నమ్ముకున్న జనం కోసం ఎందాకైనా పోరాడే తత్వం..నాన్నగారు నాకిచ్చిన వరం

02–09–2018, ఆదివారం
కొత్తపెంట శివారు, విశాఖపట్నం జిల్లా 

నమ్మిన సిద్ధాంతం కోసం, నమ్ముకున్న జనం కోసం ఎందాకైనా పోరాడే తత్వం నాన్నగారు నాకిచ్చిన వరం. ప్రజల పక్షాన నిలబడ్డమే ఆయన నేర్పిన రాజకీయం. ఆఖరి శ్వాస విడిచేవరకూ నిరంతరం ప్రజలతో మమేకమైన ఆయన జీవితమే నాకు స్ఫూర్తిదాయకం. నాకు నడక, నడత నేర్పి నన్నింతవాణ్ణి చేసిన నాన్నకు ప్రేమతో నివాళులర్పించాను. ఎన్ని జన్మలెత్తినా ఆ మహనీయుడికే కొడుకుగా పుట్టాలని ఆ భగవంతుడ్ని ప్రార్థించి పాదయాత్ర ప్రారంభించాను. ఈరోజు గ్రామగ్రామాన, దారిపొడవునా ప్రజలు నాన్నగారికి నివాళులర్పిస్తూనే ఉన్నారు. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆయన సాయమందని గడప.. ఆయన ప్రేమను పొందని గుండె లేవనేది జనంలోంచి వినిపిస్తున్న మాట.

ఈరోజు పాదయాత్ర మార్గానికో ప్రత్యేకత ఉంది. నాన్నగారి పాదయాత్ర బాటలోనే నేనూ నడిచాను. ఇదే దారిలో సోదరి షర్మిల యాత్రా సాగింది. లక్కవరం గ్రామానికి ప్రత్యేక అనుబం ధం ఉంది. పాదయాత్రలో నాన్నగారు ఇక్కడే బస చేశారు. ఆ గ్రామస్తులు ఆ జ్ఞాపకాలను పంచుకున్నారు. ‘‘ఇంటి పెద్దతో మాట్లాడినట్లే ఉండేదయ్యా. ఆయన పోయినప్పుడు సొంత మనిషి పోయినట్లే ఏడ్చాం. పార్టీలకతీతంగా ఊరు ఊరంతా పొయ్యి మీద కుండ పెట్టనేలేదు’’.. అంటూ కంటతడి పెట్టారు. ఆయన బసచేసిన ప్రాంతంలో స్మృతిగా విగ్రహం పెట్టారు. ‘‘సాయానికి పార్టీలు అడ్డుకాకూడదు. అర్హత ఉంటే చాలు’’.. అన్న నాన్నగారి సిద్ధాంతమే కోట్లాది మంది ప్రజలు ఆయన్ని ప్రేమించేలా చేసింది. 


ఈరోజు చాలామంది నాన్నగారి హయాంలో పొందిన సాయాన్ని, నేటి పాలనలో పడుతున్న కష్టాన్ని చెప్పుకొచ్చారు. రెండు కళ్లులేని దివ్యాంగుడైన దుర్గాప్రసాద్‌ను తీసుకొచ్చారు వాళ్ల తాతయ్యలు దేముడు, సత్యారావు. నాన్నగారి హయాంలో ఆ ఉమ్మడి కుటుంబానికి నాలుగు లక్షల రుణమాఫీ జరిగిందట. ఆ కుటుంబంలో ఒకరికి వీఆర్వోగా ఉద్యోగమూ వచ్చింది. ఆ దివ్యాంగుడికి పింఛనూ అప్పటిదే. కానీ, టీడీపీ వచ్చాక నిష్కారణంగా పింఛన్‌ ఆపేశారట. మూడున్నరేళ్లు పోరాడి, కోర్టుకెళ్లి మరీ పింఛన్‌ సాధించుకున్నారా తాతామనవళ్లు. చాలా బాధనిపించింది. కోర్టుకెళ్లి పింఛనైతే తెచ్చుకున్నారు.. మరి అకారణంగా మూడున్నరేళ్లు పింఛన్‌ కోల్పోయినందుకు నష్టపరిహారం ఉండదా? ఇన్నేళ్ల వారి యాతనకు కారకులైన పాలకులకు శిక్షే లేదా?

జగన్నాథపురానికి చెందిన నాగమణి అనే చెల్లెమ్మ కలిసింది. పేద కుటుంబంలో పుట్టినా చదువులో బాగా రాణించేది. వ్యవసాయ పనులు చేసుకుంటూ ఇంటిని పోషించే ఆమె తండ్రికి ప్రమాదంలో కాలు విరిగింది. ఫీజులు కట్టలేక చదువు ఆగిపోతుందేమోనని భయపడిందట. ఆ సమయంలో నాన్నగారి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కొండంత అండయింది. ఇంజనీరింగ్‌ పూర్తిచేశాక.. నాన్నగారి చలవతో వచ్చిన బ్రాండెక్స్‌ కంపెనీలోనే పనిచేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటోంది. నాన్నగారి హయాంలో వాళ్ల నాన్నకు పింఛను, ఇందిరమ్మ ఇల్లూ వచ్చాయి. రుణమాఫీ జరిగింది. కానీ, ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే పింఛన్‌ తీసేశారు. ఎందుకింత వివక్ష? పేద ప్రజలపైనేనా వీరి కక్ష? పింఛన్‌ తీసేయగలరేమో కానీ, గుండెల్లో గూడుకట్టుకున్న అభిమానాన్ని చెరిపేయగలరా?

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. ‘‘ఎంతకాలం బతికామన్నది కాదు ముఖ్యం.. ఎలా బతికామన్నది. ఎంతకాలం పరిపాలించామన్నది కాదు ముఖ్యం.. ఎంతమంది గుండెల్లో స్థానం సంపాదించామన్నది’’.. అనుక్షణం కుట్రలు, కుతంత్రాలు, అబద్ధాలు, మోసాలు, వెన్నుపోట్లతో అధికారంలోకి రావాలన్న యావే తప్ప మీ నలభైయేళ్ల రాజకీయ జీవితంలో ఒక్క క్షణమైనా నిజాయితీగా ప్రజల కోసం ఆలోచించారా!?
-వైయ‌స్‌ జగన్‌ 
Back to Top