ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకానికి పునర్‌వైభవం తేవాలన్న నా సంకల్పం మరింత బలపడింది


06–08–2018, సోమవారం 
శంఖవరం, తూర్పుగోదావరి జిల్లా

ఈ రోజు నెల్లిపూడి, శంఖవరం గ్రామాల్లో సాగిన పాదయాత్రలో పలు రకాల సమస్యలు నా దృష్టికొచ్చాయి. సులభంగా పరిష్కరింపదగిన స మస్యల పట్ల సైతం పాలకులు, అధికారులు నిర్లక్ష్యం వహిస్తుండటం ఆశ్చర్యమనిపించింది. ప్రభుత్వమే కారణమైన సమస్యలూ చాలా ఉన్నాయి.  

బలహీనవర్గానికి చెందిన చేబ్రోలువాసి రాజా.. నూజివీడు ట్రిపుట్‌ ఐటీలో ఐదో సంవత్సరం చదువుతున్నాడు. చదువులో బాగా రాణిస్తున్నాడట. అంతలోనే అనుకోని దుర్ఘటన జరిగింది. ఆప్తమిత్రుడు ఆత్మహత్య చేసుకున్నాడు.. అది చూసి తట్టుకోలేక తీవ్రంగా కుంగిపోయాడు. మిగిలిన ఏడాది చదువూ పూర్తిచేయలేనంతగా డిప్రెషన్‌లో కూరుకుపోయాడు. అతని తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. అక్కడ చదువు మాన్పించి వేరేచోట చేర్పిద్దామనుకుంటే.. ఫీజు బకాయిలు దాదాపు రూ.45 వేలు చెల్లించి సర్టిఫికెట్లు తీసుకోవాల్సిన పరిస్థితి. పెద్ద మొత్తాలు కట్టాలంటే పేదవారికి సాధ్యమేనా? పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్‌ అయిఉంటే ఈ పరిస్థితి దాపురించేది కాదు కదా!  


శంఖవరానికి చెందిన మైనార్టీ సోదరుడు అబ్బాస్‌రసూల్‌ హైదరాబాద్‌లో పాలిటెక్నిక్‌ పూర్తిచేసి.. బీటెక్‌ కంప్లీట్‌ చేశాడు. వస్తున్న అరకొర ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కూడా ఒక్క ఏడాదికే వచ్చింది. మిగతా సంవత్సరాల ఫీజు మొత్తం కట్టాకే సర్టిఫికెట్లు తీసుకోమంటున్నారు. చదువు పూర్తయినా.. డబ్బు కట్టలేక, సర్టిఫికెట్లు చేతికి రాక పేద పిల్లలు నలిగిపోవాల్సిందేనా! ఎస్సీ సోదరి మేరీ.. బాసర ట్రిపుల్‌ ఐటీలో చదువుతోంది. వస్తున్న కాస్త ఫీజురీయింబర్స్‌మెంటు.. మొ దటి సంవత్సరం మాత్రమే వచ్చింది. కారణమడిగితే.. మన అధికారుల నుంచి స్పందనే లేదట.  

బలహీనవర్గానికి చెందిన లక్ష్మిది మరో విషాద గాథ. పేదరికమే ఆమె పాలిట శాపమైంది. పోషించడం కష్టమై.. ఆమె తల్లిదండ్రులు చిన్న వయసులోనే పెళ్లి చేశారు. వివాహం తర్వాత తీవ్ర నిరాదరణకు గురైన ఆ సోదరి.. తన కాళ్లమీద తను నిలబడాలనుకుని బీఎస్సీ నర్సింగ్‌లో చేరింది. అరకొర ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పోను.. ఏడాదికి అదనంగా రూ.35 వేలు కట్టాల్సిన కష్టం ఆమెది. ఆ ఫీజు కట్టలేక కాలేజీకి వెళ్లడమే ఆపేసిందట. ‘చదువు ఆగిపోయింది.. బతుకంతా చీకటిగా అనిపిస్తోందన్నా’ అంటుంటే చాలా బాధనిపించింది. ఆర్థిక ఇబ్బందులతో ఏ పేదవాడి చదువూ ఆగిపోకూడదన్నది నాన్నగారి ఆకాంక్ష. ఆ మహదాశయం ఈ పాలనలో పూర్తిగా నిర్వీర్యమైపోతుంటే.. చాలా బాధనిపించింది. ఫీ జు రీయింబర్స్‌మెంట్‌ పథకానికి పునర్‌వైభవం తెచ్చి, పేదల ఇళ్లల్లో విద్యా కుసుమాలను వికసిం పజేయాలన్న నా సంకల్పం మరింత బలపడింది.  

