పెట్రోల్, డీజిల్‌పై అదనపు చార్జీలు వసూలు చేసింది నిజం కాదా బాబూ?


10–09–2018, సోమవారం 
చిన వాల్తేరు కనకమ్మగుడి సమీపం, విశాఖ జిల్లా 

విశాఖ మహానగరంలో అనూహ్య స్పందన లభిస్తోంది. ఈరోజు ఉత్తర, దక్షిణ, తూర్పు నియోజకవర్గాల్లో దారులన్నీ కిక్కిరిసిపోయాయి. అడుగుతీసి అడుగేయడమే కష్టమనిపించింది. అంత కిక్కిరిసిన జనం మధ్యలో కూడా ఎన్నో వినతులు వచ్చాయి. బాధలు, కష్టాల వ్య«థలు వినిపించాయి. నిరుద్యోగులు ఓవైపు, వివిధ రంగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు మరోవైపు దారి వెంబడి కలుస్తూ తమ సమస్యలు చెప్పుకున్నారు. 

రూ.లక్షలు ఖర్చు చేసి చదివిన ఆరేళ్ల చదువు ఎందుకూ పనికి రాకుండా ఉందని ఫార్మా–డి విద్యార్థులు వాపోయారు. రాష్ట్రంలోని 58 కళాశాలల నుంచి ఏటా వేలాది మంది ఆ చదువులు పూర్తి చేసి బయటకు వస్తున్నారు. వారికి ఉద్యోగాల్లేవు. ఉపాధి అవకాశాల్లేవు. మరి ఆ కోర్సు ఉండి ప్రయోజనమేమిటి? అందుకే తమ న్యాయమైన హక్కుల కోసం ఆందోళనకు సిద్ధమవుతున్నామన్నారు నిరుద్యోగ జేఏసీ ప్రతినిధులు. నాలుగున్నరేళ్లలో ఒక్క ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయకుండా మోసం చేస్తుంటే వారు మాత్రం ఆందోళన చేయక ఏం చేస్తారు?  


‘రెగ్యులరైజ్‌ చేస్తానన్న బాబు గారు మాట తప్పారు. వేతనాలు సరిగా ఇవ్వకుండా వెట్టి చాకిరి చేయించుకుంటున్నారు. ఉన్న ఉద్యోగాలు కూడా తీసేస్తున్నారు’అని స్టేట్‌ గవర్నమెంట్‌ కాంట్రాక్టు ఉద్యోగుల జేఏసీ వారు నా వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నమెంట్‌ ఈఎన్‌టీ ఆస్పత్రి ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందిదీ ఇదే బాధ. ఈ పాలనలో శ్రమ దోపిడీకి గురవుతున్నామన్నారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల గళాన్ని గతంలో నేను అసెంబ్లీలో వినిపించినందుకు వారు కృతజ్ఞతలు తెలిపారు. నెలల తరబడి జీతాలే ఇవ్వడం లేదని ట్రామా కేర్‌ ఉద్యోగులు, జీవీఎంసీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సేవల్ని కార్పొరేట్‌ సంస్థలకు అప్పగిస్తున్నారని పారిశుధ్య పనివారు ఆందోళన వ్యక్తం చేశారు. ఓవైపు అవకాశాలు లేక నిరుద్యోగులు ఆందోళన చెందుతుంటే, మరోవైపు ఉద్యోగస్తులు భద్రతే లేదంటున్నారు. మరి బాబు గారి ఆనంద ఆంధ్రప్రదేశ్‌లో ఆనందంగా ఉన్నవారెవరో?  

ఈరోజు ఆసిల్‌మెట్ట వద్ద బంద్‌ నిర్వహిస్తున్న ఆందోళనకారులు కనిపించారు. పెరిగిన పెట్రోల్, డీజిల్‌ రేట్లు.. ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాల ధరలతో పేదల బాధలు వర్ణనాతీతం. ఈ పాపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ భాగస్వాములే. పుండు మీద కారం జల్లినట్లు ఓవైపు కేంద్ర పెద్దలు ముక్కు పిండుతుంటే.. మరోవైపు దేశంలో ఎక్కడా లేని అత్యధిక పన్నులు, అదనపు చార్జీలతో బాబుగారు నడ్డి విరుస్తున్నారు. మరి ఢిల్లీ బాబులతో పాటు చంద్రబాబునూ నిలదీయాల్సిందే కదా?  

మధ్యాహ్నం బ్రాహ్మణ సోదరులతో ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఆలయాల ఆస్తులను, పవిత్రతను కాపాడాల్సిన ఆవశ్యకతను వారు తెలియజెప్పారు. తమకు జరుగుతున్న అన్యాయాలను, అవమానాలను వివరించారు. అయినా దైవభక్తి, పాపభీతి లేని పాలకులకు అర్చకత్వాన్ని నమ్ముకున్న బ్రాహ్మణ వర్గాల మీద ప్రేమ ఎందుకుంటుంది? 


ఆంధ్ర యూనివర్సిటీ ముందుగా వెళ్తున్నప్పుడు ఆ విశ్వవిద్యాలయ ఘన చరిత్ర గుర్తుకొచ్చింది. మహామహులు డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్, డాక్టర్‌ కట్టమంచి రామలింగారెడ్డి గార్ల విద్యా సేవలందుకున్న ఆ చదువుల తల్లి ఘనకీర్తుల కథనాలెన్నో. ఆ యూనివర్సిటీలో ఉద్యోగ నియామకాలు జరిగింది నాన్నగారి హ యాంలోనేనట. ఆ తర్వాత ఆ ఊసే లేదు. దినస రి కార్మికులకు ఎన్‌ఎంఆర్‌లుగా గుర్తింపు వచ్చిం దీ అప్పుడేనంటూ నాన్నగారిని గుర్తు చేసుకున్నా రు నన్ను కలిసిన ఆ విశ్వవిద్యాలయ సిబ్బంది.  

ముఖ్యమంత్రి గారికి నాదో ప్రశ్న.. దేశం మొత్తం మీద పెట్రోల్, డీజిల్‌ ధరలు మన రాష్ట్రంలోనే అత్యధికంగా ఉండటానికి కారణం మీరు కాదా? మీ నాలుగేళ్ల సంసారంలో పెట్రోల్, డీజిల్‌ ధరల పెంపుపై ఒక్కసారైనా కేంద్రాన్ని నిలదీశారా? నిలదీయకపోగా దేశంలో ఎక్కడా లేనంతగా పెట్రోల్, డీజిల్‌పై అధిక పన్నులు విధించడంతో పాటు అదనపు చార్జీలు వసూలు చేసింది వాస్తవం కాదా?    
-వైయ‌స్‌ జగన్‌


తాజా ఫోటోలు

Back to Top