పుట్టిన పిల్లలను కూడా వదలకుండా అందరినీ వంచించిన ఘనత మీది కాదా?

 
28–08–2018, మంగళవారం 
తిమ్మరాజుపేట, విశాఖపట్నం జిల్లా

నా ఆత్మీయుల మధ్యే ఇవాళ నా పెళ్లి రోజు గడిచింది. పాదయాత్ర చేస్తూ ప్రజా క్షేత్రంలోనే ఉండటంతో నా అర్ధాంగి ఇక్కడికే విచ్చేసింది. ఈ రోజు యాత్ర ఆసాంతం నా ఆత్మ బంధువులు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతూనే ఉన్నారు.  

హరిపాలెంలో కుసుమ, గిరీష, సుగణ అనే చెల్లెమ్మలు కలిశారు. అందరికీ ఆడబిడ్డలు ఉన్నారు. ‘బంగారు తల్లి’పథకంలో నమోదు చేసుకున్నారు. ఆడపిల్ల ఎదిగేకొద్దీ దశలవారీగా డబ్బులిస్తామంటే బ్యాంకు అకౌంట్లు తెరిచారు. ప్రభుత్వ సాయం అందుతుందేమోనని ఆశగా ఎదురు చూస్తున్నారు. జాలేసింది. పాపం ఆ చెల్లెమ్మలకు అసలు విషయం తెలీదు.. బాబుగారు ‘బంగారు తల్లి’పథకాన్ని ఎప్పుడో మూసేశారని, ‘మహాలక్ష్మి’అంటూ మరో పథకాన్ని ప్రకటించి దాన్నీ గాలికి వదిలేశారని. కిశోర బాలిక పథకమూ ఆపేశారని అంది అదే గ్రామానికి చెందిన అనూష అనే చెల్లెమ్మ. ఈ పాలనలో ఏ పథకం సక్రమంగా నడుస్తోంది గనుక. ఎంతసేపూ ఎన్నికల్లో బూటకపు హామీలు గుప్పించి, ఓట్లు దండుకుని, గద్దెనెక్కాక ఆ పథకాలను అటకెక్కించే నైజం చంద్రబాబుది. మళ్లీ ఎన్నికలు దగ్గరపడేసరికి మోసపూరిత మాటలు చెప్పి మళ్లీ గద్దెనెక్కాలనే ఆరాటమే తప్ప, మంచి చేసి మనసులు గెలవాలనే ఆలోచన ఏ కోశానా లేదు. 


ఈ ప్రాంతమంతా సన్నకారు, చిన్నకారు రైతులే. ఎక్కువగా చెరకుమీద ఆధారపడి బతుకుతున్నారు. బాబుగారి పుణ్యమాని చక్కెర కర్మాగారాలు మూతపడుతున్నాయి. బెల్లం తయారు చేసుకుని అమ్ముకుందామనుకుంటే అక్కడా కష్టాలే. గిట్టుబాటు ధర లేక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు రైతన్నలు. మునగపాక మండలం తిమ్మరాజుపేటలో కలిసిన బెల్లం రైతుల ఆవేదన ఇది. ఈ మండల రైతన్నలు బెల్లం వండటంలో చేయి తిరిగిన నిష్ణాతులు. పాలకులే దళారులై దగా చేస్తుంటే.. ఎంత నైపుణ్యం ఉండి ఏం లాభం.  

హరిపాలెంలో కుండలు, బొమ్మలు చేసుకునే కుమ్మరులు కలిశారు. మట్టి దొరకక వృత్తి బరువవుతోందని వాపోయారు. నిజమే.. రాష్ట్రంలోని ఇసుక, మట్టిని పచ్చ నేతలు విచ్చలవిడిగా దోచేస్తుంటే.. ఇలాంటి చేతివృత్తులు చితికిపోవా? 

మణి అనే దళిత సోదరి కలిసింది. కొడుకు ఇంజనీరింగ్‌ పూర్తిచేసి సంవత్సరం దాటింది. ఇప్పటికీ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదట. కారణం ఇంతవరకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కాకపోవడం. ప్రభుత్వం నుంచి నిధులు వచ్చాకనే సర్టిఫికెట్లు ఇస్తామంటున్నారు కాలేజీ వారు. పై చదువులు, ఉద్యోగావకాశాలు వదులుకోవాల్సిందేనా? ఇదీ బాబుగారి మార్కు ఫీజు రీయింబర్స్‌మెంట్‌. ఆయనగారి దళితతేజం అంటే ఇదేనేమో. 

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న. పుట్టిన ప్రతి ఆడబిడ్డ పేరుతో మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు బ్యాంకులో డిపాజిట్‌ చేసి, యుక్తవయసు వచ్చేనాటికి రూ.2 లక్షలు అందజేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు. మీ నాలుగున్నరేళ్ల పాలనలో ఒక్కరంటే ఒక్క ఆడబిడ్డ పేరిటైనా డిపాజిట్‌ చేశారా? ‘బంగారుతల్లి’లాంటి ఉన్న పథకాలనూ తీసేశారు.. మహాలక్ష్మి అంటూ మీరు చెప్పిన పథకాన్నీ అటకెక్కించారు. ఇది ఆడబిడ్డలకు మీరు చేసిన మోసం కాదా? రైతులు, పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలు, విద్యార్థులు, ఉద్యోగావకాశాల కోసం ఎదురు చూస్తున్న యువకులు.... చివరికి పుట్టిన చిన్న పిల్లల్ని సైతం వదలకుండా అందరినీ వంచించిన ఘనత మీది కాదా? 
-వైయ‌స్‌ జగన్‌ 
Back to Top