చంద్రబాబుకు వైఎస్ జగన్ సవాల్

()రాజధానిలో భూ ఆక్రమాలపై విచారణకు సిద్ధమా బాబు
()భూముల దురాక్రమణ ఇన్ సైడర్ ట్రేడింగ్ కన్నా దారుణమైన నేరం
()రెండెకరాలే ఉందన్న బాబుకు లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి

అసెంబ్లీః రాజధానిలో జరిగిన భూఅక్రమాల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇన్‌సైడెడ్ ట్రేడింగ్‌ కన్నా దారుణమైన నేరానికి పాల్పడ్డారని ప్రతిపక్ష నాయకుడు, వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి ధ్వజమెత్తారు. రాజధాని భూముల కొనుగోళ్ల విషయంలో చంద్రబాబే పెద్ద దోషి అని అన్నారు. భూ అక్రమాలపై సీబీఐ విచారణకు సిద్ధమా అని ఆయన ప్రభుత్వానికి సవాల్ విసిరారు. రాజధాని అమరావతిలో ప్రభుత్వం భూ అక్రమాలపై  అసెంబ్లీలో చర్చ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడారు.

ఫలానా చోట రాజధాని వస్తుందని ముందే తన బినామీలకు చెప్పి చంద్రబాబు భూములు కొనుగోలు చేయించారని వైఎస్ జగన్ కడిగిపారేశారు. చంద్రబాబు తన కేసుల గురించి మాట్లాడడం విడ్డూరమని వైఎస్ జగన్ ఎత్తిపొడిచారు. చంద్రబాబు, కాంగ్రెస్ తో కుమ్మక్కై తనపై కేసులు పెట్టించారని ఫైరయ్యారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నంతవరకు తనపై కేసులు లేవని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్, చంద్రబాబు కలిసి తనను కేసుల్లో ఇరికించారని మండిపడ్డారు.

1978లో రాజకీయాల్లోకి వచ్చినప్పుడు చంద్రబాబు ఆస్తి కేవలం రెండు ఎకరాలు మాత్రమేనని.. ఆయనకు ఇప్పుడు లక్షల కోట్ల ఆస్తులు ఇప్పుడు ఆయనకు ఎక్కడి నుంచి వచ్చాయని నిలదీశారు. చంద్రబాబు ఆస్తులపై సీబీఐ విచారణకు సిద్ధమా? అని వైఎస్ జగన్‌ సవాల్ విసిరారు. ఆస్తులపై విచారణ జరుపకుండా స్టే తెచ్చుకున్న ఘనత చంద్రబాబుదని దుయ్యబట్టారు. 
 
Back to Top