నేరాలు చేసినా చంద్రబాబు రైటట..?

  • ఎవరు ప్రశ్నించినా తప్పట..?
  • ఎన్నికలప్పుడే బాబుకు ప్రజలు గుర్తుకు వస్తారు
  • బాబు ఎన్ని మోసాలు చేసినా ఏమీ అడగకూడదట
  • డబ్బుల మూటలతో వస్తాడు..లౌక్యంగా వ్యవహరించండి
  • మనసులో దేవుడిని తలచుకొని ధర్మం వైపు నిలబడండి
  • వైయస్సార్సీపీని ఆశీర్వదించండి..శిల్పాను గెలిపించండి
  • రేపటి కురుక్షేత్ర సంగ్రామానికి నంద్యాల ఎన్నిక నాంది కావాలి
  • పోలూరు ప్రచారంలో ప్రజలకు వైయస్ జగన్ విజ్ఞప్తి
పోలూరుః నంద్యాల ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా వైయస్సార్సీపీ అధినేత వైయస్ జగన్ పోలూరులో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ చంద్రబాబు పాలన తీరును ప్రజల్లో ఎండగట్టారు. మూడున్నరేళ్ల కాలంలో ఏనాడు నంద్యాలకు రాని బాబు, ఆయన క్యాబినెట్  ఉపఎన్నిక రాగానే అంతా ఇక్కడే తిష్టవేశారని  ఫైర్ అయ్యారు. టీడీపీ నాయకులంతా నంద్యాల లాడ్జిల్లో దిగారని అన్నారు. ఇంకా ఏమన్నారంటే... ఎన్నికలున్నప్పుడే బాబుకు ప్రజలు గుర్తుకువస్తారు. ఈ మాట మనం అంటున్నది కాదు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోని ప్రజలు ఇదే మాట అంటున్నారు. బాబు పార్టీలోకి వెళ్లిపోయిన భూమా బామ్మర్ది ఎస్వీ మోహన్ రెడ్డి ఏమన్నాడో తెలుసా..?  నంద్యాల చుట్టుపక్కల ఎమ్మెల్యేలు పైకి పోతే, వైయస్సార్సీపీ పోటీ పెడితే గానీ  అప్పుడు ఉపఎన్నికలొస్తాయి. బాబు నిద్రనుంచి బయటకు వస్తాడని చెప్పాడు. 

కర్నూలుకు ఎయిర్ పోర్టు, ఉర్ధూ యూనివర్సిటీ, స్మార్ట్ సిటీ, అవుకు దగ్గర ఇండస్ట్రీయల సిటీ, హైదరాబాద్-బెంగళూరు పారిశ్రామిక కారిడార్, కర్నూలులో స్విమ్స్, న్యూక్లియర్ ప్లాంట్, రైల్వే వ్యాగన్ల మరమ్మతుల ఫ్యాక్టరీ, ఫుడ్ ఫ్యాక్టరీ ఇలా ఎన్నో హామీలు గుప్పించాడు. కేసీ కెనాల్ నుంచి మూడేళ్ల నుంచి ఒక్క పంటకు కూడ నీళ్లొస్తాయో రావోనని భయంభయంతో రైతులు వ్యవసాయం చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో గుండ్రేవుల ప్రాజెక్ట్ కడతానన్నాడు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ 44వేల క్యూసెక్కుల డిశ్చార్జ్ తో పూర్తిచేస్తామని చెప్పి మూడేళ్లయ్యింది. ఇంతవరకు లేదు. ముఖ్యమంత్రి హోదాలో కర్నూలుకు వచ్చి మైక్ పట్టుకొని చెప్పాడు. వీటిలో ఒక్కటన్నా ఒక్కటైనా చేశాడా..? అంటే లేదు లేదు అని ప్రజలు సమాధానం ఇచ్చారు. ఇన్ని మోసాలు చేసినా ఇటువంటి వ్యక్తిని ఏమీ అనకూడదట. ఎన్నికల ముందు ఇచ్చిన మాటను మోసం చేశాడు. కర్నూలులో ఇచ్చిన మాటను మోసం చేశాడు. ఇప్పుడు ఉపఎన్నిక వచ్చిందని నంద్యాలలో మళ్లీ టేప్ రికార్డర్ ఆన్ చేశాడు. ప్రజలతో పనిబడగానే మళ్లీ అదే మోసాలు మొదలుపెట్టాడు. బాబు ఏమైనా చేయొచ్చట. ముఖ్యమంత్రి కాబట్టి మనం ఆయనను నిలదీయకూడదట. ప్రశ్నిస్తే కేసులు పెడతాడట. వేరే పార్టీ నుంచి 21 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తడట. ఏమీ అనకూడదట. రాజీనామా చేయించకపోయినా అడగకూడదట. కొంతమందికి మంత్రి పదవులు ఇచ్చినా ఎవరూ అడగకూడదట. చట్టాన్ని పరిహాసం చేస్తడు. ఎవరూ నోరెత్తకూడదట. నేరాలు చేసినా చంద్రబాబు రైటట. ప్రశ్నిస్తే తప్పట.

