రైతుల మీద ప్రేమ అనేది.. పాలకుడి గుండె లోతుల్లో ఉండాలి

08–09–2018, శనివారం  
గోపాలపట్నం హైస్కూల్‌ ప్రాంతం, విశాఖపట్నం జిల్లా

గ్రామీణ విశాఖలో పాదయాత్ర ముగిసింది. గ్రేటర్‌ పరిధిలోకి అడుగుపెట్టాను. నగర పరిధిలోకి వచ్చేప్పటికి భూముల విలువ పెరిగే కొద్దీ.. పచ్చ చొక్కాల భూదందాలు ఎక్కువయ్యాయి. ప్రభుత్వ పెద్దల భూకుంభకోణాలూ అధికమే. భూదోపిడీల్లో అమరావతికి ఏమాత్రం తీసిపోవడం లేదు.  
 
పేదలకు ఇచ్చిన డి–పట్టా భూములను అధికార పార్టీ వారు కబ్జా చేసి అమ్ముకుంటున్నారని మొరపెట్టుకున్నారు జెర్రిపోతులపాలెం గ్రామస్తులు. దళితుల భూముల్లో అక్రమంగా, దౌర్జన్యంగా క్వారీ తవ్వకాలు చేపడుతున్నారట. కోర్టు స్టే ఇచ్చినా.. తమను ఆ భూముల్లోకి రానివ్వడం లేదంటూ వాపోయారు. పెదనరవలో కొందరు అక్కచెల్లెమ్మలు కలిశారు. ఐదు దశాబ్దాలుగా వారు అనుభవిస్తున్న భూములపై అధికార పార్టీ వాళ్ల కన్ను పడిందట. ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటూ.. జీడి మొక్కలు పెంచుకున్న వారి భూముల్లో.. దౌర్జన్యంగా మట్టిని తవ్వేసి అమ్ముకున్నారట. ఆ భూముల్నీ లాగేసుకుంటున్నారట. సాగు చేసుకుని బతకమని గతంలో ప్రభుత్వాలు పేదలకు భూములిస్తే.. ఈ ప్రభుత్వం వారి నోటికాడ కూటిని తన్నుకుపోతోంది.  
 
విశ్రాంత వ్యవసాయాధికారి నూకేశ్వరరావుతో పాటు గవరపాలెం మహిళా రైతులు కలిశారు. పదమూడేళ్ల కిందట నాన్నగారు ఇచ్చిన ట్రోఫీని చూపించారు. అప్పట్లో పొలంబడి కార్యక్రమం ద్వారా రైతులకు చేయూతనిచ్చారట నాన్నగారు. ఆ ఆసరాతో తక్కువ పెట్టుబడితో అత్యధిక దిగుబడి సాధించి.. రికార్డులు సృష్టించారు ఈ ప్రాంత మహిళా రైతులు. ఉగాది పర్వదినాన కవులు, కళాకారులతో పాటు రైతులనూ సత్కరించిన ఏకైక నాయకుడు నాన్నగారేనని చెప్పారు. ఆయన పేర రైతులకు ఓ అవార్డు ఉంటే బాగుంటుందని సూచించారు. చాలా గర్వంగా అనిపించింది. రైతుల మీద ప్రేమ అనేది ప్రకటనలకు, ఎన్నికల హామీలకే పరిమితం కాకూడదు.. పాలకుడి గుండె లోతుల్లో ఉండాలి. చిత్తశుద్ధితో తోడ్పాటునివ్వాలేగానీ.. అన్నదాత అద్భుతాలు సృష్టించగలడు.  

విశాఖ డెయిరీకి చెందిన కాంట్రాక్టు కార్మికులు, పాడి రైతులు కలిశారు. అందులోని అక్రమాలను, తమకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు. రైతన్నల భాగస్వామ్యంతో.. వారికోసం నడవాల్సిన సహకార డెయిరీ కొద్దిమంది వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోతే.. కుటుంబ ఆస్తిగా మారిపోతే.. కార్మికులు, కర్షకులు ఏం బాగుపడతారు? రైతన్నల స్వేదంతో.. వారి త్యాగాల పునాదులపై ఏర్పాటైన సహకార డెయిరీలు, చక్కెర ఫ్యాక్టరీలు ప్రయివేటు వ్యక్తుల చేతుల్లోకి వెళితే.. వాటిపైనే ఆధారపడ్డ పేద బతుకులు ఏం కావాలి? ‘చీమలు పెట్టిన పుట్టలు పాములకిరవైనయట్లు..’ అంటే ఇదేనేమో! 
 నరవ గ్రామానికి చెందిన గోవర్థన్‌ అనే విద్యుత్‌ ఉద్యోగి కలిశాడు. ఒకప్పుడు రూ.2,000 వేతనంతో కాంట్రాక్టు ఉద్యోగిగా చేరాడట. జీతం చాలక ఖాళీ సమయంలో పశువులనూ మేపుకొనేవాడు. నాన్నగారు ఉద్యోగాన్ని పర్మినెంట్‌ చేయడంతో జీవితమే మారిపోయిందంటూ ఆనందం వ్యక్తం చేశాడు. పూజ గదిలో ఉంచుకున్న నాన్నగారి విగ్రహాన్ని తెచ్చి చూపించాడు. పాలించేవారికి మనసుంటేనే ప్రజలకు మంచి జరుగుతుంది. వెన్నంటి నిలిచిన ప్రజల్ని నాయకులు మర్చిపోవచ్చేమోగానీ.. మంచి చేసిన నేతను ప్రజలు కలకాలం గుండెల్లో దాచుకుంటారు.  
 
ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. ఎన్నికలప్పుడు కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తానని.. ఇంటికో ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చాక అన్ని సేవల్నీ అవుట్‌ సోర్సింగ్‌ చేస్తున్నారు. ఒక్క ప్రభుత్వ ఉద్యోగాన్నీ భర్తీ చేయకపోగా లంచాల కోసం సేవలను ప్రయివేటీకరిస్తూ.. ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతున్నారు. మరోవైపు, లక్షలాది ఉద్యోగాలిచ్చేశానని.. ఎన్నికల హామీలన్నీ నెరవేర్చేశానని ప్రకటిస్తున్నారు.. కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పడం అంటే ఇదే కదా? ఇంతకన్నా మోసం ఉంటుందా? తప్పు చేస్తున్నానన్న భావన మనసులో ఏ మూలయినా అనిపించదా? 
-వైయ‌స్‌ జగన్‌


Back to Top