దేవుని దయ, ఆత్మీయ జనాభిమానమే.. నా సంకల్పానికి బలాన్నిస్తున్నాయి..

 

24–09–2018, సోమవారం 
తుమ్మికాపాలెం, విజయనగరం జిల్లా

పాదయాత్ర ఓ చారిత్రక ఘట్టానికి చేరుకుంది. దేశపాత్రునిపాలెంలో 3,000 కిలోమీటర్ల మైలురాయిని దాటింది. దేవుని దయ, ఆత్మీయ జనాభిమానమే.. నా సంకల్పానికి బలాన్నిస్తున్నాయి. 11 జిల్లాల్లో పూర్తయిన యాత్ర ఎన్నో గొప్ప అనుభూతులను, అనుభవాలను ఇచ్చింది. నేను చేస్తున్నదల్లా.. ప్రజాభీష్టాన్ని ప్రతిబింబిస్తూ ప్రజా సంకల్పాన్ని ముందుకు తీసుకెళుతుండటమే. ఈ సుదీర్ఘ యాత్రలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వెనకడుగు వేసింది లేదు. ప్రజలతో మమేకమవడంతో వచ్చే ఆనందమే అలసటను దూరం చేస్తోంది. ఇక రెండు జిల్లాలే మిగిలి ఉన్నాయి. యాత్ర దూరం క్రమంగా తగ్గుతున్నా.. సమస్యలు, ప్రజల ఫిర్యాదులు మాత్రం తగ్గింది లేదు. 

విజయనగరం జిల్లాలో అందిన ఆహ్వానం మరపురానిది. అలనాటి తాండ్ర పాపారాయుడు మొదలు.. నిన్నటి గురజాడ అప్పారావు వరకూ ఎందరో గొప్పవారు నడయాడిన నేల ఇది. ఇప్పుడు పాదయాత్ర సాగుతున్న శృంగవరపుకోటకు గొప్ప చారిత్రక నేపథ్యం ఉంది. పాండవుల అజ్ఞాతవాసం ఇక్కడే గడిచినట్టు చెబుతారు. అందుకే ఇక్కడి శృంగవరపుకోట, లక్కవరపుకోట, జామి, భీమాళి, అలమంద, పుణ్యగిరి గ్రామాల పేర్లన్నీ మహాభారత ఘట్టాలతో ముడిపడి ఉన్నాయి. ఎక్కడా కానరాని పాండవుల గుడి ఎస్‌.కోటలో ఉంది. ఆంధ్రరాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిని అందించిన ఖ్యాతి ఈ నియోజకవర్గానిదే. టంగుటూరి ప్రకాశం పంతులుగారు ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహించారు. ఇక్కడి భీమాళి.. మామిడి తాండ్రకు బహు ప్రసిద్ధి. ఇక్కడి భీమ్‌సింగి చక్కెర కర్మాగారం.. సహకార రంగంపై చంద్రబాబు కుట్రలకు నిదర్శనంగా నిలుస్తోంది.   

ఈ జిల్లా చరిత్రను తెలియజేసే విధంగా మహాకవి గురజాడ అప్పారావు, హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు వేషధారణలో ఇద్దరు యువకులు స్వాగతం పలికారు. కన్యాశుల్కం పుస్తకాన్ని కానుకగా ఇచ్చారు. ఈ నియోజకవర్గంలో 30 ఏళ్లుగా టీడీపీని అందలమెక్కిస్తే.. గుర్తుపెట్టుకునేలా కనీసం మూడు మంచి పనులైనా చేయలేదని ప్రజలు చెప్పుకొచ్చారు. ఎంతో గొప్ప చారిత్రక నేపథ్యం, సాహిత్య, కళా వారసత్వ సంపద కలిగినప్పటికీ.. దేశంలోనే అత్యంత వెనుకబడిన జిల్లాల్లో ఈ జిల్లా ఒకటిగా ఉండటం కలచివేస్తోంది. ఈ నాలుగున్నరేళ్లలో ఉపాధి కోసం వలసలు పెరిగిపోవడం బాధేస్తోంది. 3,000 కిలోమీటర్ల పైలాన్‌ ఆవిష్కరణ, కొత్తవలస భారీ బహిరంగ సభ కలకాలం గుర్తుండిపోతాయి. 

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. ఈ జిల్లాకు సంబంధించి గోస్తని – చంపావతి, వేదావతి – నాగావళి నదుల అనుసంధానం.. తదితర 15 హామీలిచ్చారు.. కనీసం గుర్తున్నాయా? మీరు ఈ జిల్లాకు వచ్చిన ప్రతిసారీ ఈ జిల్లా ప్రజలు అమాయకులని మీ ప్రసంగంలో పదే పదే చెబుతూ ఉంటారు. మీరు హామీలిచ్చి సులభంగా మోసం చేశారనే కదా? 
-వైఎస్‌ జగన్‌ 


Back to Top