ఇసుక నుంచి రాజధాని వరకు దోపిడీలు చేసుకుంటూ పోతరట. వారు వెన్నుపోటు పొడిచినా, దోపిడీ చేసినా ఎవరూ మాట్లాడకూడదట. రైతులు, డ్వాక్రా అక్కచెల్లెమ్మలను వెన్నుపోటు పొడిచినా మాట్లాడకూడదట. ఇటువంటి వ్యక్తిని ఏం చేయాలి..? ముఖ్యమంత్రి పదవి కోసం ఏమైనా చెప్పొచ్చా..? ప్రజలను మోసం చేయవచ్చా...? మనం ఒప్పుకోమని చంద్రబాబును ప్రశ్నించే సరికి కళ్లు పెద్దవి చేసి జగన్ దిష్టిబొమ్మనుకాల్చండి అని చెబుతడు...? ఇది కరెక్టేనా అని అడుగుతున్నా..? షేమ్ బాబు షేమ్ . బాబు మీరు తప్పు చేశారు. మీ అన్యాయాలు, మోసాలకు ఏ శిక్ష విధించినా కూడ తక్కువేనని నిలదీస్తూనే ఉంటాం. బాబు లాంటి నేరాలు, మోసాలు చేసిన వ్యక్తికి ఉరిశిక్ష వేసినా కూడ తక్కువేనని చెబుతూనే ఉంటాం. వ్యవస్థలో మార్పు రావాలి. రాజకీయ నాయకుడు మైక్ పట్టుకొని చెప్పింది చేయకపోతే ఆ నాయుకుని కాలర్ పట్టుకొని నిలదీసినప్పుడే వ్యవస్థలో విశ్వసనీయత అన్న పదానికి అర్థం ఉంటుంది. విశ్వసనీయతకు అర్థం రావాలంటే మహానేత వైయస్ఆర్ పాలననుగుర్తు చేసుకోవాలి. మాట తప్పేది లేదు మడమ తిప్పేది లేదు అన్న వ్యక్తిత్వం వైయస్ఆర్ ది. మాట తప్పడం, మడమ తిప్పడం బాబు నైజం. రాజకీయ వ్యవస్థలో మార్పు నంద్యాల నుంచే నాంది పలకాలి. ఇవాళ జరగబోయే ఈ ఎన్నికలు ఎవరో ఎమ్మెల్యేను చేసుకునేందుకు కాదు... బాబు మూడున్నరేళ్ల మోసపూరిత పాలనకు వ్యతిరేకంగా, అధర్మ పాలనకు వ్యతిరేకంగా ఓటు వేయబోతున్నాం. చంద్రబాబు అన్యాయాలకు, అవినీతికి వ్యతిరేకంగా ఓటు వేయబోతున్నాం. సంవత్సరం తర్వాత జరగబోయే కురుక్షేత్ర సంగ్రామంలో మార్పుకు నంద్యాల నాంది పలుకుతుంది. 

