అగ్రిగోల్డ్‌ ఆస్తుల విలువను మరింత తగ్గించి చూపడం కుట్ర కాదా బాబూ?

04–09–2018, మంగళవారం,
గుళ్లేపల్లి, విశాఖపట్నం జిల్లా.

ఈ రోజు ఉదయం మాడుగుల, సాయంత్రం పెందుర్తి నియోజకవర్గాల్లో పాదయాత్ర సాగింది. ఉదయం ఎండ, ఉక్కపోత ఎక్కువగా ఉన్నాయి. మధ్యాహ్నం కాసేపు కురిసిన వర్షంతో వాతావరణం చల్లబడింది. ఈ రోజు వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, అగ్రిగోల్డ్‌ బాధితులు, డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువకులు ఇలా ఎందరో నన్ను కలిసి సమస్యలు చెప్పుకున్నారు. మనసులేని పాలనలో ప్రజలకెన్ని కష్టాలో. కఠినమైన పాలకుడు ఉంటే కడగండ్లే మిగులుతాయి. 

ఏజెన్సీ ప్రాంతంలో డెంగీ జ్వరాలు విజృంభిస్తున్నాయని నన్ను కలిసిన గిరిజనులు ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర మొత్తం విష జ్వరాలతో వణికిపోతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేకపోవడం విస్మయం కలిగిస్తోంది. సంతపాలెం వద్ద స్కూల్‌ పిల్లలు కలిశారు. ‘ప్రభుత్వ పాఠశాలలను కాపాడండి.. పేద విద్యార్థులను రక్షించండి’ అంటూ ప్లకార్డులు పట్టుకున్నారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందన్న నెపంతో ఈ నాలుగేళ్లలో ఒక్క కె.కోటపాడు మండలంలోనే తొమ్మిది ప్రభుత్వ పాఠశాలలను మూసివేశారట. పాఠశాలల ప్రమాణాలను పెంచకుండా, సౌకర్యాలు కల్పించకుండా విద్యార్థుల సంఖ్య ఎలా పెరుగుతుంది? ఈ పాలకులకు బినామీ కార్పొరేట్‌ విద్యా సంస్థలపై ఉన్న ప్రేమలో కాస్తంతయినా ప్రభుత్వ పాఠశాలలపై ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా?


అగ్రిగోల్డ్‌ సమస్య వెనుక ప్రభుత్వ పెద్దల స్వార్థ ప్రయోజనాలు దాగి ఉన్నాయన్నది జగమెరిగిన సత్యం. బాధిత కుటుంబాల కష్టాలు వర్ణనాతీతం. ఒక్కో కుటుంబానిది ఒక్కో దయనీయగాథ. మర్రివలస వరలక్ష్మి భర్త అగ్రిగోల్డ్‌ ఏజెంట్‌. వందలమందితో డిపాజిట్లు కట్టించాడు. బిడ్డ వైద్య విద్య కోసం తను కూడా కొంత డబ్బు అగ్రిగోల్డ్‌లో దాచాడు. ఆ సంస్థ బోర్డు తిప్పేసింది. వారి కుటుంబం రోడ్డున పడింది. ఫీజులు కట్టలేక బిడ్డ మెడిసిన్‌ చదువు మధ్యలోనే ఆగిపోయింది. రొంగలినాయుడు పాలేనికి చెందిన జయలక్ష్మిదీ అదే బాధ. ఆమె భర్త కూడా అగ్రిగోల్డ్‌ ఏజెంట్‌.

వందలాది మంది కస్టమర్లకు సమాధానం చెప్పుకోలేక, ఏం చేయాలో దిక్కుతోచక నరకయాతన పడుతున్నాడు. ఎప్పటికైనా మంచిరోజులు రాకపోతాయా అనే చిన్న ఆశతో బతుకు భారంగా లాగిస్తున్నాడు. బాధలు తట్టుకోలేక, ఒత్తిళ్లు, అవమానాలు భరించలేక గుండె ఆగి చనిపోయినవారు, ఆత్మహత్యలు చేసుకున్నవారు, ఊళ్లను వదిలిపోయినవారు ఎందరెందరో. ఇది లక్షలాది కుటుంబాల జీవన్మరణ సమస్య. ప్రభుత్వ పెద్దలు మాత్రం ఓ వైపు బాధితులను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తూ.. మరోవైపు సంస్థ ఆస్తుల కోసం తెరచాటు మంతనాలు సాగిస్తున్నారు.

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. రాష్ట్రంలోని 19.52 లక్షల మంది అగ్రిగోల్డ్‌ బాధితులను సత్వరం ఆదుకుంటామని హామీ ఇచ్చి నాలుగేళ్లు దాటింది. ఏ ఒక్క కుటుంబానికైనా డిపాజిట్‌ తిరిగి చెల్లించి ఆదుకున్నారా? అగ్రిగోల్డ్‌ ఆస్తుల మార్కెట్‌ విలువ ఒకటైతే.. సీఐడీ దానికంటే తక్కువ విలువ చెప్పడం.. కొంటామని ముందుకు వచ్చిన సంస్థ మరింత తక్కువగా వెలకట్టడం.. మీరు ఢిల్లీలో ఆ సంస్థతో అర్ధరాత్రి రహస్య మంతనాలు జరిపిన తర్వాత ఆస్తుల విలువను మరింత తగ్గించి చూపడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటి? ఇది కుట్ర కాదా?   
-వైయ‌స్‌ జగన్‌ Back to Top