నెల్లిపూడి దాటాక.. పొలాల్లో పనిచేసుకుంటున్న రైతన్నలు పరుగు పరుగున వచ్చి కలిశారు. ఎకరానికి రూ.25 వేలు పెట్టుబడి పెట్టి వరి పండిస్తున్నారు. 20 – 25 బస్తాలకన్నా పండటం లేదట. బస్తాను రూ.1,000కే అమ్ముకోవాల్సిన దుస్థితి. పెట్టుబడి ఖర్చులూ రాకపోగా.. ఆరుగాలం పడ్డ కష్టమూ నిష్ప్రయోజనమేనన్నది ఆ అన్నదాతల ఆవేదన.  

మధ్యాహ్నం శంఖవరంలో వర్షంలో సైతం ఆత్మీయ జనం నా కోసం ఎదురుచూస్తూ.. కలసి నడుస్తూ.. ఆప్యాయతలు పంచారు. ఆవేదనలు విన్నవించారు. కోనసీమ నుంచి కాపు సోదరులు వచ్చి కలిశారు. నేనిచ్చిన హామీ గట్టి భరోసానిచ్చిందంటూ కృతజ్ఞతలు తెలిపారు. ఓ వైపు కాపు ఉద్యమ సమయంలో అమాయకులను, ఆడవాళ్లను సైతం అక్రమ కేసుల్లో ఇరికించి వేధిస్తున్న చంద్రబాబు.. మరోవైపు కాపుల సంక్షేమం పట్ల కపట నాటకమాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఝాన్సీ అనే చిన్నారి బాలికా సంరక్షణ పథకం బాండును తీసుకొచ్చింది. ‘అన్నా.. డబ్బు వస్తుందా రాదా?’అని అమాయకంగా అడిగింది. అసలు ఆ పథకాన్నే బాబుగారు అటకెక్కించిన విషయం ఆ బంగారుతల్లికి తెలిసినట్టు లేదు. అమాయక ప్రజలకు ఆశపెట్టి.. మోసపుచ్చుతున్న ఈ ప్రభుత్వ నిర్వాకాన్ని చూసి చాలా బాధనిపించింది. ప్రభుత్వాలు మారవచ్చు.. పాలకులూ మారవచ్చు.. పథకాల పేర్లూ మారవచ్చు. కానీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన బాండ్లకు విలువే లేకుండా చేసి.. వాటి ద్వారా ప్రజలకు రావాల్సిన సొమ్మును ఎగ్గొట్టడం చాలా అన్యాయం.  

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. ఎన్నికలకు ముందు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తానని ఆశపెట్టి మాట తప్పడం.. పేద విద్యార్థులను మోసగించడం కాదా? మిమ్మల్ని నమ్మి కాలేజీల్లో చేరి.. డిగ్రీలు పూర్తిచేసి.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కాక.. డబ్బు కట్టలేక.. సర్టిఫికెట్లు తీసుకోలేని పేదల పరిస్థితేంటి? వారికి పైచదువులు ఎండమావులేనా? ఉద్యోగావకాశాలు వదులుకోవాల్సిందేనా? 
వైయ‌స్ జ‌గ‌న్    

Back to Top