చంద్రబాబు మాదిరి నా దగ్గర డబ్బులు, ముఖ్యమంత్రి పదవి లేదు. పోలీసులు లేరు. లేనిది ఉన్నట్టు...ఉన్నది లేనట్టుగా చూపించే చానళ్లు, పేపర్లు లేవు. బాబు మాదిరి నాకు మోసం చేయడం, అబద్దాలు చెప్పడం చేతకాదు. ఎన్నికల్లో ఎలాగైనా గెలవడం కోసం నోటికి ఏది వస్తే అది చెప్పడం అలవాటు లేదు. నాకున్న ఆస్తి ప్రియతమ నేత వైయస్ రాజశేఖరరెడ్డి తాను చనిపోతూ ఇచ్చిన ఇంత పెద్ద కుటుంబం నాకుందని గర్వంగా చెబుతా. 8 ఏళ్ల కిందట నాన్నగారు చేసిన సంక్షేమ పథకాలు ఇవాల్టికి ప్రతి గుండెలో బతికే ఉన్నాయని చెప్పడానికి గర్వంగా ఉంది. ఇదే నా ఆస్తి. జగన్ మోసం చేయడు. ఏదైనా చెబితే చేస్తాడన్న విశ్వసనీయత నాకున్న ఆస్తి. జగన్ కూడ తండ్రిలాంటి వాడే. పేదల కోసం పరితపిస్తాడు. నవరత్నాలు ప్రకటించాడు. ప్రతి ఇంట్లో వెలుగులు చూడాలని ఆరాట పడుతున్నాడు. వైయస్ఆర్ సువర్ణయుగం వస్తుందని ప్రజల్లో ఉన్న నమ్మకం నా ఆస్తి. దేవుడు మంచి వాళ్లకు తోడుగా ఉంటాడు. చెడ్డవాళ్లకు శిక్ష వేస్తాడు. సినిమాకు వెళ్లినప్పుడు మనసంతా  హీరో వైపు ఉంటుంది. 13రీల్ వరకు విలన్ దే పైచేయి. 14వ రీల్ క్లైమాక్స్ కు వచ్చేసరికి పైనుంచి దేవుడు ఆశీర్వదిస్తడు. ప్రజల దీవెనలుంటాయి. హీరో విలన్ ను ఫుట్ బాల్ ఆడుకుంటాడు. భగవద్గీత చదివినా, ఖురాన్ చదివినా, బైబిల్ చదివినా ఏది చూసినా న్యాయం, ధర్మమే గెలుస్తుంది. బాబు రాబోయే రోజుల్లో మూడున్నరేళ్లుగా తాను చేసిన అవినీతి సొమ్ముతో వస్తడు. ఇరిగేషన్ కాంట్రాక్ట్ ల దగ్గర్నుంచి మద్యం షాపుల దాక దోచాడు. ఇసుక నుంచి మట్టిదాక..రాజధాని భూములనుంచి గుడిభూముల దాకా దోచాడు. ఆ దోపిడీ సొమ్ముతో ఓటరుకు డబ్బు ఇచ్చే ప్రయత్నం చేస్తడు. ఇంతవరకు ఎమ్మెల్యేలను కొనుగోలు చేశాం. ప్రజలను కూడ కొనుగోలు చేస్తామన్న అహంకారంతో ఎన్నికల బరిలోకి దిగుతున్నాడు. మూటలకు మూటలు తీసుకొని వచ్చి రూ. 5వేలు చేతిలో పెడతడు. దేవునిపటం తీస్తడు. ప్రమాణం చేయించి రూ.5వేలు జేబులో పెడతడు. ఏ దేవుడు పాపానికి ఓటేయమని చెప్పడు. దెయ్యాలు వచ్చి ఓటేయమని చెప్పినప్పుడు...మనసులో దేవుని తలచుకొని ధర్మం వైపు ఉంటామని చెప్పి లౌక్యంతో వ్యవహరించండి. ఓటు మాత్రం ధర్మానికే వేయండి. ఈ ధర్మయుద్ధంలో, న్యాయపోరాటంలో మన అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డిని అందరూ దీవించమని, ఆశీర్వదించమని కోరుతున్నా. నంద్యాల ప్రజలు వేసే ఓటు రేపటి మార్పుకు నాంది పలుకుతుంది. 

Back to Top