పేదల బతుకులతో ఆడుకోవడం చంద్రబాబుకు కొత్తేం కాదు..

  
24–08–2018, శుక్రవారం
కొత్తపాలెం క్రాస్, విశాఖపట్నం జిల్లా

సంక్షేమాన్ని అటకెక్కిస్తే పేదల జీవితాల్లో చెలరేగే కల్లోలం అక్షరాలకు అందుతుందా? ఈ రోజు పాదయాత్రలో లైన్‌ కొత్తూరు గ్రామం వద్ద శృంగవరపు కాంతం చెప్పిన ఆవేదనే ఇందుకు సాక్ష్యం. ఆమెకు పింఛన్‌ ఆపేశారట. రూ.16 వేలు అప్పుచేసి మరీ మరుగుదొడ్డి నిర్మాణాన్ని పూర్తిచేస్తే.. 11 నెలలైనా బిల్లే రాలేదట. అధికారుల చుట్టూ తిరిగి తిరిగి విసుగొస్తోందంటూ కన్నీళ్లు పెట్టుకుంది. మరో చెల్లెమ్మదీ ఇలాంటి గాధే.. పోతిరెడ్డి కుమారి అనే సోదరి చిన్న వయసులోనే భర్తను కోల్పోయింది. ఒంటరైన ఆమె.. రేషన్‌కార్డు ఇవ్వాలంటూ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. మరోవైపు రేషన్‌కార్డు ఉంటేనే పింఛన్‌ ఇస్తామంటున్నారట. ఇలాంటి ఘటనలు ఎన్నో.. ఎన్నెన్నో. నిజంగా నాకు జాలేస్తోంది. పేదల బతుకులతో ఆడుకోవడం చంద్రబాబుకు కొత్తేం కాదు. ఏదో ఒక సాకుతో ప్రజా సంక్షేమానికి పాతరేయడమే ఆయన లక్ష్యంగా పెట్టుకున్నట్టు కనిపిస్తోంది.  

ఈ ప్రాంతంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు సన్న, చిన్నకారు రైతులు ఎక్కువగా నన్ను కలిశారు. కలిసిరాని వ్యవసాయం.. చితికిపోయిన ఆర్థిక స్థితి వాళ్లది. ఈ పరిస్థితుల్లో పాడినే ప్రత్యామ్నాయంగా నమ్ముకున్నారు. సహకార రంగం సజీవంగా ఉన్నన్నాళ్లూ ఆనందంతో ఉన్నామని గత వైభవాన్ని చెప్పుకున్నారు. బాబుగారొచ్చాక ప్రైవేటు డెయిరీలు విరుచుకుపడ్డాయని.. క్రమంగా సహకార డెయిరీలు చిక్కిశల్యమయ్యాయని చెప్పారు. ప్రైవేటు డెయిరీలు తమనెలా మోసం చేస్తున్నాయో చెప్పారు. కూలి కూడా గిట్టుబాటు కాని ధర చెల్లిస్తున్నారని వాపోయారు. లీటరు ఆవు పాలకు సగటున వస్తోంది 24 రూపాయలే.. మినరల్‌ వాటర్‌ బాటిల్‌ కూడా ఇదే ధర పలుకుతోంది.. ఇక నీళ్లకు, పాలకు తేడా ఏంటన్నా.. అంటూ నిర్వేదంతో చెప్పారు. నిజంగా దారుణమే! చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకొచ్చినా సహకార డెయిరీలకు ఇదే దుర్గతి. ఆయన హెరిటేజ్‌ మాత్రం ఎల్లలు దాటి లాభాలు దండుకుంటోంది. పేద పాడిరైతన్న మాత్రం.. గిట్టుబాటు కాక దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. వ్యూహాత్మకంగా సహకార రంగాన్ని నిర్వీర్యం చేసి ప్రైవేటు దోపిడీకి తెరతీసిన దళారీ చంద్రబాబే దీనికి పూర్తి బాధ్యుడు. 


యలమంచిలి శివారు గ్రామాల ప్రజల ఆవేదన అంతా ఇంతా కాదు. ‘మా ఊళ్లను మున్సిపాలిటీలో ఎందుకు కలిపారో అర్థం కావడం లేదని మొత్తుకున్నారు. పంచాయతీగా ఉన్నప్పుడు ఉపాధి పనులైనా దొరికేవన్నా. మున్సిపాలిటీ అయ్యాక పన్ను మీద పన్నేస్తున్నారు. కట్టాలంటూ వెంటపడుతున్నారు. వేలకు వేలు దండుకుంటున్నా.. ఎక్కడా అభివృద్ధి కనిపించడం లేదు. మురికి కూపాలుగా ఉన్నా.. పట్టించుకునే నాథుడే లేడు’అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పేదల రక్తం పీల్చడానికే ఈ ప్రభుత్వం ఉందా? అంటూ ప్రశ్నించారు.  

భోజన విరామం అనంతరం యాత్ర మొదలుపెట్టే సమయానికి వర్షం ప్రారంభమైంది. పాదయాత్ర 2,800 కిలోమీటర్లు దాటిన సందర్భంగా యలమంచిలిలో ఓ మొక్క నాటాను. సభాసమయానికి వర్షం జోరందుకుంది. నన్ను చూడాలని, నా తోడుగా నిలవాలని, నా మాటలు వినాలని.. భారీ వర్షాన్ని సైతం లెక్కచేయని వేలాది మంది ఆత్మీయులను చూసి ఓ వైపు సంతోషం.. మరోవైపు బాధ. అంతటి వర్షంలో సైతం చిన్నబిడ్డల్ని ఎత్తుకుని నిలబడ్డ ఎందరో అక్కచెల్లెమ్మల్ని గమనించాను. నేను తడిసినా.. నా ఆత్మబంధువులు ఇబ్బందిపడరాదని భావించాను. అందుకే ఈ నియోజకవర్గంలో నా దృష్టికి వచ్చిన సమస్యలు ఎన్నో ఉన్నా.. అన్నింటినీ సభలో ప్రస్తావించలేకపోయాను. కానీ ఆ సమస్యలు, ప్రజలిచ్చిన సలహాలు, సూచనలు మదిలో మెదులుతూనే ఉన్నాయి.  


ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. మీరు అధికారంలో ఉన్న ప్రతిసారీ మీ హెరిటేజ్‌ సంస్థ ఊహించని లాభాల్లోకి దూసుకెళ్తోంది. రాష్ట్రం తో పాటు.. ఇతర రాష్ట్రాల్లో సైతం వేగంగా విస్తరిస్తోంది. అదే సమయంలో పాడి రైతుల భాగస్వామ్యంతో నడిచే సహకార డెయిరీలు అంతే వేగంతో నష్టాల ఊబిలోకి నెట్టబడతాయి. ఒక్కొక్కటిగా మూతబడుతున్నాయి.. కారణమేం టి? కేవలం మీ హయాంలో మాత్రమే ఎందుకిలా..? 
-వైయ‌స్‌ జగన్‌  


Back to Top