జిల్లాలో వైయస్‌ జగన్‌ విస్తృత పర్యటన

– శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ప్రతిపక్షనేత
– వి.కొత్తపల్లెలో పుట్టకోనమ్మకు ప్రత్యేక పూజలు
– రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలను ప్రారంభించిన జగన్‌
– వేముల, వి.కొత్తపల్లెలో జగన్‌కు ఘన స్వాగతం

వేముల : వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం వేముల మండలంలో పర్యటించారు. కడప ఎంపీ వైయస్‌ అవినాశ్‌రెడ్డితో కలిసి ఆయన వేముల, వి.కొత్తపల్లె గ్రామాల్లోని పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు.  అక్కడ శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయ దశమ వార్షికోత్సవాన్ని పురష్కరించుకొని విచ్చేసిన వైయస్‌ జగన్, అవినాశ్‌రెడ్డిలకు పురోహితులు కిశోర్‌ పూర్ణ కుంభంతో ఆలయంలోకి తీసుకెళ్లారు. వారిని శాలువాలతో సత్కరించారు. అనంతరం వైయస్ జగన్ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పురోహితులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అక్కడ నుంచి హరిజనవాడకు చేరుకొని చర్చిలోకి వెళ్లారు. అక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా వారు చర్చి నిర్మించాలని ఆయనను కోరారు. అక్కడ నుంచి బయలుదేరిన జగన్‌ బ్యాంకు వద్ద ఉన్న హరిజనవాడ వాసులను చూసి వాహనం నిలిపి అక్కడ వారితో అభివాదం చేశారు. అనంతరం మండలంలోని వి.కొత్తపల్లె గ్రామానికి చేరుకున్నారు. అక్కడ నుంచి గ్రామానికి సమీపంలోని పుట్టకోనమ్మ ఆలయానికి చేరుకున్నారు. అక్కడ పురోహితులు కిరణ్‌కుమార్‌ శర్మ పూర్ణ కుంభంతో ఆలయంలోకి తీసుకెళ్లారు. అక్కడ వేద మంత్రోఛ్చరణల మధ్య జగన్‌ పుట్టకోనమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. అక్కడ రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలను ప్రారంభించారు.

కస్తూర్భా పాఠశాలకు తాగునీటి సమస్యను పరిష్కరించండి.. :
వేములలోని కస్తూర్భా గాంధీ గురుకుల పాఠశాలలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించాలని ఉపాధ్యాయినిలు, విద్యార్థినులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. పాఠశాలలో మంచినీటి పథకం ఎండిపోయి తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని... ట్యాంకర్లతో తాగునీటిని అందిస్తున్నా సరిపడలేదని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. దీంతో వైయస్‌ జగన్‌వారి సమస్యను విని పాఠశాలలో బోరువేసి తాగునీటి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. దీంతో ఉపాధ్యాయినిలు, బాలికలు వైయస్‌ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

జగన్‌ కరచాలనం కోసం పోటీపడిన యువత.. :
వైయస్‌ జగన్‌ పుట్టకోనమ్మ ఆలయానికి చేరుకున్న వెంటనే ఆయనను చూసేందుకు జనం ఎగబడ్డారు. యువత కరచాలనం చేసేందుకు పోటీపడ్డారు. మహిళలు జగన్‌ను చూసేందుకు ఎగబడటంతో ఆలయానికి చేరుకునేందుకు ఆలస్యమైంది. యువకులు సెల్ఫీ తీసుకొనేందుకు రావడంతో సెక్యూరిటీ సిబ్బంది ఇబ్బంది పడాల్సి వచ్చింది. జగన్‌ను చూసిన వెంటనే యువకులు జై జగన్‌.. జై జగన్‌ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

వైయస్‌ జగన్‌ ఘన స్వాగతం.. :
మండలంలోని వేముల, వి.కొత్తపల్లె గ్రామాల్లో పర్యటించిన వైయస్‌ఆర్‌సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కడప ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డిలకు వైయస్‌ఆర్‌ సీపీ మండల నాయకులు నాగేళ్ల సాంబశివారెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో మండల పరిశీలకుడు లింగాల రామలింగారెడ్డి, జెడ్పీటీసీ మరకా శివకృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ ఆర్‌.జనార్థన్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ రాజారెడ్డి, ఎంపీటీసీలు మల్‌రెడ్డి, శ్రీరామిరెడ్డి, పలువురు సర్పంచ్‌లు, తదితరులు పాల్గొన్నారు.

నవ దంపతులను ఆశీర్వదించిన వైయస్‌ జగన్‌
పులివెందుల టౌన్‌ : పులివెందుల పట్టణంలోని పాత గంగిరెడ్డి ఆసుపత్రి సమీపంలో ఉన్న వెంకటప్ప పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న సాయిబాబా కుమార్తె భవ్యశ్రీ, సాయి వెంకటేష్‌ల వివాహం ఇటీవల జరిగింది. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం వైయస్‌ఆర్‌సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇంటికి వెళ్లి నవ దంపతులను ఆశీర్వదించారు. బంధు, మిత్రులను ఆప్యాయంగా పలకరించారు.
Back to Top