పచ్చ నాయకులు తీసేసింది పెన్షన్‌ కాదు.. ఓ పేదరాలి ప్రాణం

 
 
31–07–2018, మంగళవారం
పిఠాపురం, తూర్పుగోదావరి జిల్లా  


విరవాడ, ఎఫ్‌కే పాలెం, కుమారపురం, పిఠాపురంలలో సాగిన ఈ రోజు పాదయాత్రలో విన్న పేదల దయనీయ గాథలు మనసును కలచివేశాయి. ప్రజాకంటక పాలనకు బలవుతున్న బతుకులు గుండెను బరువెక్కించాయి.  
 
నాగగని అనే సోదరుడు తన తల్లి విషాద జీవితం గురించి చెబుతున్నప్పుడు.. పాలకుల పాపం పేదలకు ఎంతలా శాపమవుతుందో కళ్లకు కట్టింది. అతడి తల్లి.. అర్జంపూడి వెంకటలక్ష్మి భర్తను కోల్పోయిన విధివంచిత. అది చాలదన్నట్టు ఏ పనీ చేయలేని అమాయకుడైన చిన్న కొడుకు. తనకొచ్చే వితంతు పింఛన్, కూలిపని చేసి వచ్చే డబ్బులతో బతుకును భారంగా ఈడ్చేదట. తన కష్టం ఎంతైనా కొడుకుకు అండగా ఉండాలని.. బతుకు పోరాటం చేస్తున్న ఆ తల్లికి అనుకోని విపత్తు అశనిపాతంలా తాకింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అప్పటిదాకా వస్తున్న పెన్షన్‌ ఆగిపోయిందట.


కారణం తెలీదు.. నోటి కాడ ముద్దను లాగేసుకున్నట్టు.. ఇదేమి దుర్మార్గమనుకుని ఆ తల్లి కనిపించిన నాయకులందరి దగ్గర తన కష్టాన్ని చెప్పుకున్నా, అధికారుల చుట్టూ తిరిగి మొరపెట్టుకున్నా కాసింత కనికరం చూపినవారు లేరట. కలెక్టర్‌ గారి దగ్గరకు వెళ్తే తన సమస్య తీరుతుందనుకుని, ఆఫీసు చుట్టూ తిరగడం మొదలుపెట్టిందట. కలెక్టర్‌ దొర కనిపిస్తాడు.. నా సమస్య తీరుస్తాడనుకుని ఆశగా రోజుల తరబడి తిరిగితిరిగి అలసిపోయిన ఆ తల్లి గుండె ఆ కలెక్టర్‌ ఆఫీస్‌ ప్రాంగణంలోనే ఆగిపోయిందట. ప్రాణాలు గాలిలో కలసిపోయాయట.

అప్పటిదాకా అమ్మతోడుగా బతికేస్తున్న అమాయకుడైన కొడుకు అది తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసి ఎలాగో బతికి బట్టకట్టాడట. ఇదంతా వింటుంటే గుండెను పిండేసినట్టు అనిపించింది. ఆ తల్లి పెన్షన్‌ కోసం తిరుగుతూ కలెక్టరేట్‌లోనే చనిపోయినందుకు కలెక్టర్‌గారు రూ.4 లక్షల సాయం ప్రకటించారట. రెండేళ్లు గడచిపోయాయి.. ఆ మాట ఒట్టిమాటగానే మిగిలిపోయింది. బాబుగారి హామీల్లానే గాల్లో కలసిపోయింది. ఇంతకంటే పాపం ఉంటుందా? దుర్మార్గానికి పరాకాష్ట కాదా? ఇదీ రాష్ట్రంలో నడుస్తున్న పాలన. పచ్చ నాయకులు తీసేసింది పెన్షన్‌ కాదు.. ఓ పేదరాలి ప్రాణం.. ఓ నిరుపేద కుటుంబానికి జీవం.   
 
ఈ నియోజకవర్గంలో అప్పటిదాకా వస్తున్న పెన్షన్లు ఆగిపోయినవారు, అర్హులైనా పెన్షన్‌ రానివారు ఎందరెందరో ఉన్నారు. కానీ అదేసమయంలో బతికి ఉన్నవారికి సైతం డెత్‌ సర్టిఫికెట్లు సృష్టించి సుమంగళులు అయిన భార్యలను వితంతువులుగా రాసేసి పెన్షన్‌ మింగేస్తున్న దుర్మార్గాలు ఎన్నెన్నో ఉన్నాయట. ఇది పచ్చ నేతల నీచానికి, దిగజారుడుతనానికి పరాకాష్ట. పిఠాపురం మహారాజావారు వితంతు వివాహాలు ప్రోత్సహించి, స్త్రీ జనోద్ధరణకు పాటుపడి, సమాజానికి ఆదర్శంగా నిలిచి ఈ ప్రాంతానికి పేరుప్రఖ్యాతులు సాధించిపెడితే నేటి పాలకులు కేవలం పింఛన్‌ సొమ్ముల కోసం సుమంగళులను సైతం వితంతువులుగా మార్చేసి మాయని మచ్చ తీసుకొచ్చారు.  
 
సాయంత్రం పిఠాపురంలో భారీ బహిరంగ సభ జరిగింది. ఇదే పిఠాపురంలో గత ఎన్నికల ముందు జరిగిన సభలో చంద్రబాబుగారు తాము అధికారంలోకి వచ్చిన ఆర్నెళ్లలోనే కాపులను బీసీల్లో చేర్చివేస్తానని ప్రకటించారు. మరో ఆరు నెలల్లో ఎన్నికలు వస్తున్న తరుణంలో ఆ మాటలు పదే పదే గుర్తొచ్చాయి. అందుకే ఈ సభలో చంద్రబాబు చేసిన మోసాన్ని కాపు సోదరులకు మరోమారు గుర్తు చేశాను. అదే సమయంలో దశాబ్దాల కాపు సోదరుల చిరకాల వాంఛ పట్ల నాకున్న చిత్తశుద్ధిని, నిజాయితీని, నిబద్ధతను, వారి అభ్యున్నతి పట్ల నాకున్న తపనను మరోమారు స్పష్టం చేశాను.

బాబుగారు పదవి కోసం ఎంతకైనా దిగజారగలరు.. ఎందరిని మోసం చేయడానికైనా వెనుకాడరనేది జగమెరిగిన సత్యం. పదవి కోసం తనకు రాజకీయ పునర్జన్మనిచ్చిన పార్టీ వ్యవస్థాపకుడైన సొంత మామను సైతం వెన్నుపోటు పొడిచిన వ్యక్తికి విలువలేముంటాయి? కాపుల సంక్షేమం కోసం రూ. పది వేల కోట్లు కేటాయిస్తామన్న నా ప్రకటనకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్లకార్డులు ప్రదర్శించారు.. కాపు సోదరులు. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుని వారి గుండెల్లో నిలవాలన్న నా సంకల్పం మరింత బలపడింది.  
 
ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. ఇదే నియోజకవర్గంలో కాకినాడ సెజ్‌ భూములను అధికారంలోకి వచ్చిన వెంటనే వెనక్కి ఇచ్చేస్తానంటూ ఏరువాక సాగిన రోజులు గుర్తున్నాయా? మీరు మర్చిపోయారేమో కానీ ఇక్కడ రైతన్నలు మరిచిపోలేదు.   

-వైయ‌స్‌ జగన్‌     
 

Back to Top