మత్స్యకారులకు వేట గిట్టుబాటు కాక వలసలు పెరిగిన మాట వాస్తవం కాదా బాబూ?

 

 10–12–2018, సోమవారం, 

నందగిరిపేట, శ్రీకాకుళం జిల్లా. 

ఈరోజు శ్రీకాకుళం, ఆమదాలవలస నియోజకవర్గాల్లో పాదయాత్ర సాగింది. వంజంగి గ్రామ రైతన్నలు కలిశారు. వంశధార ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువకు చెందిన 27వ డిస్ట్రిబ్యూటరీ నుంచి పిల్లకాలువను తవ్వకపోవడంతో తమ గ్రామంలోని నరసింగరావు చెరువుకు నీరందడం లేదన్నారు. సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోయారు.  

టీడీపీ నేతలు ఇక్కడి నాగావళి నదిలో ఇసుకే లేకుండా చేసేశారనేది దూసి గ్రామస్తుల ఆవేదన. భారీ యంత్రాలు పెట్టి నది మొత్తం తవ్వేశారని చెప్పారు. ఈ ఇసుక దాష్టీకాలతో నదిలోని రైల్వే బ్రిడ్జి మనుగడకే ముప్పు వాటిల్లిందన్నారు. ఎన్ని ఫిర్యాదులు చేసినా ప్రభుత్వం పట్టించుకోకపోగా.. ఇసుక దొంగలకే వత్తాసు పలుకుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసేది లేక రైల్వే ఉన్నతాధికారులు.. బ్రిడ్జి కూలిపోయే ప్రమాదం ఏర్పడిందని కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు కూడా చేశారట. హోంశాఖ తీవ్రంగా పరిగణించాక గానీ ఇసుక తవ్వకాలు ఆగలేదని తెలిపారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయి బ్రిడ్జి ఇంకా ప్రమాదకర స్థితిలోనే ఉందన్నారు. అక్రమార్జన మత్తులో మునిగితేలుతున్న నేతలకు ప్రజల భద్రత గురించి ఆలోచన ఎందుకుంటుంది? నాలుగున్నరేళ్లుగా రైతన్నలు ఎంతగా ప్రాధేయపడ్డా చిన్నచిన్న పిల్ల కాలువలను కూడా తవ్వని నేతలు.. ప్రజలు వద్దని ఎంతగా మొరపెట్టుకున్నా ఇసుక కోసం రాత్రింబవళ్లు భారీ యంత్రాలు తెచ్చి నదులనే తవ్వేయడం విస్మయం కలిగిస్తోంది. 

మూతపడ్డ కాన్‌కాస్ట్‌ ఫ్యాక్టరీ కార్మికులు కలిశారు. ఆరు నెలలకుపైగా జీతాలివ్వక.. బకాయిలు చెల్లించక.. రాత్రికి రాత్రే అక్రమ లాకౌట్‌ ప్రకటించి తమ బతుకుల్ని రోడ్డున పడేశారని వాపోయారు. దాదాపు 700 కార్మిక కుటుంబాలు ఉపాధి కోల్పోయాయన్నారు. 

ఈ ప్రభుత్వం కార్మికులకు న్యాయం చేయడానికి కనీసం ప్రయత్నం కూడా చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్వార్థ ప్రయోజనాల కోసం ఫ్యాక్టరీని తన గుప్పెట్లో పెట్టుకోవడానికి స్థానిక ఎమ్మెల్యే చేసిన కుటిల యత్నాలే మూసివేతకు కారణమన్నారు.  

జిల్లా నలుమూలల నుంచి వచ్చిన మత్స్యకారులు కలిశారు. పాకిస్తాన్‌ చెరలో ఉన్న తమ సోదర జాలర్ల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. వలసలు నివారించి ఇలాంటి దుస్థితి రాకుండా చూడాలని కోరారు. మత్స్యకారులపై ఈ ప్రభుత్వం మోసపూరిత నిర్లక్ష్యాన్ని చూపుతోందని వివరించారు. మరణించిన జాలర్లకు ఇచ్చిన పరిహారమే ఇందుకు ఉదాహరణ అని చెప్పారు. ఈ నాలుగున్నరేళ్లలో 200 మందికిపైగా మత్స్యకారులు వేటకు వెళ్లి మరణిస్తే కనీసం పదిమందికి కూడా పరిహారం ఇచ్చిన పాపానపోలేదట. ఆ కొద్దిమంది కుటుంబాలకు కూడా బాబుగారు హామీ ఇచ్చినట్టుగా రూ.5 లక్షలు కాకుండా రూ.2 లక్షలే ఇచ్చారట. 

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. ‘వేటకెళ్లే మత్స్యకారులకు 50 శాతం సబ్సిడీపై డీజిల్‌’అనే మీ మేనిఫెస్టోలోని హామీ ఏమైంది? సుదీర్ఘ తీర ప్రాంతం, అపార మత్స్య సంపద ఉన్నప్పటికీ మీరు అధికారం చేపట్టాకనే ప్రభుత్వ ప్రోత్సాహం లేక.. దళారీ వ్యవస్థ పెరిగిపోయి.. వేట గిట్టుబాటు కాక.. వలసలు పెరిగిన మాట వాస్తవం కాదా? 
- వైఎస్‌ జగన్‌


తాజా వీడియోలు

Back to Top