రాత్రికి రాత్రి పారిపోయొచ్చి హైదరాబాద్‌లో ‘ఆరోగ్యశ్రీ’ ఆపేస్తారా..

23–08–2018, గురువారం
రేగుపాలెం జంక్షన్, విశాఖపట్నం జిల్లా

కర్రకు ప్రాణం పోసి.. కళను ప్రపంచానికే పరిచయం చేసిన ఏటికొప్పాక మీదుగా ఈ రోజు నా పాదయాత్ర సాగింది. అడుగడుగునా లక్కబొమ్మల తయారీ కళాకారులు పుట్టెడు కష్టాలు చెప్పారు. నాలుగు శతాబ్దాల ఆ కళ.. నేటి పాలకుల వల్ల అంతరించి పోతోందని ఆవేదన వెలిబుచ్చారు. దేశవిదేశాల్లో ప్రాచుర్యం పొందిన ఈ ప్రాచీన కళ క్రమంగా కళ తప్పుతోందన్నారు. అద్భుతమైన కళాసృష్టితో జాతీయ అవార్డులు కూడా దక్కించుకున్న కళాకారుల ఉనికికే ముప్పు ఏర్పడిందని చెప్పారు. బొమ్మలకు ఊపిరి పోసిన ఎందరో కళాకారులిప్పుడు కార్పొరేట్‌ కంపెనీల్లో కూలీలుగా మారారని కన్నీళ్లు పెట్టుకున్నారు.

కర్ర బొమ్మలకు అవసరమైన అంకుడు కర్ర అడవిలో కావాల్సినంత ఉన్నా.. అధికారులు అడ్డుపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే.. కంటి తుడుపుగా ఓ డిపో మాత్రం పెట్టారని.. ఇంత వరకూ కర్రే ఇవ్వలేదని తెలిపారు. ఇదిలా ఉంటే.. ‘చంద్రబాబు ప్రభుత్వం గడిచిన నాలుగేళ్లలో మూడుసార్లు కరెంట్‌ చార్జీలు పెంచింది. అంతంత మాత్రంగా ఉన్న కర్ర బొమ్మ పరిశ్రమకు ఇది మరింత భారమైంది. యూనిట్‌ రూ.4.80 మేర వసూలు చేస్తే.. వచ్చే ఆదాయమంతా దానికే పోతోంది’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వ పెద్దలకు కమీషన్‌ వచ్చే పనులపై ఉన్న తపన.. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఆ కళను బతికించడంపై లేకపోవడం చాలా బాధనిపించింది.  


నన్ను కలిసిన చెరకు రైతన్నలు వాళ్ల చేదు అనుభవాలు నాతో పంచుకున్నారు. ఏటికొప్పాక చక్కెర కర్మాగారాన్నే నమ్ముకుని చెరకు పండిస్తున్నామన్నారు. చంద్రబాబు అధికారంలోకి రాగా>నే కష్టాలు మొదలయ్యాయని చెప్పారు. లాభాల బాటలో నడుస్తున్న ఫ్యాక్టరీ.. నష్టాల ఊబిలోకి వెళ్లిపోయిందన్నారు. ‘పండించిన చెరకుకు గిట్టుబాటు ధర లేదు.. ఫ్యాక్టరీకి చేరేసిన చెరకుకు డబ్బులూ సరిగా ఇవ్వడం లేదు.. పేరుకే టన్నుకు రూ.2,600.. ఇచ్చింది మాత్రం రూ.2,100. ఇప్పటికీ బాకీలు చెల్లించలేదన్నా.. సాగెలా చెయ్యాలి’ అంటూ దీనంగా ప్రశ్నించారు. అడపాదడపా వాళ్లిచ్చే డబ్బులు అప్పులకూ చాలడం లేదని, వడ్డీల మీద వడ్డీలు పెరిగి అప్పుల ఊబిలో కూరుకుపోయామన్నా.. అంటూ కన్నీళ్లు పెట్టారు. వ్యవసాయం దండగని భావించే బాబుగారు అన్నదాత ఆవేదనను ఎందుకు లక్ష్యపెడతారు?!

