ఈ పాలనలో బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి ఎండమావే



25–07–2018, బుధవారం  
పెద్దాపురంలోని దర్గా సెంటర్, తూర్పుగోదావరి జిల్లా  

ఈ రోజు పాదయాత్ర సాగిన సామర్లకోట, పెద్దాపురం మున్సిపాల్టీలలో అడుగడుగునా వేతన జీవుల వెతలు వినిపించాయి. సంక్షేమ పథకాల్లోని డొల్లతనం, అమలు తీరులోని నిర్లక్ష్యం మరోమారు బట్టబయలయ్యాయి. వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు, పార్ట్‌టైమ్‌ అధ్యాపకులు కలిశారు. దశాబ్దాలుగా పనిచేస్తున్నా బతుకు భద్రత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.  రాష్ట్రంలోని ఎయిడెడ్‌ కళాశాలల్లో పార్ట్‌టైం లెక్చరర్ల కష్టాన్ని వారి రాష్ట్ర అధ్యక్షుడు.. రాజకుమార్‌ అన్న వివరించాడు.

రెండు దశాబ్దాలుగా విద్యాబోధన చేస్తున్నా.. వారికి ఇస్తున్న వేతనం రూ.7 వేలేనట. అది కూడా సంవత్సరంలో పది నెలలకే ఇస్తారట. రెగ్యులర్‌ అధ్యాపకులతో సమానంగా పనిచేయించుకుంటున్నా.. వారిలో పదో వంతు వేతనం కూడా ఇవ్వడం లేదట. అన్ని ప్రభుత్వ కార్యక్రమాలకు, అధికారపార్టీ పనులకు బలవంతంగా వాడుకుంటున్నారే తప్ప.. వారి బాధలు విన్న పాపానపోలేదట. ‘సార్‌.. ఇది వెట్టిచాకిరి కాక మరేంటి? మాకన్నా దినసరి కూలీలే నయం. మీరొచ్చాకైనా ఆదుకోండి’అని ఆ గురువులు దీనంగా అడుగుతుంటే.. మనసుకెంతో బాధనిపించింది. ఇరవై సంవత్సరాలకు పైగా పనిచేస్తూ.. పదవీవిరమణకు దగ్గరగా ఉన్న అధ్యాపకులకు రూ.7 వేలు కూడా రావడం లేదంటే.. ఎంత దయనీయం. గురువులకు ఇచ్చే గౌరవం ఇదేనా? ఆ పవిత్ర వృత్తికి ఇచ్చే విలువ ఇంతేనా?  


పేరుకే సెక్యూరిటీ గార్డులం.. ఎలాంటి సెక్యూరిటీ లేని వాళ్లం.. అంటూ వ్యవసాయ మార్కెట్‌ యార్డులలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులు, 14 ఏళ్లుగా పనిచేస్తున్నా క్రమబద్ధీకరించడంలేదని అంగన్‌వాడీ కాంట్రాక్టు సూపర్‌వైజర్లు, శ్రమదోపిడీకి గురవుతున్నామంటూ సెకండ్‌ ఏఎన్‌ఎంలు, మున్సిపల్‌ కాంట్రాక్టు ఉద్యోగులు, క్రాఫ్ట్‌ టీచర్లు వినతిపత్రాలిచ్చారు. అందరూ.. చంద్రబాబు మోసపు హామీల వలలో చిక్కుకుని విలవిలలాడుతున్న వేతన జీవులే.
 
తెలుగుదేశం సిద్ధాంతం దళిత తేజం కాదు.. దళిత ద్వేషం అంటూ మండిపడ్డారు వాలుతిమ్మాపురం, కొండపల్లి తదితర గ్రామస్తులు. నాలుగు దశాబ్దాలుగా అనుభవంలో ఉన్న వందల ఎకరాల దళితుల భూములు.. గత నాలుగేళ్ల నుంచి పచ్చనేతలకు ఫలహారమవుతున్నాయట. నాన్నగారి హయాంలో దళిత సోదరులకు మొక్కలిచ్చి, బోర్లు బిగించి, డ్రిప్పులిచ్చి, రుణమాఫీ చేసి ఆదుకుంటే.. ఈ పాలనలో అధికార పార్టీ నేతలు ఆ భూముల్ని చదును చేయించి ఇస్తామని మభ్యపెట్టి, మోసపుచ్చి, బెదిరించి.. అడ్డదిడ్డంగా తవ్వేసి గ్రావెల్‌ అమ్ముకుని కోట్ల రూపాయలు దోచేశారట. ఆ భూములు ఇప్పుడు నిరుపయోగం అయ్యాయన్నది వారి ఆవేదన. టీడీపీ నేతల దళిత వ్యతిరేక ధోరణికి మరో ఉదాహరణ.. సామర్లకోట ఎంపీపీ ఉదంతం.

ఆ మండల దళిత ఎంపీపీ గతేడాది చనిపోయిందట. నిర్ణీత సమయంలో ఎన్నిక జరిపి దళితులనే ఎంపీపీగా ఎన్నుకోవాల్సి ఉండగా.. రిజర్వ్‌డ్‌ అయినప్పటికీ ఉపాధ్యక్షుడిగా ఉన్న అగ్రవర్ణ వ్యక్తిని అందలం ఎక్కించడానికి ఎన్నికే జరగకుండా అడ్డుకున్నారట అధికార పార్టీ నేతలు. ‘సార్‌.. ఇది దళిత ద్వేషం కాక మరేంటి’అంటూ ప్రశ్నించారు ఆ ఎస్సీ సోదరులు. దళితులైనా, గిరిజనులైనా, బలహీనవర్గాలైనా బాబుగారి వంచనకు, పచ్చనేతల అధికార దాహానికి బలికాని వారు ఉండరేమో! ఈ పాలనలో బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి కేవలం ఎండమావే.. మేనిఫెస్టోలోని కాగితాలకే పరిమితమైన అంశం. రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను సైతం కాలరాసి ఆ వర్గాలను అణగదొక్కుతుంటే.. బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌గారు కలలుగన్న సమ సమాజ స్థాపన సాధ్యమయ్యేదెన్నడు? 


ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. భూమిలేని షెడ్యూల్‌ కులాల వారి కోసం భూమి కొనుగోలు పథకాన్ని పటిష్టంగా అమలుచేస్తామని.. మీ మేనిఫెస్టోలోని 24వ పేజీలో ప్రకటించారు. కానీ వాస్తవంలో దళితులకు ఉన్న భూముల్ని సైతం దౌర్జన్యంగా లాక్కుంటున్నది నిజం కాదా? చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పేదల భూముల్ని అడ్డదిడ్డంగా తవ్వేసి.. వారి ఉపాధిని దెబ్బతీస్తూ.. మీరు మాత్రం ఆ మట్టిని అమ్ముకుని కోట్లు కొల్లగొడుతున్నది వాస్తవం కాదా?
-వైయ‌స్‌ జగన్‌      


తాజా వీడియోలు

Back to Top