ఈ పరిస్థితి మారాలి.. పేదల ముఖాల్లో చిరునవ్వులు రావాలి

18–08–2018, శనివారం 
పెదబొడ్డేపల్లి శివారు, విశాఖపట్నం జిల్లా


ఈ రోజు నా పాదయాత్ర మధ్యాహ్నం వరకూ వర్షంలోనే సాగింది. తడిసి ముద్దవుతూ ప్రజలు అభిమానంతో స్వాగతం పలికారు. తమ కష్టాలు చెప్పుకున్నారు. సమస్యలను నా దృష్టికి తెచ్చారు. నాలుగేళ్ల పాలనలో అనుభవిస్తున్న కన్నీటి వ్యథలను నా ముందుంచారు. పన్ను మీద పన్నేస్తూ పేదలకు ఈ ప్రభుత్వం ఎలా గుదిబండగా మారిందో సీతయ్యపాలేనికి చెందిన సత్యవతి తన మాటల్లో వివరించింది. ఆమెకు వరండాతో కూడిన ఓ గది మాత్రమే ఉంది. దీనికామె గతంలో రూ.150 ఇంటి పన్ను కట్టేది. పంచాయతీగా ఉన్న నర్సీపట్నాన్ని మున్సిపాలిటీగా చేసి.. పన్ను ఏకంగా రూ.1,600 చేశారట. నెలకు రూ.75 వచ్చే కరెంటు బిల్లు ఇప్పుడు రూ.400 వస్తోందట. ఒక బల్బు, ఫ్యాను, టీవీ తప్ప కరెంటు వాడకం కూడా పెద్దగా ఉండదని చెప్పింది. రక్త సంబంధిత వ్యాధితో బాధపడుతున్న కొడుకుకే నెలకు రూ.వెయ్యి ఖర్చవుతోందని వివరించింది. ఈ పరిస్థితుల్లో ఈ రీతిన పన్నులు పెంచి భారం మోపితే బతకడమెలా?.. అంటూ బావురుమంది.

ఇలా ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. పన్ను పోటుతో వెన్ను విరుగుతోందని నర్సీపట్నంలోని ప్రతి ఒక్కరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీగా ఉన్నప్పుడే తమ బతుకులు బాగున్నాయని చెప్పారు. మున్సిపాలిటీగా చేసి.. పన్నులను పది రెట్లకు పైగా పెంచారని తెలిపారు. విశాఖ, కాకినాడ కార్పొరేషన్ల కన్నా పన్ను బాదుడు ఎక్కువే ఉందని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. కొళాయి కనెక్షన్‌కు రూ.11,500 కట్టించుకుంటున్నారట. తెల్లకార్డు వారికి సైతం అంతేనట. ఎంత అన్యాయం.. అసలేం అభివృద్ధి చేశారు.. అంటూ వాళ్లు ప్రశ్నించారు. ఎక్కడ చూసినా మురుగు గుంతలు. డ్రైనేజీ వ్యవస్థే లేదు. సరిపడా తాగునీరు అందించే దిక్కేలేదు. మంచినీళ్లు కూడా బురదమయంగా వస్తోంది.

దోమలు, ఈగల వల్ల ఇక్కడ మలేరియా, డెంగీ కేసులు అధికంగా ఉన్నాయని.. అయినా పన్నులు పెంచడమేంటన్నా.. అంటూ వాళ్లు దీనంగా అడిగారు. నిజంగా ఇది ఎంత అన్యాయం! ఒక నిర్దిష్ట విధానం లేకుండా ఇష్టానుసారం పన్నులు పెంచడమేంటి? ఎవరి కోసం పెంచారు? విపరీతంగా పెంచిన పన్నులు కట్టలేని పేదలపై పెనాల్టీలేస్తారా? ఆస్తులు జప్తు చేస్తామని బెదిరిస్తారా? పన్నులు కట్టలేదని ఇళ్లకు తాళాలు వేస్తారా? రాష్ట్రంలో అసలు పాలన ఉందా? జనం గుండె చప్పుడు విన్నాక కలిగిన సందేహాలివి. నర్సీపట్నం పంచాయతీగా ఉన్నప్పుడు ఉపాధి హామీ పనులుండేవయ్యా.. మున్సిపాలిటీని చేశారు.. నోటికాడ కూడు పోయిందయ్యా.. అంటూ ఎందరో పేదలు నా దగ్గర అన్న మాటలు వింటుంటే బాధేసింది.  

బెన్నవరానికి చెందిన వితంతు పేదరాలు రాజులమ్మ ఉదంతం మరీ బాధించింది. కూలిపని చేసుకుంటూ పొట్టపోసుకుంటోంది. ఆదరించేందుకు ఎవరూ లేరామెకు. పరిస్థితి ఇలా ఉంటే.. క్యాన్సర్‌ ఆమెను వేధిస్తోంది. వైద్యం వెక్కిరిస్తోంది. ఆరోగ్యశ్రీ కింద మొత్తం వైద్యం సాధ్యం కాదని డాక్టర్లు చెప్పారట. సగం కీమో థెరపీనే చేస్తామన్నారట. చేతిలో చిల్లిగవ్వ లేదు. మూడేళ్లుగా ఉపాధి హామీ పనికెళ్లినా ఆ డబ్బులూ ఇవ్వలేదయ్యా.. వేలిముద్రలు పడలేదని ఎగరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.. అంటూ బావురుమంది. దాదాపు రూ.20 వేలు రావాలట. ఏం చెయ్యాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నానంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఆమెను ఓదార్చడానికి నా దగ్గర మాటల్లేవు. నిజంగా ఆ క్షణం ఉద్విగ్నభరితమే. కర్కశంగా ఉండే ప్రభుత్వాలుంటే.. పేదల జీవితాల్లో ఇలాంటి ఆవేదనలే కన్పిస్తాయి. ఈ పరిస్థితి మారాలి. పేదల ముఖాల్లో చిరునవ్వులు రావాలి. సాయంత్రం నర్సీపట్నంలో జరిగిన బహిరంగ సభకు భారీ వర్షంలో సైతం అశేషంగా జనం తరలివచ్చారు.  

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. మీ మేనిఫెస్టోలో పన్నుల భారం తగ్గిస్తానని.. చెల్లింపుదారులకు పన్నుల విధానం స్నేహపూర్వకంగా ఉంటుందని ప్రచారం చేసుకున్నారు. కానీ.. ఒక నిర్దిష్ట విధానమే లేకుండా ఇష్టానుసారం అధిక పన్నులు వసూలు చేస్తున్నారు.. ఇది న్యాయమేనా? మీ దృష్టిలో స్నేహ పూర్వక పన్నుల విధానం అంటే.. అడ్డగోలుగా పన్నులు పెంచి, పెనాల్టీలతో ప్రజలను వేధించడమేనా? తెల్లకార్డు ఉన్నవారికి రూ.100కే కొళాయి కనెక్షన్‌ అని మేనిఫెస్టోలో ప్రకటించారు.. కానీ, వాస్తవంలో వేలకు వేలు వసూలు చేస్తున్నారు.. ఇది వంచన కాదా? 
-వైయ‌స్‌ జగన్‌    




తాజా వీడియోలు

Back to Top