అన్యాయాన్ని ఎత్తిచూపిన అమాయక ముస్లిం సోదరులు దేశద్రోహులా?

03–09–2018, సోమవారం
రామచంద్రాపురం శివారు, విశాఖపట్నం జిల్లా 

మాడుగుల హల్వా అంటే మహా ప్రసిద్ధి. ఏడు జలాశయాలకు నిలయమైన మాడుగుల నియోజకవర్గంలో ఈరోజు పాదయాత్ర సాగింది. కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణుని వేషధారణలో పసిబిడ్డలు అలరించారు. ఆ చిన్నికృష్ణులతోనే ఉట్టి కొట్టించాను. 

పేద బిడ్డల చదువుల వెలుగైన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం ఎంత అధ్వానంగా తయారైందో ఈరోజు మరోసారి తెలియ వచ్చింది. గుల్లేపల్లికి చెందిన కృష్ణవేణి ఇంజనీరింగ్‌ పూర్తిచేసింది. భర్త ఆటోడ్రైవర్‌. ఇద్దరు బిడ్డల తల్లి. ఉద్యోగంలో చేరి కుటుంబానికి అండగా ఉండాలనుకుంది. కానీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కాకపోవడం ఆమె పాలిట శాపమైంది. లక్షదాక ఉన్న ఫీజు బకాయిలను కడితేనే సర్టిఫికెట్స్‌ ఇస్తామంటున్నారు కాలేజీ వారు. బలహీనవర్గానికి చెందిన ఆ నిరుపేద చెల్లెమ్మ అంత డబ్బు ఎక్కడ నుంచి తేగలదు? అందుకే చదువు పూర్తయి మూడేళ్లవుతున్నా ఇంటిపట్టునే ఉంటోంది. ఆశలన్నీ అడియాసలయ్యాయి. చదివిన చదువు, ఇన్నేళ్ల శ్రమ వ్యర్థమయ్యాయని కన్నీటిపర్యంతమైంది. జ్ఞానభేరి అంటూ ఊదరగొడుతూ విద్యార్థులను మభ్యపెడుతున్న బాబుగారే ఇందుకు బాధ్యత వహించాలి.


దివ్యాంగ సోదరుడు రవికుమార్‌ ఆత్మవిశ్వాసాన్ని అభినందించకుండా ఉండలేక పోయాను. పుట్టుకతోనే పోలియోతో కాళ్లూ, చేతులు చచ్చుబడిపోయాయి. అయినా, పట్టుదలతో ఎం.కాం చదివాడు. ఉద్యోగ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించినా అధిక వైకల్యంవల్ల కొలువు ఇవ్వడంలేదట. ప్రభుత్వ ప్రోత్సాహమూ కొరవడింది. నిరాశ చెందని ఆ సోదరుడు కోచింగ్‌ సెంటర్‌ నడుపుతున్నాడు. పదిమందికి ఉపాధి కల్పిస్తున్నాడు. వైకల్యం అతనిది కాదు.. ప్రతిభను గుర్తించని ప్రభుత్వానిది. సోమునాయుడు అనే దివ్యాంగునిది మరో విషాదం. కరెంట్‌ షాకుతో రెండు కాళ్లూ, ఒక చేయి పూర్తిగాపోయాయి. ఆ ప్రమాదం వైవాహిక జీవితాన్ని విచ్ఛిన్నం చేసింది. హుద్‌హుద్‌ తుపానుకు ఉన్న చిన్నపాటి ఇల్లూ కొట్టుకుపోయింది. తండ్రీ దివ్యాంగుడే. కన్నతల్లే కూలికెళ్లి ఇద్దరినీ పోషిస్తోంది. ఇది చూశాక మానవత్వం ఉన్న ప్రతీఒక్కరూ కరిగిపోవాల్సిందే. ఒక్క ఈ సర్కారు తప్ప. నాలుగేళ్లుగా పింఛనీయకుండా నరకయాతన పెట్టారు. జీవితం మీద విరక్తి చెందిన ఆ సోదరుడు ఎంపీడీవో ఆఫీసులోనే ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. ఇదీ దివ్యాంగులపట్ల ఈ పాలకులకున్న దివ్యమైన ప్రేమ.


చేయనివి చేసినట్లుగా చెప్పుకోవడం... మీడియాను గుప్పెట్లో పెట్టుకుని మభ్యపెట్టడం... ఇదీ బాబుగారి కుటిల రాజకీయం. దేవరపల్లి ముస్లింలు కలిశారు. తన కొడుక్కి స్కాలర్‌షిప్‌ రావడంలేదంది ఓ అక్క.. డ్వాక్రా రుణమాఫీ దేవుడెరుగు, పసుపు కుంకాల డబ్బూ ఇవ్వలేదంది మరో సోదరి.. చంద్రన్న పెళ్లికానుక ఊసేలేదన్నాడు ఇంకో సోదరుడు. ముస్లింలకింత అన్యాయం చేసిన ప్రభుత్వం మరోటి లేదన్నది వారందరి నిశ్చితాభిప్రాయం.

ముఖ్యమంత్రిగారికో ప్రశ్న... చరిత్రలోనే ముస్లింలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించని ప్రభుత్వం మీదే కాదా!? మైనారిటీల సంక్షేమం అంటూ మీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా నెరవేర్చకుండా వంచన చేసింది వాస్తవం కాదా!? కోట్ల రూపాయల ప్రజాధనంతో ‘నారా హమారా..’ నిర్వహించినంత మాత్రాన మీరు చేసిన అన్యాయం మరుగున పడిపోతుందా? జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తిచూపిన అమాయక ముస్లిం సోదరులు దేశద్రోహులా? మరి అన్ని వర్గాలను వంచిస్తూ తీరని ద్రోహం చేస్తున్న మిమ్మల్ని ఏమనాలి? 
-వైయ‌స్‌ జగన్‌ 


Back to Top