అనంతపురం: ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చంద్రబాబుపై ఫైరయ్యారు. రుణాల మాఫీ సహా ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్కహామీ నెరవేర్చకుండా చంద్రబాబు మోసపూరిత రాజకీయాలు చేస్తున్నాడని మండిపడ్డారు. వైఎస్ జగన్ ఇడుపులపాయ నుంచి బెంగళూరుకు వెళుతూ మార్గమధ్యలోని అనంతపురం జిల్లా ఓబుళదేవర చెరువు మండలం మహమ్మదాబాద్ క్రాసింగ్ వద్ద మహిళలను పలకరించారు. ఈసందర్భంగా వారు డ్వాక్రా రుణాలు మాఫీ చేయకుండా సీఎం చంద్రబాబు మోసం చేశారని జననేత వద్ద ఆవేదన వెలిబుచ్చారు. <br/>డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని ఎన్నికల సమయంలో నమ్మించి ఓట్లు వేయించుకున్న చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక మోసం చేశారన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రభుత్వంపై పోరాడుతున్నామని వైఎస్ జగన్ వారితో అన్నారు. ‘మన ప్రభుత్వం వచ్చేవరకు ఆగండి. అంతా మంచే జరుగుతుంది’ అని భరోసా ఇచ్చారు.