ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజలపై బాబుగారు కపట ప్రేమను కురిపిస్తున్నారు


 

29–07–2018, ఆదివారం
వీరవరం, తూర్పుగోదావరి జిల్లా  

 రోజు జగ్గంపేట నియోజకవర్గంలోని రామవరం, గోనేడ, రామచంద్రపురం గ్రామాల మీదుగా పాదయాత్ర సాగింది. ఎన్నికల ముందు మభ్యపెట్టి, మాయ మాటలు చెప్పి పబ్బం గడుపుకొనే రాజకీయ నైజాన్ని మరోమారు బయటకు తీస్తోందీ అధికార పార్టీ. ‘ఎన్నికలకు ఆరు నెలల ముందు.. నాలుగు నెలల కోసం’ అనే నాటకానికి తెరతీసిందని చెప్పడానికి.. ఈ రోజు నన్ను కలిసిన సోదరి కమ్మరి చంద్ర, ఉంగరాల అప్పారావు అన్న చెప్పిన మాటలే సాక్ష్యం.   పాదయాత్ర శిబిరం చెంతనే సోదరి కమ్మరి చంద్ర కలిసింది. పూర్తి వైకల్యం బారినపడ్డ తన ఆరేళ్ల కూతురును ఎత్తుకుని వచ్చిన ఆమె.. వైఎస్‌ కుటుంబం అంటే తమకెంతో అభిమానమని చెప్పింది.

సోదరి షర్మిలను ఇదే జగ్గంపేటలో పాదయాత్ర చేస్తున్న సమయంలో కలిసిందట. అప్పుడు తన బిడ్డకు షర్మిల అని పేరుపెట్టుకున్నానని సంబరంగా చెప్పింది. రెండు కాళ్లూ వైకల్యం బారిన పడ్డ తన బిడ్డకు ‘మీ పాలనలోనైనా పింఛన్‌ ఇప్పించండి’ అని దీనంగా అడిగింది. సదరం సర్టిఫికెట్‌ తెచ్చుకుని పింఛన్‌ పొందుదామని నాలుగున్నరేళ్లుగా తిరుగుతున్నా.. అటు అధికారులుగానీ, ఇటు నాయకులుగానీ పట్టించుకున్న పాపాన పోలేదట. ‘ఇప్పుడు మళ్లీ ఎన్నికలు వస్తున్న తరుణంలో సర్టిఫికెట్‌ ఇప్పిస్తామని.. పింఛన్‌ అందిస్తామని బూటకపు మాటలు చెబుతున్నారు. వారి మాటల మీద నమ్మకం లేదన్నా..’ అంటూ అధికార పార్టీ నేతల నైజాన్ని ఎండగట్టింది.  

ఆమెలాంటి బాధే.. రామవరంలో కలిసిన ఉంగరాల అప్పారావన్నది. తనకు వెన్నెముక సమస్యతో ఆరోగ్యం విషమించినప్పుడు నాన్నగారి ఆరోగ్యశ్రీ ఆదుకుందని చెప్పాడు. ప్రాణాలయితే నిలబడ్డాయిగానీ చచ్చుబడ్డ కాళ్లు, చేతులతో బతుకు నరకంగా మారిందన్నాడు. 80శాతం వైకల్యం ఉన్నట్లుగా సర్టిఫికెట్‌ ఉన్నా.. నాలుగున్నరేళ్లు నాయకులు, అధికారుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయినా న్యాయం చేసేవారు కనిపించలేదట. కానీ ఇప్పుడు రెండు నెలలుగా పింఛన్‌ వస్తోందట. ‘అన్నా.. నాలుగున్నరేళ్లుగా ఎంత ప్రాధేయపడినా ఇల్లు ఇవ్వలేదు.. కాపు లోనూ ఇవ్వలేదు. ఈ పింఛన్‌ అయినా ఎన్నికలు వస్తున్నాయని ఇవ్వడమే’ అంటూ పచ్చ రాజకీయాన్ని ఎత్తిచూపాడు. ఇదీ బాబుగారి ‘ఎన్నికలకు ఆరు నెలల ముందు.. నాలుగు నెలల కోసం’ అనే నాటకం. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హామీలేవీ నెరవేర్చకుండా, ప్రజలకు ఏ మంచీ చేయకుండా దోచుకోవడమే ధ్యేయంగా పరిపాలన సాగించి.. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కపట ప్రేమను కురిపిస్తున్నాడు.  

