భూదోపిడీ వెనుక అసలైన సూత్రధారులు,ప్రధాన లబ్ధిదారులు ప్రభుత్వ పెద్దలే..

 

16–09–2018, ఆదివారం 
గుమ్మడివానిపాలెం, విశాఖ జిల్లా
 

ఈ రోజు పాదయాత్ర జరిగిన నియోజకవర్గాలు పెందుర్తి, భీమిలి.. రెండూ రెండే. విచ్చలవిడి భూకబ్జాలకు, భారీ భూకుంభకోణాలకు నిలయాలు. జెర్రిపోతులపాలెంలో దళితుల భూముల కబ్జా కోసం ఎస్సీ మహిళపై జరిగిన దుశ్శాసనపర్వంతో పెందుర్తి నియోజకవర్గం జాతీయ స్థాయిలో సంచలనం కలిగిస్తే.. రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి ప్రభుత్వ భూముల్ని వందల కోట్లకు బ్యాంకుల్లో తనఖా పెట్టడం ద్వారా భీమిలి నియోజకవర్గం రాష్ట్ర ప్రజల్ని నోరెళ్లబెట్టేలా చేసింది. నాన్నగారి హయాంలో పారిశ్రామిక సెజ్, ఐటీ సెజ్, ఫార్మా సిటీలతో ఈ రెండు నియోజకవర్గాలలో వేలాది మందికి ఉపాధి లభిస్తే.. ఈ నాలుగున్నరేళ్లలో జరిగిన భూదోపిడీ మూలంగా వేలాది కుటుంబాలకు ఉపాధే లేకుండా పోయింది. ప్రజల ఆస్తుల్ని పరిరక్షించాల్సిన ప్రభుత్వ పెద్దలే ఈ భూదోపిడీ వెనుక అసలైన సూత్రధారులు.. ప్రధాన లబ్ధిదారులు. కంచే చేను మేస్తుంటే.. ఇక కాపాడేదెవరు? 

నిన్నటిలానే నేడు కూడా ఉదయమంతా భానుడి భగభగలు.. సాయంత్రం జోరు వాన. ఆ ఎండలో, వానలో సైతం దారుల వెంబడి బారులు తీరారు ఆత్మీయజనం.  వ్యవసాయ కుటుంబానికి చెందిన బగ్గు మౌనిక ఇంటర్‌ చదువుతోంది. బాక్సింగ్‌లో తన ప్రతిభను జాతీయ, అంతర్జాతీయ వేదికలపై చాటి అనేక పతకాలను గెలుచుకుంది. ఆమె ప్రతిభ దూరతీరాలను తాకినా.. ఇక్కడి పాలకుల్ని కదిలించలేకపోయింది. మొక్కుబడిగా ఓ శాలువా కప్పి సన్మానించారే తప్ప.. ఎలాంటి ప్రోత్సాహమూ అందించలేదని ఆవేదన వ్యక్తం చేసింది. మాటలు కోటలు దాటినా.. చేతలు గడప దాటవన్నట్టు.. ఇలాంటి మట్టిలో మాణిక్యాలకు చేయూతనివ్వరుగానీ.. అమరావతిలో ఒలింపిక్స్‌ నిర్వహిస్తారట!  

బలహీనవర్గానికి చెందిన హేమలత అనే చెల్లెమ్మ డిప్లమో పూర్తిచేసింది. ఫీజురీయింబర్స్‌మెంట్‌ కాకపోవడంతో చదువు పూర్తయినా సర్టిఫికెట్లు ఇచ్చేదిలేదన్నారు కాలేజీవారు. అప్పుచేసి ఫీజుకట్టి.. సర్టిఫికెట్లు తెచ్చుకుని బీటెక్‌లో చేరాల్సి వచ్చిందని బావురుమంది. కురుస్తున్న జోరు వానలోనే కాపు సోదరులు ప్లకార్డులు, బ్యానర్లు చేతబట్టి నాతో పాటు అడుగులేశారు. కాపుల సంక్షేమానికి కట్టుబడినందుకు కృతజ్ఞతలు తెలిపి సంఘీభావం ప్రకటించారు.  

సాయంత్రం తుంపాలకు చెందిన సంతోషి అనే చెల్లెమ్మ తన ఏడేళ్ల బిడ్డను ఎత్తుకుని వచ్చిం ది. పుట్టుకతోనే మెదడు ఎదుగుదలే లేని ఆ బిడ్డకు మానసిక వైకల్యం ఉంది. తరచూ ఫిట్స్‌ కూడా వస్తుంటాయి. భర్తేమో దినసరి కూలీ. ఇల్లు గడవడమే కష్టమైతే.. ఇక బిడ్డకు మందులెలా కొనాలి? పింఛన్‌ వచ్చినా  ఆసరాగా ఉంటుందని ఏళ్ల తరబడి కాళ్లరిగేలా తిరిగింది. ఫలితం కానరాలేదు. ఆఖరికి తీవ్ర నిరాశతో, విరక్తితో జన్మభూమి సభలోనే.. ఎమ్మెల్యే ఎదుటే ఆ బిడ్డను వదిలేసి ఏమైనా చేసుకోండని దండం పెట్టేసింది. ఎన్నికలొస్తున్నాయని భయపడ్డారో ఏమో.. పచ్చబాబులు కాస్త దిగొచ్చారు. ఈ మధ్యనే పింఛన్‌ ఇవ్వడం మొదలెట్టారు. న్యాయంగా రావాల్సిన పింఛన్‌ కోసం ఏళ్లుగా పడ్డ క్షోభను, నరకయాతనను చెప్పుకొని కన్నీటిపర్యంతమైంది ఆ సోదరి.  

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. ఫీజురీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని పటిష్టంగా అమలుచేస్తానని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఇస్తున్నదే అరకొర.. అది కూడా ఏళ్ల తరబడి ఇవ్వడమే లేదు. కుంటి సాకులతో ఎంతోమందికి ఎగ్గొడుతున్నారు. దీనివల్ల ఎంతోమంది విద్యా సంవత్స రం కోల్పోతున్నారు.. ఉన్నత చదువులకు వెళ్లలేకపోతున్నారు.. ఉద్యోగావకాశాలు కోల్పోతున్నది.. ఎన్నో కుటుంబాలు అప్పులపాలవుతున్నది.. వాస్తవం కాదా? దీనికి బాధ్యులు మీరు కాదా? పటిష్టంగా అమలు చేయడమంటే ఇదేనా? 

Back to Top