మీపై 420 కేసు ఎందుకు పెట్టకూడదని అక్కచెల్లెమ్మలు ప్రశ్నిస్తున్నారు బాబూ..


 
21–08–2018, మంగళవారం
దార్లపూడి శివారు, విశాఖపట్నం జిల్లా

కొండ కోనల్లో.. సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ కూడా అందని పల్లెల్లో ఈరోజు పాదయాత్ర సాగింది. ఉదయం శిబిరం వద్ద ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు అక్కాచెల్లెళ్లు కలిశారు. అందరూ ఉన్నత విద్యావంతులే. నాన్నగారంటే వాళ్లకెంత ప్రాణమో చెప్పారు. అదే ప్రేమ, వాత్సల్యం నా మీదా ఉందన్నారు. వాళ్లంతా కలిసి నా మీద 55 గీతాలు రాశారు. వాటిని వారే పాడి యూట్యూబ్‌ ద్వారా ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. నిండైన ఆ అభిమానానికి మనసారా కృతజ్ఞతలు చెప్పాను. అదేబాటలో మరో చెల్లెమ్మ.. గూడుపులోవకు చెందిన లక్ష్మి. రాఖీ పండుగకు ఇంకా ఐదు రోజులు ఉన్నప్పటికీ ‘అన్నా ఈ రోజే నాకు నిజమైన రాఖీ పండుగ’ అంటూ ఎంతో ఆప్యాయతతో రాఖీ కట్టి మిఠాయి తినిపించింది. ఆ సోదరి ప్రేమకు బందీ అయ్యాను. 

ఇసుకాసురుల చెరలో నలిగిపోతున్న చిరుద్యోగుల కథ విన్నప్పుడు నిజంగా బాధేసింది. వాళ్లంతా రక్షిత మంచినీటి పథకంలో ఆపరేటర్లుగా, వాచ్‌మన్లుగా పనిచేస్తున్నారు. 14 ఏళ్లుగా పనిచేస్తున్నా వారికిచ్చేది ఇప్పటికీ రూ.7 వేలేనట. ఇదిలా ఉంటే.. టీడీపీ అధికారంలోకి వచ్చాక లెక్కలేనన్ని కష్టాలు వెంటాడుతున్నా యట. గొట్టివాడ వరహా నది ద్వారా పైపులైన్‌ వేసి 97 గ్రామాలకు నీళ్లందించే తాగునీటి ప్రాజెక్ట్‌ అది. అక్కడే పచ్చ చొక్కాల వాళ్లు ఇష్టానుసారం ఇసుక తవ్వేస్తున్నారు.. దీంతో భూగర్భ జలాలు పడిపోతున్నాయి.. తాగునీరందించేందుకు ఇబ్బందిగా ఉంది. అడ్డుకుంటే ఇసుక మాఫియా బరితెగించిపోతోందని, అక్రమ కేసులు పెట్టి పోలీస్‌స్టేషన్‌లలో వేధిస్తున్నారని ఆ చిరుద్యో గులు నిస్సహాయత వ్యక్తం చేశారు. ప్రభుత్వ పెద్దల అండ, పోలీసు బలగాల తోడున్న ఆ ఇసుక మాఫియాను మేమెలా అడ్డుకోగలమని ప్రశ్నించారు. నిజంగా ఇది దారుణమే. కోరలు చాచిన మాఫియాకు చంద్రబాబు డాన్‌ అయితే ఉద్యోగుల పరిస్థితి ఇలాగే ఉంటుంది.


అల్లుమియ్యపాలెం గిరిజనం ఈ రోజు నన్ను కలిసి గోడు చెప్పుకున్నారు. ప్రధాన రహదారికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ గ్రామానికి రోడ్డు లేక ఇబ్బందిపడుతున్నా మన్నారు. పాదయాత్రగా నర్సీపట్నం వచ్చిన చంద్రబాబును కలిసి రోడ్డు వేయాలని కాళ్లావేళ్లా పడ్డామన్నారు. ఆ తర్వాత ఆయన కొడుకు, పంచాయతీరాజ్‌ మంత్రి లోకేశ్‌ కాళ్లు పట్టుకుని మరీ బతిమిలాడామన్నారు. అయినా ఎవరూ పట్టించుకోలేదన్నా అని చెప్పారు. ఇంతకన్నా అమానుషం ఉంటుందా? కమీషన్లు.. కాసుల వేట నిత్యజీవితమైన ఈ ప్రభుత్వ పెద్దలకు గిరిజన ఘోష ఎలా అర్థమవుతుంది?

వెంకటాపురం దళితవాడ అక్కచెల్లెమ్మల ఆవేదన అంతాఇంతా కాదు. కూలీనాలీ చేసుకునే ఆ నిరుపేదలు నాలుగు డ్వాక్రా సంఘాల్లో సభ్యులు. బ్యాంకులకు రుణాలు చెల్లించవద్దు, మొత్తం మాఫీ చేస్తానన్న చంద్రబాబు మాటలు నమ్మారు. చంద్రబాబు అధికారంలోకి అయితే వచ్చారు. కానీ మాఫీ మాట దేవుడెరుగు.. వడ్డీలకు వడ్డీ పెరిగిపోయి రుణం తడిసిమో పెడైంది. మాటిచ్చిన బాబుగారు మొహం చాటేశారు.. రుణమిచ్చిన బ్యాంకువారు కోర్టు నోటీసులు ఇచ్చారు. అన్నెంపున్నెం ఎరుగని ఆ నిరుపేద అక్కచెల్లెమ్మలు చేయని పాపానికి యలమంచిలి కోర్టు మెట్లెక్కారు. పూటగడవడమే కష్టమైన ఆ కూలీలకు లాయర్లను పెట్టుకుని న్యాయపోరాటం చేయాల్సి రావడం ఎంత బాధాకరం? మోసం చేసింది ఒకరైతే.. శిక్ష మరొకరికా?

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. కూలీనాలీ చేసుకుని పూటగడుపుకునే అక్కచెల్లెమ్మలు కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. వారు చేసిన నేరమేమిటి? వారికున్న పూరిళ్లను, చిన్నచిన్న ఆస్తులను సైతం జప్తు చేస్తామంటున్నారని ఆందోళన చెందుతున్నారు. ఇందుకు కారణ మెవరు? కనీసం వారు ఫలానా తప్పు చేశారు అని చెప్పే ధైర్యం మీకుందా? లేదా వారు ఏ తప్పూ చేయలేదని చెప్పగలిగే నిజాయితీ అయినా మీకు ఉందా? మీరు చేసిన మాఫీ మోసం వల్లనే ఈ పరిస్థితి వచ్చింది కాబట్టి మీపై 420 కేసు ఎందుకు పెట్టకూడదు అని ప్రశ్నిస్తున్న ఆ అక్క చెల్లెమ్మలకు ఏమని సమాధానం చెబుతారు? 
-వైయ‌స్‌ జగన్‌  
Back to Top