ఈ జిల్లా ఆయిల్‌పామ్‌ రైతు సంఘ ప్రతినిధులు కలిశారు. ఆ రైతన్నలకు జరుగుతున్న మోసాన్ని వివరించారు. నూనె రికవరీని బట్టి ఆయిల్‌ ఫెడ్‌ సంస్థ ఆయిల్‌పామ్‌ పంట ధరను నిర్ణయిస్తుంది. ఆయిల్‌ ఫెడ్‌ అధికారులు, ప్రయివేటు కంపెనీలు కుమ్మక్కై.. నూనె రికవరీ శాతాన్ని తగ్గించి చూపుతున్నారట. పొరుగున ఉన్న తెలంగాణలో 18.43 శాతం ఉంటే.. మన రాష్ట్రంలో 16.40 మాత్రమే ఉండటమేంటన్నారు. దీనివల్ల మన రైతన్నలు టన్నుకు వెయ్యి రూపాయలు నష్టపోతున్నారని చెప్పారు. జరుగుతున్న అన్యాయంపై ఎంత మొరపెట్టుకున్నా పాలకులు పట్టించుకోవడంలేదంటే.. ఈ దోపిడీలో వారికీ వాటా ఉండటమే కారణమన్నారు. దేశం మొత్తంమీద పామాయిల్‌ సాగు 3 లక్షల హెక్టార్లలో జరుగుతుంటే.. అందులో సగభాగం ఒక్క మన రాష్ట్రానిదే.

ప్రభుత్వ పెద్దలు, అధికారులు, ప్రయివేటు కంపెనీలు కలిసి చేస్తున్న అక్రమాల వల్ల రైతన్నలు ఒక్కో ఎకరాకు రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకూ నష్టపోతున్నారంటే.. ఈ దోపిడీ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోందన్నారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వమే అక్రమార్కులకు కొమ్ముకాస్తుంటే.. రైతన్నలు ఎవరితో మొరపెట్టుకోవాలి? కాపాడాల్సిన కంటి రెప్పే కాటేయడం అంటే ఇదేనేమో!  మధ్యాహ్నం కలిసిన చెరకు రైతులదీ ఇదే దుస్థితి. చెరకు తీపేగానీ వారి బతుకులు మాత్రం చేదుగా ఉన్నాయి. చెమటోడ్చి పండించిన పంటకు గిట్టుబాటు ధరలేదు. పోనీ.. బెల్లం తయారు చేసుకుని అమ్ముకుందామనుకుంటే.. దళారీల దెబ్బకు కుదేలైపోతున్నారు. ఆరుగాలం పడ్డ కష్టానికి ప్రతిఫలం.. అప్పులు, కన్నీళ్లే.  

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. వ్యవసాయంపై ఆధారపడ్డ ప్రజల ఆదాయం పెంచి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపర్చడమే మొదటి ప్రాధాన్యత.. అంటూ మేనిఫెస్టోలో ప్రకటించారు. మరి.. నాన్నగారి హయాంలో దాదాపు రూ.6 వేలు పలికిన బెల్లం ధర.. నేడు సుమారు రూ.3,200కు పడిపోయిందంటే కారణమేంటి? తెలంగాణకన్నా మన రాష్ట్రంలో ఆయిల్‌పామ్‌ రైతుకు టన్నుకు దాదాపు రూ.1,000 తక్కువ రావడం వెనకున్న మర్మమేంటి? రైతన్నల ఆదాయం మెరుగుపర్చడం అంటే ఇదేనా? అత్యంత కరువు పీడిత ప్రాంతాలు మొదలుకుని.. అపార సాగునీటి వనరులున్న గోదావరి డెల్టా వరకూ రైతన్నలందరూ తమ కష్టాలకు కారణం.. మీరు, మీ పాలన తీరు.. అంటున్నారు. వాస్తవం కాదా?    
 

-వైఎస్‌ జగన్‌     


 

Back to Top