పులపర్తి దళితవాడకు చెందిన కొండతల్లి అనే చెల్లెమ్మకు భర్త, తల్లిదండ్రులు చనిపోయి చాలా కాలమైంది. రెండేళ్ల కిందట గొంతు నొప్పితో వైజాగ్‌ ఆస్పత్రికెళితే క్యాన్సర్‌ అని తేల్చారు. ఎక్కువ కాలం బతకదన్నారు. ఒక్కగానొక్క కొడుకు కోసం బతకాలనుకుని సీఎంసీ వెల్లూరులో వైద్యం చేయించుకుంటోంది. ఆరోగ్యశ్రీ వర్తించలేదని కన్నీటిపర్యంతమైంది.   ఏటికొప్పాకకు చెందిన మోరంపూడి ఈశ్వరరావు ఏడాది వయసప్పుడే తండ్రిని కోల్పోయాడు. ఈశ్వరరావుకు ప్రాణాంతకమైన రక్త సంబంధ జబ్బు. అదే జబ్బుతో అతని సోదరుడూ మరణించాడు.

విశాఖ ప్రభుత్వాస్పత్రిలోనేమో మందుల కొరత.. బయట తీసుకోవాలంటే వేలల్లో ఖర్చు.. దిక్కుతోచని స్థితిలో సరిగ్గా రెండేళ్ల కిందట అమరావతికెళ్లి ముఖ్యమంత్రిని కలిశాడు. ఆదుకోవాలని వేడుకున్నాడు. కలెక్టర్‌కు చెబుతాను.. ఆయనే చూసుకుంటారని ముఖ్యమంత్రిగారు హామీ ఇచ్చారు. గంపెడాశతో ఇంటికి తిరిగొచ్చాడు. రెండేళ్లయినా ఉలుకూ లేదు.. పలుకూ లేదు. బతకడం భారమైందంటూ బావురుమన్నాడు. ఇలా పలు రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఎందరో నిరుపేదలు, ఉద్యోగులు కలిశారు. ఆరోగ్యశ్రీ వర్తించడం లేదని, హైదరాబాద్‌లో చేయించుకుంటే రీయింబర్స్‌మెంట్‌ చేయడం లేదని వాపోయారు.
 
ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. అత్యవసరము, ప్రాణాంతకమూ కానప్పటికీ.. మన రాష్ట్రంలో పది, పదిహేను వేల లోపే ఖర్చయ్యే సాధారణ పంటినొప్పికి మీ ఆర్థిక మంత్రిగారు సింగపూర్‌ వెళ్లి వైద్యం చేయించుకుంటే.. రూ.2,88,823 రీయింబర్స్‌మెంట్‌ చేశారు. మరి ఒక సాధారణ ప్రభుత్వోద్యోగి గుండె జబ్బు, క్యాన్సర్‌ లాంటి ప్రాణాంతక వ్యాధుల బారినపడి అత్యవసర పరిస్థితుల్లో.. మన రాష్ట్రంలో సరైన వైద్య సదుపాయాల్లేక తప్పనిసరై గత్యంతరం లేక.. హైదరాబాద్‌ వెళ్లి చికిత్స చేయించుకుంటే రీయింబర్స్‌మెంట్‌ ఎందుకు చేయడం లేదు? పదేళ్లు ఉమ్మడి రాజధాని వెసులుబాటు ఉన్నప్పటికీ రాత్రికి రాత్రే హైదరాబాద్‌ నుంచి పారిపోయి రావడమే కాకుండా.. హైదరాబాద్‌లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయాల్సిన అవసరమేమొచ్చింది? ఓటుకు కోట్లు కేసే దీనికి కారణమంటున్న ఉద్యోగులకు, ప్రజలకు ఏం సమాధానం చెబుతారు?
 -వైయ‌స్‌ జగన్‌  
Back to Top