవైందని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ర్టమంతటా సమైక్య ఉద్యమ బాట పడితే మొన్న తిరుపతి సభలో చంద్రబాబు నాయుడు ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించేలా మాట్లాడిన తీరు చూస్తే.. ఆయనా ఒక నాయకుడేనా? అనిపిస్తోందన్నారు.

తొమ్మిదేళ్ళు పరిపాలించినప్పుడు 8 సార్లు కరెంటు చార్జీలు పెంచిన చంద్రబాబు ఇప్పుడు కరెంటు చార్జీలు తగ్గిస్తారట.. ఆయన మామ ఎన్టీఆర్ రూ.2కే కిలో బియ్యం ఇస్తే దాన్ని రూ 5.25 చేసింది ‌చంద్రబాబు కాదా? మద్యపానాన్ని నిషేధిస్తామని ఎన్నికలకు వెళ్లి.. ఎన్నికలయ్యాక మాట మార్చలేదా? గ్రామగ్రామాన బెల్టు షాపులు పెట్టించలేదా? ఇదీ చంద్రబాబు విశ్వసనీయత అని విమర్శించారు. చంద్రబాబు హయాంలో అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఉచిత కరెంటు ఇవ్వాలని ప్రతిపక్షాలు అడిగినప్పుడు చంద్రబాబు అసంబద్ధ వ్యాఖ్యలు చేశారని అన్నారు. ఉచిత కరెంటు ఇస్తే ఈ తీగలు మీద బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుందని చంద్రబాబు వెటకారం చేసిన వైనాన్ని గుర్తుచేశారు.

సువర్ణయుగం అంటే అదే :
అవ్వా తాతల పెన్షన్ గురించి‌ చంద్రబాబు ఇప్పుడు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని శ్రీ జగన్‌ వ్యాఖ్యానించారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు అవ్వా తాతలకు ముష్టి వేసినట్లు కేవలం రూ. 70 మాత్రమే పెన్షన్లు ఇచ్చేవారన్నారు. ఒక ఊళ్లో ఎవరైనా ఒక పింఛన్‌దారు చనిపోతే గాని మరొకరికి ఇవ్వని దుస్థితి ఉండేదన్నారు. 16 లక్షలు ఉన్న పెన్షన్లను దివంగత మహానేత డాక్టర్‌ వైయస్ఆర్ ఏకంగా 71 లక్షలకు ‌పెంచారన్నారు. రూ. 70 ఇచ్చే పెన్షన్‌ను రూ. 200 పెంచి అవ్వా తాతల గుండెల్లో మహానేత కొలువయ్యారన్నారు. రామరాజ్యం అంటే సువర్ణ యుగం అంటే అదే అన్నారు.

Back to Top